- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగరం @ డిజిటల్ హబ్..
హైదరాబాద్ నగరం మరో చరిత్రాత్మక పరిణామం ముంగిట నిలిచింది. తొలినాళ్లలో ఐటీ విప్లవానికి వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు ‘సెమీకండక్టర్’, ‘డేటా సెంటర్’ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు..

హైదరాబాద్ నగరం మరో చరిత్రాత్మక పరిణామం ముంగిట నిలిచింది. తొలినాళ్లలో ఐటీ విప్లవానికి వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు ‘సెమీకండక్టర్’, ‘డేటా సెంటర్’ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో నగరంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫోర్త్ సిటీ’ (ఫ్యూచర్ సిటీ)పై ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
అయితే, ఈ భారీ పారిశ్రామికీకరణ కేవలం ఆర్థిక అంకెలను మాత్రమే పెంచుతుందా? లేక నగరం తట్టుకోలేని భారాన్ని మోపుతుందా? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.. ఏ పారిశ్రామిక విప్లవమైనా వనరుల వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరానికి ఈ వనరుల పంపిణీ అనేది కత్తిమీద సాము కాబోతున్నదా?
ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా..
సెమీకండక్టర్ పరిశ్రమపై కేంద్రం చాలా ఆసక్తిగా ఉన్నది. ప్రపంచానికి చిప్స్ ఎగుమతి చేసేలా ముఖ్యంగా చైనా, తైవాన్‌తో పోటీ పడేలా దేశం ఎదగాలని ఆకాంక్షిస్తున్నది. అయితే, ఇది తొలి అడుగు మాత్రమే కావడంతో ముందుగా భారత్ నేరుగా అత్యాధునిక (2 నానో మీటర్, 3 నానో మీటర్) చిప్స్ కాకుండా, ‘డిజైన్’, ‘అసెంబ్లింగ్’ (ATMPOSAT) రంగాల ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ డిజైన్ ఇంజినీర్లలో దాదాపు 20% మంది భారతీయులే.. ఈ మేధస్సును వాడుకోవడానికి ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నది. కాగా, సెమీకండక్టర్ పరిశ్రమ రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ సరఫరా గొలుసులో అత్యంత కీలకమైన భాగం కాబోతోంది.
సాఫ్ట్‌వేర్ నుంచి హార్డ్ వేర్‌కి..
ఇప్పటివరకు మనం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితమయ్యాం, కానీ ఇప్పుడు ‘హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్’లో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత హైదరాబాద్ భుజాలపై పడింది. ఒక్క సెమీకండక్టర్ ప్లాంట్ వేల సంఖ్యలో హై-టెక్ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, అనుబంధంగా వందలకొద్దీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జీవం పోయనుంది.. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా, అమెరికా వంటి దేశాల్లో వీసా అనిశ్చితి వల్ల వెనక్కి వస్తున్న భారతీయ టెక్ నిపుణులకు హైదరాబాద్ ఒక గొప్ప గమ్యస్థానంగా మారబోతున్నది. చైనా నిపుణులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే, మన స్వదేశీ మేధస్సుతో సాంకేతిక శిఖరాలను అధిరోహించే అవకాశం చిక్కింది. ఇది కేవలం నగరానికే కాదు, దేశానికే గర్వకారణం.
వనరుల వినియోగం, పర్యావరణ సవాళ్లు..
ఈ ఆర్థిక ప్రయోజనాల వెనుక పర్యావరణం, వనరుల సంక్షోభం కూడా పొంచి ఉందని మరిచిపోవద్దు. సెమీకండక్టర్ తయారీకి అత్యంత కీలకమైన ‘అల్ట్రా ప్యూర్ వాటర్’ వినియోగం నగర తాగునీటి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. చిప్స్ శుభ్రం చేయడానికి రోజుకు కోట్లాది లీటర్ల అత్యంత స్వచ్ఛమైన నీరు అవసరం. ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగుకు చేరిన హైదరాబాద్‌లో, పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ నీటిని మళ్లించడం వల్ల సామాన్య ప్రజల గొంతు ఎండిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు, డేటా సెంటర్లు 24 గంటల పాటు విపరీతమైన విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఇవి విడుదల చేసే వేడి వల్ల నగరంలో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ ఇండియా కల కోసం సామాన్యుడికి విద్యుత్ కోతలు విధించి, ఈ భారీ సంస్థలకు నిరంతరాయ సరఫరా చేయడం సామాజిక అసమానతలకు దారితీసే ప్రమాదం కూడా ఉన్నది.
జీవన ప్రమాణాలపై ఒత్తిడి..
పారిశ్రామిక హబ్‌లుగా మారుతున్న ప్రాంతాల్లో జనాభా సాంద్రత కూడా భారీగా పెరుగుతుంది. ఫోర్త్ సిటీకి వచ్చే వేల మంది నిపుణుల కోసం రవాణా, నివాసంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం నగరపాలక సంస్థకు పెద్ద సవాలుగా మారబోతున్నది. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్, ఈ అదనపు భారాన్ని తట్టుకోగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల మధ్యతరగతి, పేద వర్గాలకు నగరం భారంగా మారే ప్రమాదం ఉన్నది. కేవలం ఐటీ కారిడార్‌లకే పరిమితమైన అభివృద్ధి, నగరం మొత్తం విస్తరించకపోతే అది అసమానతలకు కారణమవుతుంది. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, ముఖ్యంగా ఈ-వేస్ట్, రసాయన వ్యర్థాల విషయంలో కఠినమైన నిబంధనలు లేకపోతే నగరం కలుషితమై మనుగడకే ముప్పు రావచ్చు.
గ్లోబల్ ఫ్యూచర్ సిటీ..
హైదరాబాద్ ఈ రెండు పరిశ్రమలను తట్టుకోవాలంటే ప్రభుత్వం కేవలం ‘రాయితీలు’ ఇవ్వడమే కాకుండా, కఠినమైన ‘పర్యావరణ నిబంధనలు’ కూడా అమలు చేయాలి. ‘జీరో లిక్విడ్ డిస్చార్జ్’ (నీటిని 100% పునర్వినియోగించడం), ‘గ్రీన్ ఎనర్జీ’ (సౌర, పవన విద్యుత్) వాడకాన్ని ఈ భారీ కంపెనీలకు తప్పనిసరి చేయాలి. సామాన్యుడి తాగునీటికి, విద్యుత్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఈ పరిశ్రమలకు ప్రత్యేక వనరులను సమకూర్చాలి. అభివృద్ధి అనేది భవిష్యత్తు తరాల గాలిని, నీటిని తాకట్టు పెట్టి సాధించేది కాకూడదు. పెట్టుబడుల రాకను స్వాగతిస్తూనే, మన ప్రాథమిక వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించినప్పుడే హైదరాబాద్ నిజమైన ‘గ్లోబల్ ఫ్యూచర్ సిటీ’గా చరిత్రలో నిలిచిపోతుంది.
-హరీశ్ ఎస్పీ






