- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర, సంస్కృతి, అహింసా.. నేటి తరానికి విజయదశమి పాఠం!
కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, నైతిక తరంగాలను అనంత విశ్వవ్యాప్తం చేసిన పుణ్య భూమి, వేద భూమి మనది. సత్యమేవ జయతే అంటూ శాస్త్రీయ

కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, నైతిక తరంగాలను అనంత విశ్వవ్యాప్తం చేసిన పుణ్య భూమి, వేద భూమి మనది. సత్యమేవ జయతే అంటూ శాస్త్రీయ భావాలను సత్యాన్వేషణగా కాల చరితపై విశ్వ గురువుగా నిలిచిన దేశం మనది. భిన్న సంస్కృతులు, వివిధ మతాలు ఉన్నప్పటికీ మానవత్వాన్ని ప్రబోధిస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం అక్టోబర్ 2న ఉదయం అహింసా కిరణాలతో విజయ సంకేతాన్ని చూపుతుంది. ఈ రోజు అంతర్జాతీయంగా ఓ ప్రముఖ స్ఫూర్తివంతమైన రోజు, జాతీయంగా ఆధ్యాత్మిక విలువల్ని పంచే ఓ పండగ రోజు..
ప్రస్తుత శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా నవతరం నాటి చరిత్రను గాని, సాంస్కృతిక వైభవాన్ని గాని తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. వర్చువల్ ప్రపంచంలోనే బతుకుతూ, రియల్ జీవితాన్ని కోల్పోతున్నారు. దాని నుంచి ఎన్నో జీవన గమన సమస్యలతో నిత్య యుద్ధం చేస్తూనే ఉన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయంగా..
అందుకే పిల్లలుగా ఉన్నప్పుడే మన పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఆధ్యాత్మిక, నైతిక విలువలతో పాటు చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏ నాటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ధర్మంపై ఏనాడు అధర్మం గెలవలేదని నిరూపించిన విజయదశమి పండుగ గురించి మనమంతా తెలుసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల తాలూకు ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని తెలియజేయాలి. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా, రాముడు రావణ సంహారం చేసిన రోజుగా, అర్జునుడు కౌరవులను ఓడించిన రోజుగా ఇలా చరిత్రలో స్ఫూర్తి వంతమైన సంఘటనలకు సంకేతంగా దసరాను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా అందరం కలిసి సమిష్టిగా భోజనం చేయడం, పూజలు చేయడం, గ్రంథాలను పారాయణం చేయడం, రావణుడి విగ్రహాలను దహనం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాల వల్ల మనలోని ఐకమత్యం బలపడుతుంది. ప్రజల్లో వసుదైక కుటుంబ భావన ఏర్పడుతుంది.
స్త్రీ శక్తికి నిదర్శనం కూడా..
మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దుర్గాదేవి వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. మొదటి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతీగా అమ్మవారు అశేష భక్త జనవాహిని సాక్షిగా పూజలందుకుంటారు. ఈ పండుగను స్త్రీ శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. స్త్రీని అనంత శక్తి స్వరూపిణిగా పేర్కొనవచ్చు. నేటి తరం అమ్మాయిలు, మహిళలు తమ అంతర్గత శక్తి గురించి తెలుసుకొని అన్ని రంగాల్లో అవని నుంచి అంతరిక్షం దాకా ఎదగడానికి ఈ పండుగలో ఓ ప్రేరణ పాఠం ఉంది. బలమైన జీవన తాత్వికత దాగి ఉంది. ఈ పండుగ రోజు జమ్మి చెట్టు ప్రత్యేక పూజలు అందుకుంటుంది. జమ్మి ఆకులను బంగారు చిహ్నంగా భావించి, పిల్లలు పెద్దల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు.
మనం అనుసరించాల్సిన మార్గం..
1869 అక్టోబర్ 2న జన్మించిన బక్క పలుచని గాంధీ, పరిణామ క్రమంలో మలిదశ భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, యావత్ ప్రపంచానికి మహాత్ముడిగా ఎదిగిన వైనం వివిధ రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులను సైతం ప్రభావితం చేసింది. వారు గాంధీజీని గౌతమ బుద్ధుడు, జీసస్ వంటి వారితో పోల్చడం ప్రతి భారతీయుడికి గర్వకారణమే. కానీ కొన్ని సందర్భాల్లో మన దేశ రాజకీయాలు గాంధీని భారత స్వాతంత్ర ఉద్యమానికి కుల, మత రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయడం ఆందోళన చెందాల్సిన విషయం. గాంధీజీ స్వాతంత్ర్య సంగ్రామంలో అనుసరించిన విధానాలపై, ఎన్నుకున్న మార్గాలపై వివిధ రకాల విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన జీవనయానంలో అనుసరించిన సత్యం, ప్రేమ, అహింసా, శాంతి వంటి ఆదర్శాలు ఇంకా కొన్ని శతాబ్దాల పాటు మానవాళి జీవన సరళిని తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రతీకార ద్వేషాలతో ఆధిపత్యం మాయలో, యుద్ధాలతో రక్తసిక్తం అవుతున్న నేటి ఆధునిక ప్రపంచానికి సహనం, పరస్పర ఆధారిత చర్చలు, నిరాహార దీక్ష, సత్యాగ్రహం వంటి గాంధేయవాదమే నేడు అనుసరించాల్సిన మార్గం. 40 కోట్ల మంది భారతీ యులను ఏకతాటిపై తీసుకొచ్చిన గాంధీజీ సూక్తులే, నేడు అనేక రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వివేకానంద, గాంధీజీ ప్రసంగాల చేత ప్రభావితమై, నెహ్రూ మరణానంతరం భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, అద్భుతంగా దేశ సేవ చేస్తూ, జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించిన లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా అక్టోబర్ 2నే. ఈ సందర్భంగా ఆ మహానుభావుడిని కూడా స్మరించుకుందాం.
కంటికి కన్నే సమాధానమా?
ఎన్నో విశిష్టతలతో కూడిన మన దసరా పండుగను, మహాత్ముడి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటూ, డిజే సౌండ్‌ల శబ్ద తీవ్రతను తగ్గిస్తూ పర్యావరణ పక్షమై మన బాధ్యత నిర్వహిద్దాం. అందరం ఏకమై మన ఉమ్మడి కుటుంబ గొప్పతనాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుద్దాం. ఈ పండుగ సందర్భంగా మన రామాయణ, మహాభారత, భాగవత కథల్లోని నీతులు చెబుతూ ఆధ్యాత్మిక నైతిక వెలుగులను నింపుదాం. మహాత్ముడి ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ను ఈ పండుగ కానుకగా మన పిల్లలకు అందిద్దాం. కంటికి కన్నే సమాధానమైతే ప్రపంచమే గుడ్డిదయిపోతుందన్న మన మహాత్ముని స్వరాన్ని నేటి ప్రస్తుత ప్రపంచానికి బలంగా వినిపిద్దాం. ఈ విజయదశమి నాడు మనందరి కుటుంబాల్లో చిరునవ్వుల పున్నమి వెన్నెల వెలుగులు పూయాలని మనఃస్ఫూర్తిగా కోరుకుందాం.
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536






