- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోమ్ మేకర్స్..వర్కింగ్ విమెన్.. సమాన బాధ్యతలకు గుర్తింపు ఎవరికీ?
సాధారణంగా ఉద్యోగం చేయకుండా గృహ బాధ్యతలు నిర్వహించే వారిని హోమ్ మేకర్ అనాలి. అది పురుషుడు లేదా స్త్రీ కావచ్చు. కానీ ఎక్కువ శాతం స్త్రీలే ఇంటి బాధ్యత తీసుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో..

సాధారణంగా ఉద్యోగం చేయకుండా గృహ బాధ్యతలు నిర్వహించే వారిని హోమ్ మేకర్ అనాలి. అది పురుషుడు లేదా స్త్రీ కావచ్చు. కానీ ఎక్కువ శాతం స్త్రీలే ఇంటి బాధ్యత తీసుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో.. కాబట్టి ఇంతకుముందు హౌస్ వైఫ్స్ అనే వారిని ఇప్పుడు హోమ్ మేకర్స్ అంటున్నారు. ఈ పదంతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. దాని వాడకంతోనే చిక్కు. హౌస్ వైఫ్‌కు వ్యతిరేక పదం హౌస్ హస్బెండ్ కాదు, వర్కింగ్ ఉమన్. మరి హౌస్ వైఫ్‌ని హోం మేకర్ అంటే వర్కింగ్ ఉమన్‌ని ఏమనాలి? హోమ్ బ్రేకర్ అనాల్నా?
కనీస గుర్తింపు లేదు వాళ్లకు...
హౌస్ వైఫ్ అంటే కాసింత గుర్తింపు ఉంటుందేమో కానీ.. వర్కింగ్ ఉమన్ చేసే చాకిరికి కనీసం గుర్తింపు, సింపతీ కూడా లేదు. చాలామంది వర్కింగ్ విమెన్ ఉద్యోగంతో పాటు హౌస్ వైఫ్ చేసే చాకిరీ మొత్తం తు.చ తప్పకుండా చేస్తుంటారు. ఏదో ఉద్యోగం చేస్తుంది అనగానే ఇంట్లో ఏం పని చేయదు లేదా భార్యా, భర్త సగం సగం పనిచేసుకుంటారు.. లేదా ఇంటి నిండా పనివాళ్లు ఉంటారనే భ్రమలో జనా లుంటారు. అది కూడా ఇండియాలో, ఇది వెస్ట్ దేశాల్లోనే దిక్కులేదంటుంటే.
మగపుట్టుక పుట్టి.. వంటా?
ఉద్యోగం చేసే మగాడు.. సగం పని కాదు కదా ఇక్కడి గ్లాసు తీసి అక్కడ పెట్టని వాళ్లే ఎక్కువుంటారు. ఏమన్నా అంటే కుర్చీలో కూర్చొని కాళ్లూపుకుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఎవడు చేయమన్నడు ఉద్యోగం అని మీద పడతరు.. కొందరు మొగుళ్లు నామ్ కే వాస్తే కొంచెం పని చేస్తరు. అది కనక చుట్టుపక్కల వాళ్లకి తెలిసిందంటే ఖతం ఇంక. ఆమె టిక్కుటక్కు మని తయారై ఆఫీస్‌కి పోతే పాపం భర్త పనంత చేస్తడు.. అని ఒక తెలుగు సీరియల్ మొదలౌతుంది. మగ పుట్టుక పుట్టి నా కొడుకు ఈ పనులు చేయాల్నా? ఏం సుఖం వాడికి అని అత్తమామలు గునుగుతూనే ఉంటారు..
అమెరికాలోనూ ఇదే బతుకు..
హౌస్ వైఫ్ కున్న కనీస గుర్తింపు ఉద్యోగం చేసే మహిళలకు ఉండదు. వీళ్లు చేసే ఇంటి చాకిరీ అస్సలు లెక్కలోకి రాదు. మళ్లీ అందులో చాలామందికి అంత చేసినా ఆర్థిక స్వాతంత్రం ఉండదు. ఇప్పటి జనరేషన్‌లో కూడా భార్య ఉద్యోగం చేస్తున్నా తన ఏటీఎం కార్డు భర్త ఉంచు కుంటున్న అమ్మాయిల గురించి నాకు తెలుసు, అది కూడా అమెరికాలో.. అట్లనే హౌస్ వైఫ్‌గా ఉండి భర్త ఇచ్చిన ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డుతో తమ ఇష్టం వచ్తినట్టు వాడుకునే స్వేచ్ఛ ఉన్న వాళ్లు కూడా ఉంటారు.
సమానంగా చేయడానికి యుగాలు పడుతుంది!
ఇదంతా వదిలేద్దాం. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల్లో అసలు హౌస్ వైఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఇంటి పనితో పాటు చచ్చినట్టు బయటికి పోయి పని చేయాల్సిందే. నాకు తెలిసిన చాలా కేసులో మొగుడు తాగొచ్చి డబ్బులు ఇంటికి ఇవ్వకుండా భార్య సంపాదించిన డబ్బులు కూడా గుంజుకొని పోతుంటాడు. మరి ఆ సామాజిక వర్గంలో హోమ్ మేకర్స్ అసలు లేనే లేరా.. వర్కింగ్ ఉమెన్ గురించి కొన్ని స్టీరియో టైప్స్ నుంచి బయటికి రండి. ఇద్దరూ కలిసి సమానంగా ఇంటి పని చేసే స్థితికి రావడానికి కొన్ని యుగాలు పడుతుంది.
- మాలతి పల్లా
90103 96655






