బాల మనసుల్లో విలువలు నాటే పుస్తకం..

by Ravi |   (  Updated:2026-07-13 00:46:13  IST  )

తెలుగు ఉపాధ్యాయుడు సయ్యద్ షఫీ రచించిన ‘గగనంలో గాలిపటం’ కథాసంపుటి పిల్లల్లో మానవత్వం, పరోపకారం, పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి, కృతజ్ఞత వంటి విలువలను పెంపొందించే పది సందేశాత్మక కథల సమాహారం.

బాల మనసుల్లో విలువలు నాటే పుస్తకం..
X

చిన్న పిల్లల మనసులు నిర్మలమైనవి. అహంకారం అంటనివి. వాళ్లకు ఏమైనా మంచి విషయాలు చెపితే అవి శాశ్వతంగా గుర్తుండిపోతాయి. అదీ కథల రూపంలో ఆకర్షణీయంగా చెపితే వారి మనస్సుల్లో అవి గాఢమైన ముద్ర వేస్తాయి. అది కూడా వారి ఉపాధ్యాయులు చెపితే ఇంకా బాగా గుర్తు పెట్టుకుంటారు.

బాల్యంలో పిల్లలు మాటతీరులో గాని, ఆచరణలో గాని తల్లిదండ్రులను, గురువులను అనుకరిస్తారు. మహాకవి గురజాడ, “ఉపాధ్యాయులు ఆదర్శ ప్రాయులై ఉండాలి. వారు మహోన్నత శీలము, వ్యక్తిత్వం, గుణ సంపద కలిగివుండాలి,” అన్నారు. నిజంగా, ఉపాధ్యాయులు గొప్ప వ్యక్తిత్వం కలవారైతే వారిననుసరిస్తూ విద్యార్థులు మంచి వ్యక్తులుగా, నీతివంతులుగా తయారవుతారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణం విద్యార్థులతోనే సాధ్యం. అటువంటి ఆదర్శ ఉపాధ్యాయుడు సయ్యద్ షఫీ. విద్యార్థులకు కేవలం పాఠాలనే కాక, తన కథల ద్వారా నైతిక విలువలు, పరోపకారం, మానవత్వం, కృతజ్ఞత ఇత్యాది మానవీయ లక్షణాలను బోధిస్తున్నారు.

మనస్సులను శీతలపరిచిన కథలు..

'గగనంలో గాలి పటం' పది కథల సంపుటం. ఈ కథలు చదువుతుంటే నిజంగా మన సమాజం ఇలా ఉంటే ఎంత బాగుంటుంది! అనిపించక మానదు. ఇటువంటి వాతావరణం దేశంలో వస్తే.. అనే ఆశాభావం కలగక మానదు. ఈ కథలు, ఉక్కపోతతో తపించిపోతున్న మనసులకి ఒక్కసారిగా శీతల పవనాలు తాకి సేద తీర్చినంత ఆహ్లాదకరంగా ఉన్నాయి. రచనా శైలి విద్యార్థులు అనాయాసంగా చదువుకునేంత సరళంగా, సుందరంగా చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలతో ఉన్నాయి. ఇవి పిల్లల కోసం రాసిన కథలు.

పిల్లలో కథానాయకులు..

ఈ కథలు పిల్లలకు సమాజాన్ని పరిశీలించటం నేర్పిస్తాయి. పశు, పక్ష్యాదులను ప్రేమించడం, పర్యావరణాన్ని కాపాడుకోవటాన్ని బోధిస్తాయి. మంచితనాన్ని పెంచుతాయి. ఈ కథల్లో పిల్లలే కథానాయకులు. సయ్యద్ షఫీ రిక్కా బజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖమ్మంలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తెలుగు భాష అంటే అమితమైన ఇష్టం. ఏ విషయాన్నైనా సూటిగా చెప్పటం కన్నా, కథగా చెపితే పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారనే మహాశయంతో కథలు రాస్తూ, విద్యార్థుల మానసిక వికాసానికి, అభ్యున్నతికి వీరు చేస్తున్న కృషి అభినందనీయం.

మొక్కలకు పుట్టిన రోజు..

'జయహో పిల్లలు' కథలో భూమిక తమ ఇంట్లో జామ చెట్టుకు కాసిన కాయలు కోతులకు, పక్షులకు వదిలిపెట్టాలని అమ్మానాన్నలను ఒప్పించి, సృష్టిలో అన్ని ప్రాణులను బతికించుకోవాలనే సందేశాన్నిస్తుంది. ఇంటింటా ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వాటర్ బ్యాంక్ కథ బోధిస్తుంది. ఉగ్రవాదుల దాడిలో మాట కోల్పోయి, శరీరంలో గుండెకు చేరువగా, తొలగించటానికి వీలు లేని తూటాతో, రంజిత్ కుమార్ అనే సైనికుడు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతూ, విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించటం, అతని తల్లి అతను సైనికుడిగా దేశానికి చేసిన సేవలను మాటల రూపంలో చేసిన రికార్డును అతడు విద్యార్థులకు వినిపించటం 'జై జవాన్' అనే స్ఫూర్తిమంతమైన కథలో చూస్తాం. ఆ ప్రసంగం విని ఒక విద్యార్థి ఉత్సాహంగా తాను జవాను నౌతానని చెప్పటం ఈ కథలో కొస మెరుపు. హరిత హారంలో నాటిన మొక్కలకు పుట్టినరోజు చేయటం నిజంగా ఒక విలక్షణమైన ఆలోచన. 'పుట్టినరోజు పండుగ' కథ మొక్కలు నాటటం, పెంచటం అనేది అందరి బాధ్యత అని గుర్తు చేస్తుంది.

పది కథలు పది ఆణి ముత్యాలు..

నిస్వార్థపరుడు, మంచి మనసు గల గ్రామ సర్పంచ్ ఏసుపాదంపై రామాలయంలోని దేవుని నగలు దొంగతనం చేసాడన్న నిందారోపణ జరిగినప్పుడు, అసలు దొంగ పశ్చాత్తాపంతో తన వల్ల ఆ నిరపరాదికి శిక్ష పడకూడదని నగల మూట పంపిన కథ ‘మారిన మనిషి'. ఏసుపాదం ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణోత్సవం జరిపించటం మత సామరస్యాన్ని బోధిస్తుంది. రెండు సందేశాల కథ ఇది. అలాగే, ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పే ‘అంకుల్, నేనూ వస్తా’ కథ, రైతు ప్రాధాన్యాన్ని చెప్పే ’నేనే రాజు, నేనే బంటు’ కథ, శ్రమ విలువను తెలిపే ‘పని లోనే పాఠం ఉంది’ కథ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పే ‘హీరో ‘కథ, ఆహారాన్ని వృధా చేయకూడదని చెప్పే ‘దీవెన’ కథ.. ఇలా పది కథలు పది ఆణి ముత్యాలు. అన్నీ గొప్ప కథలే! విద్యార్థులచే తప్పక చదివించవలసిన కథల పుస్తకం ఇది.

పుస్తకం : గగనంలో గాలిపటం

​రచయిత : ​సయ్యద్ షఫీ

​వెల : అమూల్యం

​ప్రతులకు: 9949273063


పరిచయం

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story