కాల్ సెంటర్ బతుకుల్లో కారుచీకట్లు..

by Disha edit |
కాల్ సెంటర్ బతుకుల్లో కారుచీకట్లు..
X

నిర్మాణంలో ఉండగానే తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టించిన ఫర్హానా చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ ఎరుగని కొత్త కంటెంటుతో పలు భాషల ప్రేక్షకులను ఆకర్షించింది. చెన్నై గల్లీలోని ఒక ఫక్తు సంప్రదాయవాద ముస్లిం కుటుంబానికి చెందిన ఫర్హానా (ఐశ్వర్య రాజేష్) తన పిల్లల ఆరోగ్యం ఉన్నట్టుండి అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబానికి చేదోడుగా ఉండాలని కస్టమర్ సపోర్ట్ ప్రతినిధిగా ఒక బ్యాంకు ఉద్యోగంలో చేరింది. ఆడది ఇంటిపట్టులో ఉండి పిల్లలను చూసుకోవాలని నమ్మే, ఒక షూమార్ట్‌లో పనిచేసే పరమ ఛాందసవాదపు మామ... తన భార్య ఏ పని చేసినా విశ్వసించడమే కాకుండా మద్దతుగా నిలిచే ప్రగతిశీల ఆలోచనలున్న భర్త కరీం (జీతన్ రమేష్)... చాలీ చాలని సంపాదనతో కొరతలతోనే బతుకీడుస్తున్న కుటుంబం... ఇదీ ఫర్హానా చిన్ని ప్రపంచం.

కథేంటంటే..

తాను పనిచేస్తున్న కంపెనీలోనే మెరుగైన ప్రోత్సాహకాల కోసం టీమ్‌ను మారాలని నిర్ణయించుకోవడం ఫర్హానా జీవితాన్ని పెనుమార్పుకు గురి చేస్తుంది. కొత్త టీమ్‌లో.. పనిలో భాగంగా లైంగిక ప్రేరణలున్న పురుషులతో ఆమె మాట్లాడవలసి ఉంటుంది. డబ్బు చెల్లించి మరీ లైంగిక విషయాలను ఫోన్‌లో మాట్లాడుతూ తమ కుతి తీర్చుకునే పురుషులతో మాట్లాడాల్సిన ఆ ఉద్యోగాన్ని ఫర్హానా అసహ్యించుకుంటుంది కానీ ఒక కాలర్ ప్రారంభించిన సంభాషణ ఆమెను ఆకర్షిస్తుంది. అతడి కాల్ తనకు, తన కుటుంబానికి కూడా హాని కలిగిస్తుందని తెలీని ఫర్హానా అతడితో రెగ్యులర్ సంభాషణలో పడుతుంది. జీవితాన్ని కవిత్వీకరించే సంభాషణలతో ఫర్హానా మనస్సును ప్రభావితం చేసిన అతగాడి నిజరూపం చివరలో బయటపడినప్పుడు ఆమె జీవితం పెను తుఫానులో చిక్కుకుంటుంది. భర్త సైతం ఆమెను అనుమానించే స్థితిలో కూరుకుపోయినప్పుడు ఆమె ఈ విషమ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకుంటుందనేది మిగిలిన కథ.

కాల్ సెంటర్లో గుర్తు తెలీని నంబర్‌తో మాత్రమే పరిచయమయ్యే యువతులతో మాట్లాడితేనే తృప్తిగా ఫీలవుతూ తమ లైంగిక కుతిని తీర్చుకునే మగాళ్లకు కస్టమర్ సపోర్ట్ ఇవ్వాల్సిన రకం ఉద్యోగాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఫర్హానా చిత్రం ఆ విషవలయపు చీకటి లోతులను స్పర్శించడంలో శిఖరస్థాయిని అందుకుంది. అసాధారణమైన కథాంశం, అద్బుతమైన సినిమాటోగ్రఫీతో తయారైన ఫర్హానా చిత్రం 2 గంటల 20 నిమిషాల నిడివితో నిజమైన ట్రీట్ అనుభూతినిస్తుంది. 'ఫోన్‌లో ఫిమేల్ కాలర్‌తో మాట్లాడితేనే ఒక మగాడి ఆశ తీరిపోతుందా' అని ఫర్హాన్ తన టీమ్‌లో కొత్తగా చేరినప్పుడు అమాయకంగా వేసే ప్రశ్నకు ఆమె సీనియర్ చెప్పే జవాబు ఆమె కళ్లు తెరిపిస్తుంది. 'అవతలి వైపు ఒకమ్మాయి ఫోన్‌లో ఉంటే చాలు. అంతే సంగతులు.. ఏమయినా అనుకోవచ్చు. దేన్నయినా ఊహించుకోవచ్చు.. ఏ మనిషికైనా ఇందులోనే కిక్కు ఎక్కువ.. ఒక సగటు ఇండియన్ మగాడి సెక్సువల్ లైఫ్ మొత్తం వాడి బ్రెయిన్ లోనే జరుగుతుంటుంది. కాల్ రూపంలో మాటల్లో ఊహించుకోవడమే వాడికి కిక్. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇక్కడ ఫోన్‌లో మాట్లాడే ప్రతి అమ్మాయి మాటల్లో వాడికి ఒక సన్నీలియోన్, ఒక మియా ఖలీఫా కనబడుతుంటుంది.... అయినా మగాళ్లతో మాట్లాడటానికి భాష కావాలా.. జస్ట్ ఒక ఎఫెక్ట్ ఇస్తే చాలు.. ఆ... ఊ.. అంటూ హస్కీవాయిస్‌తో సాగదీస్తే చాలు… పడిపోవడమే.. అంటూ సీనియర్లు ఫర్హానాకు చేసే ఉపదేశం ఆమెలో అపరాధ భావనను పెంచుతుంది.

ఫర్హానా పాత్రకు జీవం పోసి..

కానీ మనిషి, అవతల మనిషికి కనిపించకుండా, చిరునామా తెలియకుండా, పేరు తెలియకుండా జరిగే సెక్సీ కాల్ సెంటర్ ప్రపంచం, అమ్మాయిల ఎమోషన్లతో ఎలా ఆడుకుంటుందో తెలిసే లోపే జీవితాలు తల్లకిందులయిపోతుంటాయి. అందుకే ఇండియన్ సెల్యులాయిడ్ లో కానీ, ఓటీటీ వెర్షన్‌లో కానీ ఇలాంటి వినూత్న కంటెంటును మనమెన్నడూ చూసి ఎరగం. అందుకే ఫర్హానా అందరూ చూసి తీరాల్సిన చిత్రంగా నిలిచిపోయింది. అసాధారణమైన కథాంశంతో ఈ చిత్రం నిజమైన ట్రీట్‌గా ఉంది. ఈశ్వర్ తన ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ ద్వారా ఫ్రేమ్ బై ఫ్రేమ్‌లో ఈ సినిమాలో జీవించాడు. కాల్‌లో మాట్లాడుతూ ఫర్హానా అనుభవించే వేదనను మొత్తంగా తన హావభావాలతో చూపుతూ సినిమా మొత్తంగా కట్టిపడేశాడు. జితేన్ రమేష్, కిట్టి, సెల్వరాఘవన్ ఇతర సహ నటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక్క క్షణం కూడా విసుగు కలిగించకపోవడం, తదుపరి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రేక్షకులలో పెంచడంలోనే ఈ చిత్ర విజయం దాగి ఉంది. ఈ చిత్ర కథ మొత్తంలో చెన్నై మెట్రో రైలు స్టేషన్‌ తనదైన పాత్రను పోషించింది. దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ల సంయుక్త కృషితో హృదయం, ఆత్మ రెండూ ఉన్న సినిమాగా ఫర్హానా నిలిచిపోతుంది.

నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వ ప్రతిభ ఫర్హానాను అద్వితీయంగా తీర్చిదిద్దితే, చిత్రం గమనాన్ని మొత్తంగా భుజాలపై మోసిన ఘనత హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌కి దక్కుతుంది. సంప్రదాయ కుటుంబ జీవిత సముద్రంలో చేపలాంటి ఫర్హానా నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి ఈదుతూ, ఈదుతూ చివరికి అబద్ధాల వలలో చిక్కుకుంటుంది. ఉద్యోగ జీవితంలో భాగంగా ఒక అపరిచితుడిపై ఆమె ‘నమ్మకం’ ఉంచినప్పుడు అక్కడే ఊబిలో చిక్కుకుపోతుంది. తాను తప్పితే మరొకరెవరూ ఈ పాత్రను పోషించలేరన్నంతగా ఐశ్వర్య రాజేశ్ ఫర్హానా పాత్రకు జీవం పోసింది. ఫర్హానా భర్త పాత్రలో జీతన్ రమేష్ తన హావ భావాలను అద్భుతంగా వ్యక్తీకరించగా, సెల్వరాఘవన్ సినిమాలో సర్ ప్రైజ్ చేశాడు. చాలా వరకు, మనం అతని ముఖాన్ని చూడం. అతని స్వరాన్ని మాత్రమే వినగలం. తన ఉనికితో సినిమా మొత్తంలో అతడు భయాన్ని కలుగజేస్తాడు.

ట్రైలర్ నుంచే వివాదాలు..

ఫర్హానా ట్రైలర్ ఇంటర్నెట్‌లో కనిపించినప్పటి నుండి, ఈ చిత్రంపై వివాదాలు, నిషేధం డిమాండ్లు చుట్టుముట్టాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించడంతో ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. దీంతో చిత్ర నిర్మాతలు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రకటన కూడా చేశారు. ‘సెన్సార్ పూర్తయిన సినిమాను విడుదలకు ముందే అపోహలు పెట్టి వ్యతిరేకించడం, దాని ఆధారంగా వివాదాలు సృష్టించడం సరికాదు.. ప్రభుత్వ యంత్రాంగం తగిన విధంగా సెన్సార్ చేసిన ఫర్హానా గురించి కొంతమంది సృష్టించిన వివాదాలు మమ్మల్ని చాలా బాధించాయి. ఫర్హానా ఏ మతానికి లేదా వారి మనోభావాలకు వ్యతిరేకం కాదు. మంచి సినిమాలు అందించడమే మా లక్ష్యం. నిర్దిష్ట మతపరమైన మనోభావాలకు, విశ్వాసాలకు విరుద్ధమైన విషయాలకు మేము ఎప్పుడూ అనుమతించలేదు, మానవత్వానికి విరుద్ధమైన కథనాలను మేము కోరుకోము' అని నిర్మాతలు ప్రకటిస్తే గానీ ఈ వివాదం సద్దుమణగలేదు.

మే 12న విడుదలైన ఫర్హానా సినిమా తర్వాత నాలుగైదు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ అయింది. ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్, జితాన్ రమేష్ ప్రధాన పాత్రలు. దర్శకుడు: నెల్సన్ వెంకటేశన్, దర్శకుడు: నెల్సన్ వెంకటేశన్ సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్: సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్: ఎడిటర్: వీజే సాబు జోసెఫ్: నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు. ఈ చిత్రాన్ని సోని లైవ్‌లో వీక్షించవచ్చు.

కె. రాజశేఖర రాజు

73964 94557

Read More: Disha Newspaper


Next Story

Most Viewed