టీచర్లకు గ్రేడింగులా.. సమర్థనీయమేనా?

by Ravi |   (  Updated:2026-02-27 00:45:29  IST  )

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల పనితీరును, వారి నాణ్యమైన బోధనను నిర్ధారించడానికి, విద్యార్థుల ఫలి తాలను కొలమానంగా తీసుకొని టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వాలని తెలంగాణ విద్యా పాలసీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని పత్రికాలు కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఈ వార్త ఉపాధ్యాయ వర్గంలో చర్చనీయాంశమైనది.

టీచర్లకు గ్రేడింగులా.. సమర్థనీయమేనా?
X

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల పనితీరును, వారి నాణ్యమైన బోధనను నిర్ధారించడానికి, విద్యార్థుల ఫలి తాలను కొలమానంగా తీసుకొని టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వాలని తెలంగాణ విద్యా పాలసీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని పత్రికాలు కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఈ వార్త ఉపాధ్యాయ వర్గంలో చర్చనీయాంశమైనది. దీనిపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ మెజార్టీ ఉపాధ్యాయులు దానిని వ్యతిరేకించడం గమనార్హం. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.. చివరకు విద్యాశాఖ ఉన్నతాధి కారులు తాము టీచర్లకు ఎటువంటి గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయడం లేదని ప్రకటించడంతో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

జవాబుదారీతనం పెంచాలని..

టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వాలనే ఆలోచనకు NEP-2020లో సూచించిన పనితీరు సూచికలే ఆధారం. దీనికి మూలం Nat ional Achievement Survey నివేదిక. అది విద్యార్థుల్లో ప్రాథమిక సామర్థ్యాల లోపాన్ని చూపించింది. అసర్ రిపోర్ట్ కూడా దీన్ని బలపరిచింది. అందువల్ల ఉపాధ్యాయుల జవాబుదారీతనం పెంచేందుకు పనితీరు సూచికలు అవసరమని సూచించారు.. అయితే రాష్ట్రంలో NEP-2020 పూర్తిగా అమలు కాకముందే టీచర్ల గ్రేడింగ్ ప్రవేశపెట్టడం శోచనీయం. మరోవైపు టీచర్ల పనితీరుకు గ్రేడింగ్ ఇవ్వడం మంచిదే అన్నవారు కూడా లేకపోలేదు.. దానివల్ల కష్టపడే ఉపాధ్యా‌యులకు గుర్తింపు లభిస్తుందని, పనితీరులో వెనుకబడిన వారికి వారి పనితీరును మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని వారి వాదన.. విద్యార్థుల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లకు టార్గెట్లు పెడితే అది మాల్ ప్రాక్టీసుకు దారి తీస్తుందని, కాపీ విధానాన్ని ప్రోత్సహిస్తుందని తద్వారా విద్యా ప్రమాణాలు మరింతగా దిగజారుతాయని మరికొందరి అభిప్రాయం. ఈ వాదనలు ఎలా ఉన్నా గ్రేడింగ్ విధానం టీచర్లలో అసమానతలకు పెంచుతుందనేది వాస్తవం. ఎందుకంటే అది పిల్లల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది గనుక.

స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం లేక..

ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల నేపథ్యాన్ని గమనిస్తే వారంతా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు వారి అభ్య సనంపై ప్రభావం చూపుతాయి.. పిల్లలందరీ అభ్యసన స్థాయిలు ఒకేలా ఉండవు.. విద్యా మనో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం టీచర్లను టార్గెట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సమర్థనీయం కాదు. టీచర్లకు తరగతి గదిలో స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు.. పిల్లల స్థాయిని బట్టి ఏ పాఠం ఎంతవరకు చెప్పాలో, ఎలా చెప్పాలో టీచరే నిర్ణయించుకోవాలి. కానీ ఆ అవకాశమే లేదు.. పాఠం ఇంతే చెప్పాలి. ఇలాగే చెప్పాలి, పాఠ్య ప్రణాళిక ఇలాగే రాయాలి, మూల్యాంకనం ఇలాగే చేయాలని టీచర్లను విద్యాశాఖ నియంత్రించడం జరుగుతున్న దనేది వాస్తవం. కమాండ్ ఇస్తే పనిచేసే యంత్రాలన్నట్లుగా టీచర్లను, వ్యవస్థను తయారుచేయడం సమంజసం కాదు.

బోధనేతర పనుల నుండి తప్పించాలి!

టీచర్లకు స్వేచ్ఛనిస్తే విద్యార్థి మానసిక పరిస్థితికి తగినట్లుగా బోధన చేస్తారు. టీచర్లకు బోధనకు సరిపడ సమయం లేకుండా యోగా డే, పేరెంట్స్ డే, నో బ్యాగ్ డే, సమావేశాలు, అధిక శిక్షణలు వంటి కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టీచర్లకు శిక్షణలు అవ సరమే కానీ మితిమీరితే అవి ఒత్తిడిగా మారుతున్నాయి.. టీచర్లను బోధనేతర పనుల నుండి దూరంగా ఉంచి, బోధనపైనే దృష్టి పెట్టేలా చేయాలి. ప్రతి తరగతికి ఒక టీచర్‌ను నియమించాలి. సిలబస్‌ను తగ్గించి, అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంస్క రణల తరువాతే టీచర్ల గ్రేడింగ్ గురించి ఆలోచించాలి. మార్పులు క్రమంగా అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు..

-సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Next Story