- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులు ఎత్తి దండం పెట్టి.. ఎర్ర తివాచీలు పరచడం ఎంతవరకు?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి దండం పెడుతూ మావోయిస్టులకు ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానం పలకడం తెలిసిందే.

మన దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి దండం పెడుతూ మావోయిస్టులకు ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానం పలకడం తెలిసిందే. ఆ తరువాత వరుసగా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఆ వరవడినే అందిపుచ్చుకొని ప్రకటనలు చేయడం చూస్తున్నాం. వాటి ఫలితాలూ చూస్తున్నాం. ఇటీవలే, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మరో విడత మావోయిస్టులు లొంగిపోవాలని చేసిన ప్రకటన స్వాగతయోగ్యంగా ఉన్నది. మార్చి 31కి ముందు ఈ ప్రకటన రావడం దాని ప్రత్యేకత. దాని ఫలితాలు ఇపుడు మన ముందున్నాయి. నిన్న అత్యున్నత స్థాయిలో జరిగిన లొంగుబాట్లు ఈ దేశంలో సాయుధ మావోయిస్టుల ముగింపు దిశలో చివరాఖరుకు ముందడుగు అనుకోవచ్చేమో..
ప్రకటనలకే పరిమితమైతే ఎలా?
గత రెండేళ్లలో 500కు పైగా మావోయిస్టులు లొంగిపోయారనీ మరో 11 మంది తెలుగు వాళ్లు మిగిలి వున్నారనీ, వారూ రావాలనీ డీజీపీ ప్రకటించారు. వారి రాకకు మనమంతా ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానిద్దాం. మనం పరిచే ఎర్ర తివాచీలు వారు స్పష్టం చేస్తున్న రాజకీయాల కొనసాగింపునకు. కానీ మంత్రులు, పోలీసు అదికారులు పరిచే ఎర్ర తివాచీలు ఎంత వరకు అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా లొంగిపోయిన వారిని వేధిస్తున్న సమస్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అన్ని రాష్టాలలో ఒకే విధానం..
రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన మమత తన గోడు కలెక్టర్‌కు విన్నవించుకున్నది అందరం చూశాం. తనకు ఛత్తీస్‌గఢ్‌లో అధికారులు హామీ ఇచ్చిన ఏ సహాయం అందలేదనీ మొర పెట్టుకుంది. ఇది ఒక్క మమత సమస్యనా......కాదు, లొంగిపోయిన వారందరి సమస్య. వారు సమాజంలో గౌరవంగా బతకడానికి వారు ఎన్నుకున్న అధికారుల ఎర్ర తివాచీల దారి ఫలవంతం కావాలి. కానీ అది సాధ్యమా? మావోయిస్టు సమస్య కేంద్రం దేశవ్యాప్త సమస్యగా తీసుకొని వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిపట్ల రాష్ట్రప్రభుత్వాలు కూడా అదేవిధానాన్ని అనుసరించడం మావోయిస్టు సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది. బయటికి ప్రజలమధ్యకు వస్తున్నామంటూ, పరిస్థితులు మారిపోయినాయంటూ, లొంగిపోతున్న మావోయిస్టులకు మీడియాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. అది చాలా అవసరం కూడా. మావోయిస్టు మల్లోజుల తాజా ప్రెస్ మీట్‌లో చేతులెత్తి జోడిస్తూ దేవ్ జీ తదితరులు బయటకు రావాలని చేసిన విన్నపం ప్రత్యక్ష ఫలితాలు చెప్పనవసరం లేదు.
పునరావాసం నిరాశాజనకం
లొంగిపోయిన వారికి అందించే రివార్డుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంటోంది. ఇకవారికి అందిస్తాం అంటున్న ఇళ్లకు నెలలు గడిచిపోతున్నా ఇస్తున్న దిక్కే ఉండడం లేదు. ఇక భూముల విషయానికి వస్తే అవి కాగితాల మీదనైనా కొన్ని రాష్ట్రాలలో నోచుకోవడం లేదు. లొంగిపోయిన మావోయిస్టుకు ఒక ఇల్లుతోపాటు 5 ఎకరాల భూమి ఇస్తామని ఛత్తీస్గఢ్‌లో వుంది అంటారు. తెలంగాణలో కూడా భూమిని ఇస్తామంటారు. కానీ తెలంగాణలో ఒక కేంద్రకమిటీ సభ్యుడు 2016లో లొంగిపోతే ఆయనకు భూమి ఇటీవలికాలంలో బండలు, రాళ్లు-రప్పలతో కూడుకున్న భూమి దొరికింది. ఒకఎస్.జడ్.సీ. మెంబర్ 2014లో లొంగిపోతే ఆయనకు నిన్నమొన్న అలాంటి భూమే దొరికింది. మిగతా రాష్ట్రాలలో భూమి ఇచ్చిన పాపాన పోవడంలేదు. ఇలా ఉంటే వారు బయటి జీవితంలో మారుతున్న పరిస్థితుల్లో నెట్టుకురావడం ఎలా సాధ్యమవుతుంది, ఎర్ర తివాచీలు ఎటు పోతాయో అధికారులే చెప్పాలి.
ఆధార్, రేషన్ కార్డుకే గతి లేదు...
ఇల్లు, భూముల విషయం అలా ఉంటే, వారికి బయటికి వచ్చిన తొలిరోజు నుండి కడుపులోకి బుక్కదిగడానికి కావలసిన నూకలకోసం తిప్పలు మొదలవుతుంది, రేషన్ కార్డు కోసం ఆరుమాసాలకు పైగా తిరగాల్సిన పరిస్థితి, ఆధార్ కార్డు లేకపోతే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఆ ఆధార్ కార్డు దొరకడానికి అనేక అవకతవకలతో అవస్థలు పడుతున్నారు. ఒక రాష్ట్రంలో ఆరుమాసాలకి ఇస్తే మరోరాష్ట్రంలో అదెప్పుడు ఇస్తారో తెలువదు. ఎవరిస్తారో తెలువదు. ఆధార్ కార్డు లేకుండా ఏపనిజరగని పరిస్థితి దేశంలో నెలకొన్న విషయం తెలిసిందే. వారికి పాన్ కార్డు అంటారు, మ్యారేజ్ సర్టిఫికెట్ అంటారు, బ్యాంక్అకౌంట్ తెరుస్తామంటారు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులైనా వెంటనే అందివ్వని ఉదాహరణలు కోకొల్లలు. లొంగిపోయిన వారికి వెంటనే కనీసం ఒకనెల రోజులలోపు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇల్లు, భూమి ఇలాంటివి సమకూరుస్తేనే కేంద్రప్రభుత్వం ఎర్రతివాచీ పరిచి మావోయిస్టులను స్వాగతిస్తున్న దానికి అర్థం ఉంటుంది.
వారి ఆరోగ్య సమస్య కీలకం
ఇక లొంగిపోయిన వారిలో నాయకత్వం వయసు పైబడినవారు ఉండడం అనేక జబ్బులతో సతమతమవుతూ ఉండడంతో వారు కొన్నిఅదనపు సమస్యలను ఎదురుకుంటున్నారు. వారికి కేంద్రప్రభుత్వం ఉచితంగా మందులు అందించే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. వారు నెలనెలా వేలరూపాయలు మందులకోసం ఖర్చుచేయడం తలకు మించిన భారంగా ఉంటుంది. కానీ అవితప్పని ఖర్చులు. లొంగిపోయిన మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో కిడ్నీలు దెబ్బ తిని బాధపడుతున్న వార్త మీడియాలో వైరలయింది. అందుకోసం కేంద్రప్రభుత్వం వారికి శేష జీవితాంతం ఉచితంగా మందులు లభించే అవకాశాన్ని కల్పించాలి.
అరెస్టయినవారి పట్లా ఔదార్యం చూపాలి
మరో ముఖ్యమైన విషయం ఇటీవల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఆ ప్రభుత్వం జైళ్లల్లో ఉన్నవారి కేసుల విషయంలో అనుసరించే వైఖరిని ప్రకటించింది. అది వినడానికి బాగానే ఉన్నది. ఉద్యమంలో అంతా కలిసి పనిచేసినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదకర పరిస్థితులలో కొందరు అరెస్టులు కావడం, జైలుపాలుకావడం, అనేకరకాల కేసులు ఎదుర్కోవడం, మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి వారిని కేంద్రప్రభుత్వం పరిశీలించి వారికి కూడా లొంగిపోయినవారి విధానాలనే వర్తింపచేస్తే ఆ సమస్య పరిష్కారం దిశలో మరో సానుకూల ముందు అడుగు అవుతుంది. ప్రజలకు ఒక మంచిసందేశం ఇచ్చినవారు అవుతారు. ఇలా వారి సమస్యలు ఇంకా చాలానే వుండి వుంటాయి. వాటిని కేంద్రం చేపట్టి పరిష్కరించడం ద్వారా తిరిగి వారు మరో 'దారి తప్పిన' వారి ఆలోచనలకు దగ్గరవకుండా వుంటారని ఆశించవచ్చు!
చిత్ర
63024 18202






