- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో మోహన్ లాల్ .. దర్శకుడి నటుడు
మానవ జీవితం ఒక వేదిక, అతనిలోని కళ ఒక వ్యక్తీకరణ మాత్రమే కాదు అది ఒక మహా త్యాగం. మరి మానవ జీవితంలో ‘వానప్రస్థం’ ఒక అనివార్యం.

‘మానవ జీవితం ఒక వేదిక, అతనిలోని కళ ఒక వ్యక్తీకరణ మాత్రమే కాదు అది ఒక మహా త్యాగం. మరి మానవ జీవితంలో ‘వానప్రస్థం’ ఒక అనివార్యం. ఈ విషయాన్ని దర్శకుడు షాజీ కరుణ రూపొందించిన ‘వానప్రస్థం’ సినిమా మనిషి జీవన యాత్రలోని అత్యంత కఠిన వాస్తవాన్ని ఆవిష్కరించింది. ఒక మనిషి కళలో ఎంత దివ్యపురుషుడయినా, జీవితంలో అతి సాధారణ పరిమిత మానవుడే అన్న సత్యాన్ని చూపించింది.
అందులో ఈ ఏటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మోహన్ లాల్ పోషించిన ప్రధాన పాత్ర కణ్హికుట్టన్. అది ఆయన నట జీవితంలోనే కాక, భారతీయ సినిమా రంగ చరిత్రలో ఒక అమరమైన పాత్రగా నిలిచిపోయింది. ఈ సినిమాలో మోహన్ లాల్ అద్భుతమయిన అనితర సాధ్యమైన నటనని ప్రదర్శించారు. వానప్రస్థం సినిమా అనేక ప్రశ్నల్ని సంధిస్తుంది.
దర్శకుడి భావోద్వేగానికి నిలువెత్తు రూపం..
కళలో కళా ప్రదర్శనలో అంకితుడై పరిపూర్ణుడైన మనిషి తన జీవితంలో ఎందుకు అసంపూర్ణుడవుతాడు, ప్రదర్శనల్ని చూసి ఆనందపడి అద్భుతమని ప్రశంసించిన ప్రజలు, సమాజం.. అదే కళాకారుణ్ణి దేవుడిగా పూజించే ఈ సమాజమే అతని వ్యక్తిగత అవసరాలను ఎందుకు మరచిపోతుంది? బలహీనతల్ని ఎందుకు అంగీకరించదు? వానప్రస్థం అనే దశ ఈ సినిమాలో కళాకారుడు కణ్హికుట్టన్ జీవితంలో ఎందుకు చాలా ముందుగానే ప్రారంభమైంది ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ‘ఏ కళయినా మనిషికి విముక్తిని ఇవ్వగలదేమో గాని, అతని జీవన సంబంధాలను రక్షించలేదు’. ఇది చేదు నిజం. వాస్తవం చెప్పాలంటే ‘వానప్రస్థం’ కేవలం సినిమా మాత్రమే కాకుండా, అది ఒక కవిత్వానుభూతి. ఇందులో మోహన్ లాల్ దర్శకుడి భావోద్వేగానికి నిలువెత్తు రూపాన్ని ఇచ్చాడు. అది మోహన్ లాల్ ప్రతిభ.
కళలో దివ్యత్వం.. జీవితంలో దుస్థితి
వానప్రస్థం సినిమా కథాంశం విషయానికి వస్తే కథకళి కళలో ప్రావీణ్యం పొందిన కణ్హికుట్టన్ (మోహన్ లాల్) వేదికపై దేవతల, వీరుల, దివ్య పాత్రలను సజీవం చేస్తాడు. కానీ వేదిక వెలుపల తల్లి నిరాదరణ అంగీకరించలేని తనం అతనిలో ఓ శాశ్వత గాయాన్ని మిగిల్చుతుంది. ఇక భార్య, కుమార్తెతో సరయిన అనుబంధం ఏర్పడలేక పోవడం మరో దుఃఖం, తండ్రిగా తన స్థానాన్ని కోల్పోవడం అతని వ్యక్తిగత విషాదం. తనకు కళలో దివ్యత్వం ఉన్నా, జీవనంలో అతని దుస్థితి అసంపూర్ణత. ఈ వైరుధ్యమే కథకు మూలం.
సినిమాల్లో కమర్షియల్ నటులు..
ఇక భారతీయ చలనచిత్ర చరిత్రలో మలయాళ సినీ రంగానిది ప్రత్యేకమైన స్థానం. మలయాళం సినీ రంగంలో ఎందరో గొప్ప దర్శకులు సినీ మాధ్యమానికి దృశ్య కళకు కొత్త భాష్యాలు చెప్పారు. అదూర్ గోపాలక్రిష్ణన్, అరవిందన్, ఎం.టి., షాజీ కరుణ్, జాన్ అబ్రహం, మోహనన్ ఇంకా అనేక మంది మళయాళ సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి దర్శకుల సమాంతర సినిమాల్లో పెద్ద వ్యాపార సినిమా నటులు ప్రధాన పాత్రల్ని పోషించడం అక్కడి విలక్షణత. అలాంటి వారిలో మళయాళ సూపర్ స్టార్స్‌గా పిలువబడే మోహన్ లాల్, మమ్ముట్టిలు ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి విలక్షణతను కల్పించిన మహానటులలో మోహన్ లాల్ ఒక ప్రధాన శిఖరం. సహజత్వం, గాఢత, సరళమైన శైలి ఇవన్నీ కలిపి ఆయన నటనకు ఓ ప్రత్యేకమైన ముద్రను వేశాయి. దాదాపు నలభై ఏళ్లకు పైగా విభిన్న పాత్రలను జీవిస్తూ, మలయాళ సినీ ప్రపంచంలోనే కాక, భారతీయ నటనా సంప్రదాయంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
చూపులతోనే గాఢమైన భావాన్ని చూపించి
మోహన్ లాల్ నటనను ఒకరకంగా ‘నటుడి ధ్యానం’గా చెప్పుకోవచ్చు. కేవలం తన కళ్లతోనే పలు భావాలను పలికించే శక్తి, శరీర భాషలోని కఠిన్యత, గాత్రంలోని గొప్పదనం మోహన్ లాల్ సొంతం. మోహన్ లాల్ నటనలో సహజత్వం ప్రధాన గుణం. ఆడంబరానికి ఎంతో దూరంగా, కృత్రిమత్వం లేకుండా, నిత్యజీవితంలోని భావోద్వేగాలను గొప్పగా స్వచ్ఛంగా వ్యక్తీకరించగలగడం మోహన్ లాల్ ప్రత్యేకత. శరీరం భారీదయినా చిన్న చిన్న ముఖ భంగిమలతో, కళ్ల చూపులతోనే ఒక గాఢమైన భావాన్ని అందించగల ప్రతిభ ఆయనది. వైవిధ్యం ఆయనలో మరొక విశిష్టత. హాస్యరసాన్ని పండించే పాత్రల నుంచి భారతం లాంటి గంభీరమైన పాత్రల వరకు సముచితంగా ఆవిష్కరించగలడు. కిలుక్కం, నదోడికట్టు వంటి సినిమాల్లో వినోదాత్మక నైపుణ్యం ఎంత అద్భుతమో, అదే స్థాయిలో విషాదాన్ని, గాఢానుభూతినీ ప్రతిబింబించే ప్రతిభ మోహన్‌లాల్‌లో ఉంది.
ఈ అవార్డు సముచితమైందే..
మోహన్ లాల్ నటనలో అనుభూతుల లోతు స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలో పూర్తిగా లీనమై పోవడం ఆయనకు సహజసిద్ధమైన నైపుణ్యం. నిజానికి మోహన్ లాల్ ఒక ‘నటుడి నటుడే కాదు దర్శకుడి నటుడు కూడా. తనకిచ్చిన పాత్రలోని మానసిక తత్వాన్ని, లోతును పట్టుకుని, దానిని సహజత్వంతో పలికించే ఆయన శక్తి అసాధారణం. మోహన్ లాల్‌కి ఉన్న సహజమైన గాత్రం, శరీరభాష, కళ్లలోని నిజాయితీ ఇవన్నీ కలిపి ఆయనను భారతీయ నటనలో ఒక ప్రధాన నటుడిగా నిలబెట్టాయి. అయితే వ్యాపార మార్కెట్ ఒత్తిడులు, పెరుగుతున్న వయసు, ఆయనకున్న భాషా పరిమితులు ఇవన్నీ ఆయన ప్రతిభను కొంత వరకు పరిమితం చేశాయి. అయినప్పటికీ “మోహన్ లాల్ ఒక పాత్ర చేస్తే అది నిజంగా ఆ మనిషే” అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఇప్పటికీ నిలిచి ఉంది. గొప్ప ప్రతిభావంతుడయిన మోహన్‌లాల్‌కి ఫాల్కే అవార్డు సముచితమయిందే.
-వారాల ఆనంద్
94405 01281






