- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనిమనిషి నుంచి మంత్రిగా.. కలితా మాఝి విజయం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి!
నాలుగు ఇళ్లలో పనిమనిషిగా పనిచేసిన కలితా మాఝి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది. మహిళా సాధికారత, ప్రజాస్వామ్య శక్తి, బడుగు వర్గాల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన ఆమె విజయం భారత ప్రజాస్వామ్యానికి కొత్త ఆశలను అందించింది.

డబ్బే ప్రధానమైన ఎన్నికలకు సామాన్యులు సహజంగానే దూరంగా ఉంటారు. అసెంబ్లీకి పోటీ చేసినా కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేయాల్సిందే. అయితే చీకటిలో కాంతి రేఖలా మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంత శక్తివం తమైనదో రుజువు చేసే సంఘటనలు అరుదుగా ఉంటాయి. ఊహకైనా అందని రీతిలో అతి సామాన్యులు ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీలో అడుగు పెట్టి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర తిరిగి రాస్తారు.
నాలుగు ఇళ్లల్లో పనిమనిషి..
నాలుగిళ్ళలో పని మనిషిగా చేసే ‘కలితా మాఝి’ ఈ అద్భుతాన్ని సాధించి దేశ పౌరుల్లో కొత్త ఆశలని వికసిం పజేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఔస్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన కలితా జూన్ 1న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లపై చట్టసభల్లో చర్చోపచర్చలు జరుగుతుండగా ఒక అతి సామాన్యురాలు మహిళా విజయాలకు హద్దులు లేవని నిరూపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కలితా మాఝి పశ్చిమ బెంగాల్, పూర్బ బర్ధమాన్ జిల్లాలో గుస్కారా మున్సిపాలిటీ నివాసి. ఆమె భర్త ప్లంబర్ పని చేసే దినవారి కూలి. వారికి 11వ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. పెళ్లి కాగానే ఇల్లు గడవడానికి కలితా నాలుగు ఇళ్లల్లో పనిమనిషిగా కుదిరారు. గత పదిహేనేళ్లుగా గిన్నెలు తోమడం, ఇంటిని ఊడవడం, బట్టలు ఉతకడం లాంటి పనులు చేసి నెలకు రూ. 4 వేలు సంపాదిస్తున్నారు. తమ జీవితంతో పాటు శ్రామికుల కష్టాలపై అవగాహన ఉన్న కలితాను బీజేపీ 2014లో సొంత వార్డులో బూత్ లెవల్ వర్కర్‌గా ఎంపిక చేసుకుంది. ఇళ్లలో పనులు చేస్తూనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆమె దినచర్యలో భాగమైంది.
బెంగాల్ ప్రజలకు సరికొత్త దీదీ
కలితా అంకిత భావాన్ని చూసి బీజేపీ 2021 లో సొంత జిల్లాలోని అసెంబ్లీ స్థానమైన ఔస్రామ్ నుంచి ఆమెను నిల బెట్టింది. ఆమె ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని కలితా తన సోదరి అని ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. తిరిగి 2026లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఈసారి 12 వేల మెజారిటీతో గెలుపొందారు. పనులు ఆపితే ఇల్లు గడవదని తెలిసి ఎన్నికల ప్రచార సమయంలోనూ పనిచేయడం మానలేదు. ఉదయమే పనులు ముగించుకొని దినమంతా ప్రచారానికి తిరిగేవారు. వాహనాలు లేవు, భారీ బ్యానర్లు లేవు. తమ వీధి మహిళలను, తనలాంటివారిని వెంటేసుకొని నడుస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీ హవాతో పాటు స్వయంకృషి తోడైన పనిమనిషి కలితా బెంగాల్ ప్రజలకు సరికొత్త దీదీగా మారారు.
ఈ విజయం మహిళలదీ, పేదలదీ...
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడం గొప్ప నిర్ణయంగా భావించాలి. బాల్యంలోనే చదువు వదిలేసిన ఆమె లోకాన్ని చదివిన జ్ఞానం ఎంతో విలువైనది. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా రోజువారీ ఇంటి పనులు ఆపేయలేదు. విజయోత్సాహాన్ని పంచుకోవడానికి ఆమె చేతిలో డబ్బులు లేవు. ఆమె వార్డు ప్రజలే సంతోషంగా మిఠాయిలు పంచిపెట్టారు. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి పిలుపు రాగానే వెళ్లడానికి ఆమె వద్ద మంచి చీర కూడా లేదు. ఆమె పని చేసే ఇంటావిడ ఒకరు తమ చీరనిచ్చి పంపారు. కలితా ప్రమాణ స్వీకారం ఒక ఉద్విగ్న సన్నివేశం. అక్కడ ఉన్న పెద్దలందరూ కరతాళ ధ్వనులతో ఆమెను స్వాగతించారు. ఈ విజయం మహిళలది, పేదలది, బడుగు వర్గాలది. మరెన్నో అద్భుత విజయాలకు కలితా గెలుపు స్ఫూర్తిదాయకం కావాలి.
- బద్రి నర్సన్
94401 28169






