ముస్లిం చరిత్ర తొలగింపు.. భారత సమగ్రతకు ముప్పు!

by Ravi |   (  Updated:2025-11-30 00:45:50  IST  )

చరిత్ర పునః రచన పేరుతో భారతీయ ముస్లింల దౌత్యం, త్యాగం, మహనీయుల కృషిని చరిత్ర పుటల నుండి క్రమంగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం పాఠ్యపుస్తకాల మార్పు కాదు. ఒక సమాజాన్ని చరిత్ర నుండి మాయం చేయాలనే రాజకీయ యత్నం.

ముస్లిం చరిత్ర తొలగింపు.. భారత సమగ్రతకు ముప్పు!
X

చరిత్ర పునః రచన పేరుతో భారతీయ ముస్లింల దౌత్యం, త్యాగం, మహనీయుల కృషిని చరిత్ర పుటల నుండి క్రమంగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం పాఠ్యపుస్తకాల మార్పు కాదు. ఒక సమాజాన్ని చరిత్ర నుండి మాయం చేయాలనే రాజకీయ యత్నం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ ప్రాణాలను అర్పించిన ముస్లిం మహనీయుల పేర్లు నేటి పాఠ్య పుస్తకాల్లోంచి తొలగించేశారు. వారి త్యాగాన్ని చరిత్రలో నుండి తొలగించడం అంటే స్వాతంత్ర సమర గాధను అసంపూర్ణంగా చేయడం.

ముస్లింలపై వాటిని రుద్దితే ఎలా?

చరిత్రను వక్రీకరించే మరో దశగా, ముస్లిం రాజుల వ్యక్తిగత నిర్ణయాలను మొత్తం ముస్లిం సమాజంపై ప్రతిబింబంలాగా చూపిస్తున్నారు. ఉదాహరణకు, ఔరంగజేబ్ వంటి రాజుల వ్యక్తిగత పాలనా విధానాలను మొత్తం ముస్లింల మతపరమైన ధోరణిగా చూపించడం తప్పుదారి చూపే ప్రయత్నం. ఈ విధమైన వక్రీకరణ వల్ల యువతలో ద్వేషం పెరగడం, సామాజిక విభజన తీవ్రతరమవడం జరుగుతోంది. నేటి చరిత్ర పుస్తకాల్లో గత ముస్లిం పాలకులను ‘విదేశీ దండయాత్రికులు’గా చూపించడం అన్యాయం.

ఎన్‌సీఈఆర్‌టీలో స్పష్టమైన వివక్ష..

ఇటీవలి సంవత్సరాలలో NCERT (జాతీయ విద్యా పరి శోధన, శిక్షణా మండలి) పాఠ్యపుస్తకాలలో జరిగిన మార్పులు ఈ వివక్షను మరింత బహిర్గతం చేస్తున్నాయి. 2016 తరువాత ప్రచురితమైన సిలబస్‌లలో మొగల్ చరిత్ర, ఇస్లామిక్ నాగరికత, సూఫీ సంస్కృతి, ముస్లిం పండితుల కృషిపై ఉన్న పాఠాలను పెద్ద మొత్తంలో తొలగించేశారు. ఉదాహరణకు, ‘Themes in Indian History’ అనే పుస్తకంలో అక్బర్, బాబర్, షాజహాన్ వంటి పాలకుల పరిపాలన, సంస్కృతి, నిర్మాణ కళ, సాంస్కృతిక సహజీవనం వంటి అంశాలు విస్తృతంగా ఉండేవి. కానీ కొత్త ఎడిషన్లలో ఆ అధ్యాయాలను తగ్గించి, ‘భారతీయ సంస్కృతి స్వదేశీ మూలాలు’ అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీని ఫలితంగా విద్యార్థులు భారత చరిత్రలో ముస్లిం కృషిని సమగ్రమైన కోణంలో చూడలేకపోతున్నారు.

ఈ మార్పుల దుష్ప్రభావం..

విద్యార్థులు ఇప్పుడు ఒకే రకమైన దేశభక్తి భావనను బోధించే పుస్తకాలు చదువుతున్నారు, కానీ ఆ దేశభక్తి వెనుక ఉన్న బహుళ మతాలు, బహుళ సంస్కృతులు కలిసి చేసిన పోరాట గాధ వారికి తెలియదు. ఇలా పాఠ్యపుస్తకాల నుండి ముస్లిం చరిత్రను తొలగించడం కేవలం సబ్జెక్ట్ తగ్గించడం కాదు, ఇది సామాజిక స్మృతి తొలగింపు.. విద్యార్థులు ఒక వర్గం చేసిన కృషి తెలియకుండా పెరిగినప్పుడు, వారి దృష్టిలో ఆ వర్గం వారు పక్కవాళ్లు అవుతారు. ఇది దేశ సమగ్రతకు ప్రమాదకరం. పాఠ్య పుస్తకాల నుండి ముస్లిం రాజులు, పండితులు, కవులు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు తొలగించడం వల్ల భవిష్యత్ తరాలు ‘ఏకపక్ష చరిత్ర’ నేర్చుకుంటాయి. ఒక వర్గం చేసిన కృషి తెలియకుండా పోయినప్పుడు, దేశ సమగ్రత ప్రమాదంలో పడుతుంది. చరిత్రను తారుమారు చేయడం అంటే సమాజపు అద్దాన్ని పగలగొట్టినట్టే.

చరిత్రకు సంయమనం ఆవశ్యం!

చరిత్ర అనేది విభజనకు కాదు, ఐక్యతకు దారి చూపాలి. ముస్లింల పాత్రను అణచివేయడం అంటే భారతదేశం నిజమైన చరిత్రను అసంపూర్ణంగా చూపించడం. భారతదేశం బలం దాని వైవిధ్యంలో ఉంది. ఈ వైవిధ్యాన్ని వక్రీకరించడం అనేది దేశ ఆత్మకు నష్టం కలిగించే చర్య. ముస్లింల చరిత్రను తొలగించే ఈ విధానం ఆందోళన కలిగించే అంశం. ముస్లిం మహనీయుల కృషి లేకుండా భారత చరిత్ర పూర్తి కాదు. భారతదేశం అనే బహుళ సంస్కృతుల పుష్ప గుచ్ఛంలో ముస్లింల పరిమళం కూడా అంతే ముఖ్యమైనది. దానిని తొలగించడం అంటే చరిత్ర పుస్తకం నుండి ఒక ముఖ్యమైన పుటను చింపివేయడమే.

-మొహమ్మద్ అజీజుద్దీన్

70131 76656

Next Story