ఎస్వీ ల్యాబ్ లో ప్రమాదానికి గురై వ్యక్తి మృతి

by Sridhar Babu |
ఎస్వీ ల్యాబ్ లో ప్రమాదానికి గురై వ్యక్తి మృతి
X

దిశ,చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ లో ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. పరిశ్రమ ఉద్యోగుల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నాగరాజు (34) అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ఎస్వీ లాబ్స్ లో బ్లాక్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి సుమారు 7 గంటలకు నాగరాజు రియాక్టర్లలో రసాయనాలను వేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి లింగస్వామి తిరిగి రియాక్టర్ లో రసాయనాలు వేస్తుండగా అతను కూడా అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న ఆర్ అండ్ డీ డిపార్ట్మెంట్ కు చెందిన మరో వ్యక్తి వారిద్దరినీ బయటకు తీసుకువచ్చాడు. పరిశ్రమలో ఉత్పత్తి కి వినియోగిస్తున్న

రసాయనాలు భారీ గాఢత కలిగి ఉండడమే కాకుండా దుర్వాసనను కలిగిస్తుండడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస ప్రక్రియ ఆగిపోయి నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. నాగరాజుకు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన లింగస్వామిని హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పరిశ్రమలో గాఢ రసాయనాలతో ఉత్పత్తులు చేసే సమయంలో పీవీసీ కిట్లతోపాటు బ్రీతింగ్ ను అందించే పరికరాలను వాడాల్సి ఉన్నా అలాంటి ప్రమాణాలు ఏవీ పాటించకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు తెలుస్తుంది. కావున

ఇకనైనా అధికారులు సంబంధిత పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన నాగరాజుకు భార్యతోపాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు ఇద్దరు చిన్నవారు కావడంతో భార్య రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన బంధువులు పరిశ్రమ ఉద్యోగులను ఎవరిని తమ విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో స్పందించిన యాజమాన్యం రూ. 75 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.

Next Story

Most Viewed