మనం క్లిష్ట పరిస్థితుల్లో లేం.. రావొద్దనే ప్రధాని ముందు చూపు..

by Ravi |   (  Updated:2026-05-19 01:16:10  IST  )

ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన ‘సప్త సూత్రాలు – సప్త పరివర్తన’ ఏమిటి? బంగారం కొనుగోళ్లు, ఇంధన పొదుపు, స్వదేశీ వినియోగం వంటి సూచనలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

మనం క్లిష్ట పరిస్థితుల్లో లేం.. రావొద్దనే ప్రధాని ముందు చూపు..
X

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంత పరిస్థితులు వంటి అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం ‘డెవలపింగ్ నేషన్’ నుంచి “డెవలప్డ్ నేషన్”గా ఎదగాలంటే, మన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధి రేటు దెబ్బతిన కుండా, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ సప్త సూత్రాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. ఇది రాజకీయాల కోసం కాదు, దేశ ఆర్థిక భద్రత కోసం చేసిన విజ్ఞప్తి.

ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక భద్రత కోసం సూచించిన ‘సప్త సూత్రాలు – సప్త పరి వర్తన’ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

దేశ ప్రజల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని..

భారతదేశం ప్రస్తుతం భారీ ట్రేడ్ డెఫిసిట్‌ను ఎదుర్కొంటోంది. ప్రతి సంవత్సరం సుమారు 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుండగా, ఎగుమతులు దాదాపు 400 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు 300 బిలియన్ డాలర్లు అంటే 25 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. భారత కరెన్సీ విలువపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దేశ కుటుంబ పెద్దగా ప్రధాని మోడీ 140 కోట్ల భారతీయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని బాధ్యతాయుతమైన సూచనలు చేశారు. ‘Prevention is better than cure’ అన్నట్లుగా, భవిష్యత్ సంక్షోభాలను ముందుగానే అరి కట్టేందుకు ఈ చర్యలు అవసరం.

బంగారు కొనుగోళ్ల వాయిదా..

ప్రధాని మోడీ సూచించిన సప్త సూత్రాల్లో ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. శాశ్వతంగా కొనొద్దని కాదు, కేవలం తాత్కాలిక నియంత్రణ మాత్రమే. భారతదేశం ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం. ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దీని విలువ సుమారు రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 95 శాతం వ్యక్తిగత వినియోగానికే ఉపయోగపడుతోంది. ఏడాదిపాటు బంగారు కొనుగోలును వాయిదా వేస్తే 5-6 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. అదే డబ్బు రియల్ ఎస్టేట్, గోల్డ్ బాండ్స్, ETF పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయుల వద్ద ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ప్రైవేట్ గోల్డ్ నిల్వలు ఉన్నాయి. కేవలం 25 శాతం బంగారం కొనుగోళ్లు తగ్గించినా భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయవచ్చు. అదే మొత్తాన్ని భూమి, తయారీ రంగం లేదా మార్కెట్లలో పెట్టుబడిగా మళ్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది.

ఇంధన పొదుపు..

పెట్రోల్, డీజిల్ దిగుమతులపై భారత్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి, అనవసర ప్రయాణాలను తగ్గిస్తే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మనం 11 లక్షల కోట్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. 20% వాడకం తగ్గినా 3- 4 లక్షల కోట్ల పొదుపు అవుతుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా సమయంలో విజయవంతంగా అమలైన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగిస్తే ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది. కనీసం 25% వర్క్ ఫ్రేమ్ హోమ్ చేసిన 12,000 కోట్ల విదేశీ కరెన్సీ మిగులుతుంది.

వంటనూనె వాడకం భారీ తగ్గింపు..

నేను ఒక డాక్టర్‌గా చెబుతున్నాను.. భారతదేశంలో అధికంగా వంటనూనె వినియోగం జరుగుతోంది. ఫ్రైడ్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రతి కుటుంబం నెలకు కనీసం ఒక లీటర్ ఆయిల్ వినియోగం తగ్గించినా దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ప్రజల ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రతి ఏడాది 1.6 -2.0 లక్షల కోట్ల విలువ అయిన వంట నూనె దిగుమతి చేసుకుంటాం. ఇందులో 20% తగ్గించిన 40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆదా అవుతుంది. ఇక సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఎరువుల దిగుమతులను తగ్గించవచ్చు. భూమి సారాన్ని కాపాడటంతో పాటు రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుంది. మనం ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల కోట్ల ఎరువులు దిగుమతి చేసుకుంటాం. 20% ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువులు వాడితే అటు భూమికి లాభం, ఇటు ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి.

విదేశీ బ్రాండ్లు కొనొద్దు..

“స్వదేశీ” ఉత్పత్తులను వినియోగించాలన్న ప్రధాని పిలుపు వెనుక స్పష్టమైన ఆర్థిక దృష్టి ఉంది. విదేశీ బ్రాండ్లపై ఆధారపడకుండా భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ సంపద దేశంలోనే ఉంటుంది. చిన్న ఉత్పత్తుల నుంచి లగ్జరీ వాహనాల వరకు స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అండర్ గార్మెంట్స్ నుండి లగ్జరీ కార్ల వరకు 25% స్వదేశీవి వాడితే దాదాపు 2 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆదా అవుతుంది.

పర్యటనలు, వెడ్డింగులు..

విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై భారతీయులు భారీగా ఖర్చు చేస్తున్నారు. మన దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పుడు విదేశీ ఖర్చులను కొంత వరకు తగ్గించడం ద్వారా కూడా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయవచ్చు. ప్రతి ఏడాది భారతీయులు దాదాపు 2.8 లక్షల కోట్లు వేదేశీ విహార యాత్రలకు ఖర్చు పెడుతున్నారు. ఒక్క సంవత్సరం మన దేశంలోనే ఖర్చు పెడితే అద్భుత ఫలితాలు వస్తవి. ఈ సప్త సూత్రాలను ప్రజలు కనీసం 25 శాతం స్థాయిలో అయినా అమలు చేస్తే దేశ ట్రేడ్ డెఫిసిట్‌ను గణనీయంగా తగ్గించవచ్చు. రూపాయి విలువ బలపడుతుంది. భారతదేశం మరింత ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. బంగారం పెట్టుబడుల కంటే భూమి, ఉత్పత్తి రంగాలు, మార్కెట్‌లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గోల్డ్ ETFలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యా మ్నాయాల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

రాజకీయ కోణంలో చూడకుండా..

కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లు మనం క్లిష్ట పరిస్థితులలో లేం, మున్ముందు రావొద్దని ముందు చూపు. మనకు ఇప్పటికే 60-70 రోజుల సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నవి, అదే విధంగా దాదాపు 700 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నవి. కేవలం ముందు చూపుతో ఈ సప్త సూత్రాలు, సప్త పరివర్తనకు మార్గాలు. ఈ అంశాలను రాజకీయ కోణంలో కాకుండా జాతీయ ప్రయోజన దృష్టితో చూడాలని ప్రజలను కోరుతున్నాను. భారతదేశం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి.

- బూర నర్సయ్య గౌడ్,

మాజీ ఎంపీ

Next Story