- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధ్యాపక పోస్టులు భర్తీ చేయండి!
తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన, ఇందులో విద్యార్థి

తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన, ఇందులో విద్యార్థి, నిరుద్యోగ యువత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియామకాల్లో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు దక్కట్లేదనే ప్రధాన కారణంతో స్వరాష్ట్రంలో తమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఉద్యమానికి సారథ్యం వహించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. అటువంటి విద్యార్థి, నిరుద్యోగ యువతకి కేంద్ర బిందువు లాంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ కాక పుష్కర కాలం దాటింది. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడం గర్హనీయం.
రాష్ట్రంలో మొత్తం 37 యూనివర్సిటీలుంటే అందులో 4 సెంట్రల్ యూనివర్సిటీలు, 5 ప్రైవేటు యూనివర్సిటీలు,10 డీమ్డ్ యూనివర్సిటీలు, 18 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి.. తెలంగాణ తొలిదశ ఉద్యమ అనంతరం 1973లో ఆరు సూత్రాల పథకంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడినప్పటికీ అందులో విద్యార్థులు, అధ్యాపకులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారవడం గమనార్హం.. మిగతా మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో స్థానికులతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయి.
పదేళ్లుగా వర్సిటీల్లో నియామకాలు నిల్!
ఇక రాష్ట్రంలో ఉన్న ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందని స్థాయిలో విద్యావకాశాలు ఉంటాయి, పది డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 18 యూనివర్సిటీల్లో మాత్రమే పేద, మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది. అలాంటి యూనివర్సిటీల్లో గత పదేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను యూనివర్సిటీలు అందించట్లేదు.. సరిపడా ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల పరిశోధన కుంటుపడి యూజీసీ, వివిధ ఉన్నత స్థాయి విద్యా సంస్థల నుండి యూనివర్సిటీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.
నియామక ప్రక్రియకు ఇన్ని అడ్డంకులా?
హడావుడిగా ఎన్నికలకు ముందు యూజీసీ నిబంధనలకు సరిపడని విధివిధానాలతో కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఒక చట్టం తీసుకువచ్చి అమలు కోసం అప్పటి గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌కి పంపిస్తే ఆమె బిల్లును ఆమోదించకుండా, తిరస్కరించకుండా దీనిపై నిర్ణయం కోసం రాష్ట్రపతి వద్దకు పంపింది. రాష్ట్రపతి ఈ బిల్లును రాజ్యాంగం ప్రకారం ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, లేదా ఏ అభిప్రాయం వ్యక్తం చేయకుండా ఉండవచ్చు. ఇప్పటి వరకు అయితే దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ వర్సిటీల్లో 3 వేల ఖాళీలు..
తెలంగాణ రాష్ట్రం నుండి ఏటా వేలాది మంది సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీలు పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్టాలను పొందుతున్నారు.. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య అందకుండా పోతుంది, దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్ష. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే యూనివర్సిటీల్లో దాదాపు 3000 వరకు అధ్యాపక పోస్టుల ఖాళీలు ఉన్నట్టు అంచనా.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే అన్ని యూనివర్సిటీల్లో అధ్యాపకులు 25% మించి లేరన్న విషయాన్ని ఎన్నోసార్లు ప్రధాన పత్రికలు పతాక శీర్షికన ప్రచురించాయి..
కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం
పన్నెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ హయంలో భర్తీ జరిగిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఉద్యోగాల భర్తీ జరగకపోవడం శోచనీయం. బహుశా పన్నెండు సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ జరగకుండా ఉన్నది తెలంగాణ మాత్రమే కావొచ్చు.. పదేళ్లలో నిరుద్యోగ యువతను విస్మరించినందుకే మార్పు కోరుకుని కాంగ్రెస్‌కి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత నిలచిపోయిన నియామకాలను భర్తీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయడం హర్షణీయం.. ప్రభుత్వం ఇదే పంథాను కొనసాగిస్తూ తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టు లను భర్తీ చేసి తెలంగాణలో ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థి, యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని విజ్ఞప్తి.
డాక్టర్. అక్కెనపల్లి వెంకట్రాం రెడ్డి
97002 06444






