- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యలో క్రమశిక్షణ దిశగా ‘ఫేషియల్ రికగ్నిషన్ హాజరు’ సంస్కరణ
అన్ని విద్యాలయాల్లో ‘ఫేషియల్ రికగ్నిషన్ హాజరు’ అమలు చేయాలని ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం

పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్ని విద్యాలయాల్లో ‘ఫేషియల్ రికగ్నిషన్ హాజరు’ వైపు మార్పును అమలు చేయాలన్న దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఒక కీలకమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేసి అమలు చేస్తున్న ఈ సంస్కరణ భారతీయ విద్యా రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాక, విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత, నాణ్యతలకు కొత్త ప్రమాణాలను స్థాపించే విప్లవాత్మక సంస్కరణగా భావించాలి. ఈ విధానం సమర్థవంతంగా అమలైతే, విద్యా రంగంలో చోటుచేసుకునే మార్పులు, వాటి ఫలితాలు ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేనంత విస్తృతంగా ఉండి, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనున్నాయి.
విద్యా వ్యవస్థలో “హాజరు” అనేది ఒక సాధారణ గుర్తింపుకాదు. అది విద్యార్థి విద్యాభ్యాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, బాధ్యతాయుత జీవనశైలికి ప్రతిబింబం. హాజరు అనేది క్రమశిక్షణకు అద్దం పట్టే ప్రమాణం మాత్రమే కాక, ప్రతి విద్యాసంస్థలో నాణ్యత, నిర్వహణ, శిక్షణా ప్రక్రియల దృఢత్వాన్ని కొలిచే కీలక సూచిక. చిన్న పదంలా కనిపించిన ఈ “హాజరు” వెనుక సమయపాలన, బాధ్యత, ఆత్మ నియంత్రణ, నైతిక విలువలు, పట్టుదల, మరియు జీవన శైలిని రూపుదిద్దే శిక్షణ వంటి అనేక మౌలిక అంశాలు దాగి ఉన్నాయి.విద్యార్థిని పాఠశాలకు తీసుకువచ్చేది శారీరక హాజరే కాక, నేర్చుకోవాలనే తపన, లక్ష్యబద్ధత కూడా అదే సమయంలో రూపుదిద్దుకుంటాయి. అందువల్ల హాజరు పరిపాలనా అంశం మాత్రమే కాక, విద్యార్థి భవిష్యత్తు దిశను నిర్ణయించే విలువాధారిత సంస్కృతిగా మారింది.
హాజరు విధానంలో మార్పు చారిత్రాత్మకం
హాజరు విధానం ‘హాజరు పట్టిక’ల నుంచి ‘వేలిముద్ర’ దశను దాటి, ఇప్పుడు ‘ముఖ గుర్తింపు ఆధారిత హాజరు’ అనే ఆధునిక సంస్కరణకు చేరుకుంది. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ఈ విధానాన్ని అమలు చేయాలన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రస్తుతం ఇంటర్మీడియట్ స్థాయిలో అమలులో ఉన్న ఈ సంస్కరణ, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలవగలదు. ఇది సాంకేతిక మార్పు మాత్రమే కాక, విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత, నాణ్యతలకు కొత్త ప్రమాణాలను స్థాపించే విప్లవాత్మక సంస్కరణగా భావించాలి. ఈ విధానం సమర్థవంతంగా అమలైతే, విద్యా రంగంలో చోటుచేసుకునే మార్పులు, వాటి ఫలితాలు ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేనంత విస్తృతంగా ఉండి, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనున్నాయి.
మార్పు దిశకై ..
పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యా వ్యవస్థ బలంగా ఉండాలంటే విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ఈ నాలుగు స్థంభాలు క్రమశిక్షణతో ఒకే దిశలో సాగాలి. ఈ సమన్వయానికి కేంద్రబిందువే హాజరు. కాలక్రమంలో గురుకులాల కఠిన శిష్టాచారం నుంచి నేటి సడలింపు సంస్కృతివరకు విద్యా వ్యవస్థ మార్పులు చెందింది. ఒకప్పుడు గురువు కఠినంగా శిక్షిస్తే విద్యార్థి మారేవాడు. నేడు ఉపాధ్యాయుల మాటకే తల్లిదండ్రులు సవాలు చేసే పరిస్థితి ఏర్పడింది. శిక్ష తగ్గడంతో క్రమశిక్షణ క్షీణించి, హాజరు విలువ తగ్గింది. ఫలితంగా విద్యార్థుల ప్రమాణాలు పడిపోవడంతో పాటు హాజరు విధానాల్లో అవకతవకలు పెరిగాయి.ఈ నేపథ్యంలో విద్యలో క్రమశిక్షణను పునరుద్ధరించడం అత్యవసరం. హాజరు వ్యవస్థల్లోని మానవ తప్పిదాలు, పారదర్శకత లోపాలు, నిర్వహణ సమస్యలను తొలగించాల్సిన అవసరం ఉంది.
సాంకేతిక వినియోగం.. విధానపరమైన సవాళ్లు
డిజిటల్ యుగంలో ప్రతి రంగంలో సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. విద్యా సంస్థల హాజరు వ్యవస్థలో పారదర్శకత, ఖచ్చితత్వం, వేగం అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మెషిన్ సమర్థవంతమైన ఆధునిక పరిష్కారంగా నిలుస్తోంది. ఈ పరికరం హాజరును నమోదు చేయడంతో పాటు నిర్వహణ సౌలభ్యాన్ని అందించి, మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. ఈ మెషిన్ పూర్తిగా శాస్త్రీయ సాంకేతికతపై ఆధారపడి నాలుగు దశల్లో పనిచేస్తుంది.కెమెరా ముఖాన్ని స్కాన్ చేయడం, కీలక పాయింట్లను అల్గారిథమ్‌లు విశ్లేషించి కోడ్‌లుగా మార్చడం, వాటిని డేటాబేస్‌తో సరిపోల్చడం, సరిపోలిక విజయవంతమైతే వెంటనే హాజరు నమోదు చేసి సర్వర్‌కు పంపడం. మొత్తం ప్రక్రియ కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. మానవ జోక్యం లేకుండా జరిగే ఈ విధానం నిష్పాక్షికత, పారదర్శకతను పెంచుతుంది.అయితే అమలుకు ఆర్థిక వనరులు, పరికరాల సాంకేతికత, శక్తివంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అవసరమైనవి.ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా సమస్యలు వ్యవస్థ సజావు అమలుకు ఆటంకంగా మారవచ్చు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకేసారి హాజరు నమోదు చేసినప్పుడు క్యూలైన్లు, ఆలస్యాలు సంభవించవచ్చు. అదనంగా, ముఖ డేటా భద్రత, ప్రైవసీ అంశాలు కూడా కీలకంగా పరిగణించాల్సినవి.
సిబ్బంది నియామకాలు తప్పవు..
ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా, పాఠశాలల నుండి ఉన్నత విద్య సంస్థల వరకు సిబ్బంది హాజరు, సమయపాలన, పనితీరుపై పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. ఫలితంగా, నిబంధనల్లో పేర్కొన్న విధంగా ప్రతి విద్యాసంస్థలో విద్యార్థుల నిష్పత్తికి తగినంత బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడం తప్పనిసరి అవుతుంది. ఇప్పటివరకు పేపర్‌పై చూపించే హాజరు, పేరుకే ఉన్న పోస్టులు, తాత్కాలిక సవరణలు వంటి వ్యవహారాలకు ముగింపు పలుకుతూ, విద్యా వ్యవస్థలో సమగ్రమైన మానవ వనరుల బలోపేతానికి ఇది దారితీస్తుంది. నిజంగా అవసరమైన చోట ఉపాధ్యాయులూ, సిబ్బందీ నియమించబడితేనే ఈ ప్రక్రియ అసలు లక్ష్యమైన విద్యా నాణ్యత, క్రమశిక్షణ, బాధ్యతా నిర్వహణను సాధించగలదు.
నంగె శ్రీనివాస్,
ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ & ప్రిన్సిపల్
94419 09191






