- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు నుంచి చేవెళ్ల దాకా.. హద్దుమీరిన నిర్లక్ష్యం
విశాలమైన మన దేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడం సహజమే.. అయినా కానీ ఆయా ప్రమాదాలకు కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రోడ్డు, డ్రైవింగ్ సంబంధిత కారణాలు,

విశాలమైన మన దేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడం సహజమే.. అయినా కానీ ఆయా ప్రమాదాలకు కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రోడ్డు, డ్రైవింగ్ సంబంధిత కారణాలు, ఇక రెండవది వ్యవస్థీకృత లోపాల మూలాన జరిగే యాక్సిడెంట్స్. దీనికి ప్రధానంగా వ్యవస్థలలో ఉన్న లోపాలే కారణం.
రోడ్డు డ్రైవింగ్ కారణాలలో అతివేగం డ్రైవర్ల సమన్వయ లోపంలో రాత్రి వేళ డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. కర్నూలు ఘటనలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ వెంటనే బస్సును ఆపకపోవడం, చిన్న ప్రమాదంగా భావించడం కూడా తీవ్రతను పెంచింది. ఆ బస్సు ప్రమాదం, అక్కడ జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా రవాణా భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రాత్రివేళ జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమై, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. రోడ్డు ప్రమాదాల కంటే కూడా బస్సు అగ్నిప్రమాదాలు మరింత ఎక్కువ ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి.
ఒక్క భద్రత కూడా పాటించలే...
సాధారణంగా బస్సు ప్రమాదాలకు అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రధాన కారణాలు అవుతుంటాయి. అయితే, కర్నూలు ఘటనలో బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం మొదలైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బైక్‌ను ఈడ్చుకెళ్లడం వల్ల ఇంధన ట్యాంక్ దెబ్బతిని, డీజిల్ రోడ్డుపై చిందడం, ఇంజిన్ వేడితో నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ చిన్న ప్రమాదమే ఇంతటి ఘోర విషాదంగా మారడానికి అనేక భద్రతా లోపాలు కారణమయ్యాయి. అత్యవసర ద్వారాలు పనిచేయకపోవడం, అద్దాలు పగలగొట్టే హ్యామర్‌లు అందుబాటులో లేకపోవడం, బస్సులో ఖాళీ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉండడం వంటి నిర్లక్ష్యాలు మంటల నుండి ప్రయాణికులు తప్పించుకునే అవకాశాన్ని పూర్తిగా లేకుండా చేశాయి.
లిథియం బ్యాటరీలు పేలి ప్రాణాలు హరీ..
వాహన లోపాలకు వస్తే, ఇక్కడ ట్రావెల్స్ యాజ మాన్యం బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ క్యాబిన్‌లో అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సులభంగా అంటు కునే పదార్థాలను రవాణా చేయడం మంటల తీవ్రతను పెంచింది. ముఖ్యంగా, లిథియం బ్యాటరీలు అధిక వేడికి పేలిపోవడం వల్ల మంటలు వేగంగా ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. అత్యవసర నిష్క్రమణ మార్గాలు పనిచేయకపోవడం, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేక పోవడం అనేది స్పష్టమైన భద్రతా నియమాల ఉల్లంఘన.
పరోక్ష బాధ్యత వీళ్లదే..
ఈ నిర్లక్ష్యానికి ట్రావెల్స్ యజమానులే మొదటి బాధ్యులు. అంతేకాకుండా రవాణా శాఖ అధికారులు కూడా తగిన తనిఖీలు చేయకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహ నాలను రోడ్లపై తిరగడానికి అను మతించడం వల్ల వారు కూడా పరోక్షంగా బాధ్యత వహించాలి. ద్విచక్ర వాహనాలను నడిపేవారికి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేసే అధికారులకు ఇటువంటి సరైన పర్మిట్లు లేని బస్సులు కనిపించవా? అన్నదే సామాన్యుని మదిలో మెదులుతున్న ప్రశ్న ! ఇప్పటికైనా వారు కళ్లు తెరిచి హడావుడి చెకింగ్‌లు కాకుండా సరైన పర్మిట్లు లేని బస్సులపై కొరడా ఝళిపించాలి. రోడ్లపై పెట్రోలింగ్ పెంచాలి.
హద్దుమీరిన నిర్లక్ష్యానికి పరాకాష్ట
కర్నూలు బస్సు దుర్ఘటన కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు, ఇది మన రవాణా వ్యవస్థలోని లోపాలను, నియం త్రణ లేమిని, లాభాపేక్షతో కూడిన నిర్లక్ష్యాన్ని చూపించే ఒక హెచ్చరిక. నిండు ప్రాణాలను బలిగొన్న ఈ విషాదం నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. కేవలం దర్యాప్తు నివేదికలు సమర్పించడం కాకుండా, ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు, ట్రావెల్స్ యాజమాన్యాలు కలిసి కట్టుగా చిత్తశుద్ధితో పనిచేసి భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. ప్రతి పౌరుడి ప్రాణం విలువైంది. ఇకపై ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం తక్షణ కర్తవ్యం.
మరో ఘోర రోడ్డు ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగుడ వద్ద జరిగిన తాజా ఘటనలో ఆర్టీసీ బస్సును కంకర లోడు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు కుడి వైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సులో 70 మంది ప్రయాణి కులున్నారు. కంకర కింద ఇరుక్కుపోయి 24 మంది మృతి చెందారు. టిప్పర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడి కక్కడే మృతిచెందారు. ఈ మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు. పేరుకే ఆర్టీసీ బస్సే అయినా, ప్రైవేట్ బస్సును లీజుకు తీసుకున్నారని సమాచారం. ఎట్లా ఈ పరిస్థితి మారేది? బయటికి వెళ్లిన వాళ్లు ఇక తిరిగి వస్తారనే నమ్మకం పూర్తిగా నశించిపోతూ ఉంది. మళ్లీ మళ్లీ అదే మాట..'ఇక్కడ కుక్కల ప్రాణాలకు ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదు. సత్యం'.
-డి జయరాం






