సమస్యల వలయంలో గురుకులాలు..

by Ravi |   (  Updated:2025-08-08 00:45:32  IST  )

ఆర్థిక స్థోమత లేని పేదలు ఎందరో తమ కన్న బిడ్డల భవి ష్యత్తు కోసం ప్రభుత్వ విద్యనే ఆధారమని భావించి సంక్షేమ హాస్టళ్లు

సమస్యల వలయంలో గురుకులాలు..
X

ఆర్థిక స్థోమత లేని పేదలు ఎందరో తమ కన్న బిడ్డల భవి ష్యత్తు కోసం ప్రభుత్వ విద్యనే ఆధారమని భావించి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వం, పేద విద్యార్థులకు మంచి విద్య అందించడానికి అండగా ఉంటూ ఉచిత విద్య, వసతి భోజనం అందిస్తూ పేద విద్యార్థుల విద్యా వికాసానికి తోడ్పాటును, బాల బాలికలకు కార్పొరేట్ స్థాయి విద్యనూ అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆ మాటలు ఆచరణకు ఆమడు దూరంలో ఉన్నాయి. హాస్టల్లో విద్యార్థులకు అన్నంలో పురుగులు రావడం, ఆహార కల్తీ జరగడం, ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థుల అస్వస్థతలతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ లోపం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు.

గురుకులాల్లో విద్యార్థుల అరిగోసలు..

రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో అల్లాడుతున్నాయి.. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందజేసే ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఆహారం కలుషితమైన సంఘటనలు చోటు చేసుకుంటుండటం, విద్యార్థులు మరణిస్తుండటం బాధాకరం. గురుకులాల నిర్వహణలో ప్రభు త్వం ఒంటెత్తు పోకడ అనుసరిస్తూ తమ పంథాలోనే వెళ్తున్న ది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా వచ్చి మీడియా ముందు కనపడుతున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా.. విద్యార్థులకు మందు గోలిని ఇచ్చే నాథుడే లేడు. వైద్య సిబ్బంది లేక వార్డెన్లు తెలిసి తెలియని వైద్యాన్ని చేస్తున్నారు. సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి విషమించడంతో విద్యార్థులు తీవ్రమైన అనారోగ్యానికి గురవు తున్నారు. దీంతో ఆసుపత్రికి తరలించినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

హెడ్ మాస్టర్ల పర్యవేక్షణలో వార్డెన్లు..

ప్రభుత్వం ఇకనైనా గురుకులాల సమస్యలను పరిగణనలోకి తీసుకొని, విద్యార్థుల సంరక్షణకు పాటుపడాలి. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ప్రధానాచార్యుల పర్యవేక్షణలో వార్డెన్‌లను అందుబాటులో ఉంచాలి. వంట వాళ్లను ఇప్పటికీ కాంట్రాక్టర్‌లు నియమిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే వాళ్లను నియమిస్తే, వారు భయం, బాధ్యతతో వ్యవహరిస్తారు. వంట సరుకుల నాణ్య తను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యతను పర్యవేక్షణాధికారులు తీసుకోవాలి. సంబంధిత శాఖలలో ఉన్న సీనియర్‌ అధికారులనే ప్రభుత్వం పర్యవేక్షణాధికారులుగా నియమించాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి డైట్‌ చార్జీలు సకాలంలో రావడం లేదు. ప్రతి నెల విద్యార్థికి రావల్సిన కాస్మొటిక్‌ చార్జీలు సకాలంలో రావడం లేదు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించకపోవడం, కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం కూడా గురుకులాల సమస్యలకు ప్రధాన కారణాలు.. గురుకుల పాఠశాలల నిర్వహణలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలి. అప్పుడే ఆహారంలో నాణ్యత పెరుగుతుంది.

శిథిలావస్థలో భవనాలు..

కొన్నిచోట్ల వసతి గృహాలు గురుకులాల భవనాలు శిథిలావ‌స్థలో చేరాయి. బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు భయాందోళనలో బిక్కు బిక్కుమంటున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. తాగు నీరు కూడా బయట నుండి విద్యార్థులే మొసుకొచ్చుకునే పరి స్థితి ఏర్పడుతుంది. పలు వసతి గృహాలకు, ప్రహరీలు, కంచె లేకపోవడంతో పందులు, కుక్కలు పరిసరాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న హాస్టల్స్ భవనాలను తీసి, పక్కా భవనాలు నిర్మించాలని, మరు గు‌దొడ్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

-దేవేందర్ ముంజంపల్లి

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

89784 58611

Next Story