- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎందుకు అందడం లేదు?
ప్రభుత్వ పాఠశాలల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల విశ్వాసం ఎందుకు తగ్గుతోంది? తెలంగాణలో గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఉన్నా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యత, పర్యవేక్షణ, బాధ్యతపై విశ్లేషణ.

ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు అదే స్థాయి విద్యా ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు అందించలేకపోతోంది. తెలంగాణలో గురుకుల పాఠశాలల విస్తరణ, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవి మంచి చర్యలే అయినప్పటికీ తల్లిదండ్రుల విశ్వాసం ఇంకా తిరిగి రాలేదు. అసలు సమస్య మౌలిక సదుపాయాల్లో కాదు, నిర్వహణలో ఉంది.
విద్య అనేది దేశ అభివృద్ధికి మూలాధారం. భారతదేశంలో విద్యను అత్యంత ప్రాధాన్యమైన రంగంగా పరిగణిస్తూ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ప్రతి గ్రామంలో పాఠశాలలు నెలకొల్పారు. లక్షలాది ఉపాధ్యా యులను నియమించారు. వారికి మంచి జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించారు. కానీ కాగితాలపై బలంగా కనిపించే ఈ వ్యవస్థ వాస్తవంలో వేరే దృశ్యాన్ని చూపిస్తోంది.
ప్రైవేట్ బళ్లలో చేరికకు పోటీలు..
అనేక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ చదివించడానికి ముందుకు రావడం లేదు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా సరే, ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ కోసం పోటీపడుతున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తోంది. ఒక రాజకీయ నాయకుడు, మంత్రి లేదా ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థాపించబడిన పాఠశాలలో అడ్మిషన్ల కోసం వందలాది తల్లిదండ్రులు క్యూలలో నిలబడుతున్నారు. కొందరు తెల్లవారుజామునే వచ్చి తమ పిల్లలకు సీటు కోసం వేచి చూస్తున్నారు.
విద్యాప్రమాణాలు నిజంగా సరిగా లేవా?
ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు అదే స్థాయి విద్యా ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు అందించలేకపోతోంది? తెలంగాణలో గురుకుల పాఠశాలల విస్తరణ, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవి మంచి చర్యలే అయినప్పటికీ తల్లిదండ్రుల విశ్వాసం ఇంకా తిరిగి రాలేదు. అసలు సమస్య మౌలిక సదుపాయాల్లో కాదు, నిర్వహణలో ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో పర్యవేక్షణ బలహీనంగా ఉంటుంది. ఉపాధ్యాయుల పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేసే విధానం స్పష్టంగా ఉండదు. బాధ్యతా వ్యవస్థ కొరవడుతోంది.
ప్రభుత్వ ఫాఠశాలలపై నియంత్రణ లోపం
అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై నిరంతర నియంత్రణ ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు ఎక్కువ ఫీజులు చెల్లించినా సరే వెనుకాడట్లేదు. ఒక ప్రభుత్వ హైస్కూల్ నిర్వహణకు సంవత్సరానికి సుమారు కోటి రూపాయలు ఖర్చవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయి ఖర్చుకు తగిన విద్యా ప్రమాణాలు ఉండాలి. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలే అత్యుత్తమ విద్యను అందిస్తున్నాయి. అక్కడి తల్లిదండ్రులు గర్వంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తారు. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి రావాలంటే కీలకమైన మార్పులు అవసరం.
1. ప్రతి పాఠశాలపై క్రమమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. 2. ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసే స్పష్టమైన విధానం ఉండాలి. 3. స్థానిక సమాజం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచాలి. 4. విద్యార్థుల ప్రతిభను పెంపొందించే ఆధునిక బోధన పద్ధతులు ప్రవేశపెట్టాలి.
ఎవరు బాధ్యత పడాలి?
ఒక పాఠశాలలో విద్యా ప్రమాణాలు తగ్గితే దానికి ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలి. ఫలితాలు కనిపించకపోతే చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడితే సమాజంలో అసమానతలు పెరుగుతాయి. ధనికులు ప్రైవేట్ విద్యను కొనుగోలు చేసుకుంటారు. పేదలు బలహీనమైన వ్యవస్థలోనే చిక్కుకుపోతారు. ఇది ప్రజాస్వామ్య సమాజానికి మంచిది కాదు. అందుకే విద్యా వ్యవస్థలో నాణ్యత, బాధ్యత, పర్యవేక్షణ అనే మూడు అంశాలను బలోపేతం చేయడం అత్యంత అవసరం.
- గంజి రమేష్
90324 47075






