- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బానిసత్వం నుండి స్వేచ్చ కోసం ప్రయాణం..
Emancipation అనే సినిమా.. బానిసత్వం, ధైర్యం, గౌరవం, ప్రేమ, అహేతుక ద్వేషం మానవ మనుగడ గురించిన ఒక అద్భుతమైన కళాఖండం. విల్ స్మిత్ నటన ఈ సినిమాకు జీవం పోసింది. అతడి నటన ఉత్కంఠభరితంగానే కాదు, బానిసత్వం కలిగించే తీరని దుఃఖంతో నిండి ఉంది.

Emancipation అనే సినిమా.. బానిసత్వం, ధైర్యం, గౌరవం, ప్రేమ, అహేతుక ద్వేషం మానవ మనుగడ గురించిన ఒక అద్భుతమైన కళాఖండం. విల్ స్మిత్ నటన ఈ సినిమాకు జీవం పోసింది. అతడి నటన ఉత్కంఠభరితంగానే కాదు, బానిసత్వం కలిగించే తీరని దుఃఖంతో నిండి ఉంది. ఇది అమెరికన్ సమాజం సృష్టించిన అత్యంత భయంకరమైన అన్యాయాలు, క్రూరత్వాలలో ఒకదాని గురించి చిత్రించిన ఒక అద్భుతమైన చిత్రం. మనుషులను బానిసలుగా మార్చి వేటాడే క్రూరమైన, భయంకరమైన ఈ ప్రపంచంలో కొరడా, తుపాకీ, కుక్కల వంటి దుష్టత్వం నుంచి తప్పించుకోవడానికి, మనిషి చేసే స్వేచ్ఛా పోరాటం ఎంత వేదనామయంగా ఉంటుందో చూపే చిత్రం ఇది. 1860ల నాటి అమెరికన్ అంతర్యుద్ధ కాలానికి చెందిన కథ, కథనంతో సాగిన ఈ సినిమా పీడనను, స్వేచ్ఛ కోసం ఆరాటాన్ని సమస్థాయిలో చూపిన అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది.
కథేంటంటే..
తన స్వేచ్ఛ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే పీటర్ అనే బానిస వాస్తవ కథను 'ఎమాన్సిపేషన్' (విముక్తి)లో చెప్పారు. రైల్వే నిర్మాణ స్థలంలో అతను బానిస యజమానులతో అనుకోకుండా గొడవ పడడంతో కథ మలుపు తిరుగుతుంది. తోట యజమానుల బారి నుండి తప్పించుకోవడానికి పీటర్, లూసియానా చిత్తడి నేలల గుండా ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. సినిమా ప్రారంభంలో, “ఎమాన్సిపేషన్” చిత్రం 1863 జనవరి 1న అబ్రహం లింకన్ “తిరుగుబాటు రాష్ట్రాలలో”ని బానిసలను విముక్తి చేశారని ప్రేక్షకులకు గుర్తు చేస్తుంది. అప్పటికి అంతర్యుద్ధం దాదాపు రెండేళ్లుగా జరుగుతోంది. లింకన్ ప్రకటన యూనియన్ లేదా సరిహద్దు రాష్ట్రాలలోని బానిసలకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. కానీ అది ఈ అసహ్యకరమైన వ్యవస్థ అంతానికి నాంది పలికింది. అంతర్యుద్ధం ముగిసి 150 సంవత్సరాలకు పైగా గడిచినా, బానిసత్వం యునైటెడ్ స్టేట్స్‌లో మానని మచ్చలా మిగిలిపోయింది. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ, ఆంటోయిన్ ఫుక్వా తీసిన “ఎమాన్సిపేషన్” ఈ బాధాకరమైన వారసత్వాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి చేసిన ఒక ఉత్తేజకరమైన, ఇప్పటికీ అవసరమైన ప్రయత్నం.
పత్తి చేలలో నలిగిన బానిసలు..
ఈ పీరియడ్ చిత్రం మనల్ని 1863లో యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకువెళుతుంది, నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ బానిసత్వాన్ని అంతం చేసిన ఎమాన్సిపేషన్ ప్రకటనపై సంతకం చేశారు.. ఈ చిత్రం లూసియానాలోని ఒక తోటలో జరుగుతుంది, అక్కడ వందలాది మంది నల్లజాతీయులు బానిసలుగా ఉండి పత్తి తోటలలో లేదా రైల్వే పట్టాల నిర్మాణంలో పనిచేస్తున్నారు. హైతీలో జన్మించిన పీటర్ వారిలో ఒకడు, అతన్ని బలవంతంగా ఒక కార్మిక శిబిరానికి పంపినప్పుడు, అతనిలో తీవ్రమైన కోపం, ఆ పత్తి చేల నుండి తప్పించుకోవాలనే కోరిక కలుగుతాయి.. చిత్రంలో గణనీయమైన భాగం పీటర్ ప్రయాణాలకు, అతనిని పట్టుకోవడానికి ఫాసెల్ చేసే ప్రయత్నాలకు కేటాయించారు.. ఈ సినిమాలో కొరడా దెబ్బలు తిన్న పీటర్ గాయాలు అతని "అవిధేయతకు" చిహ్నాలు అన్నప్పుడు ఆ పాత్రధారి విల్ స్మిత్ చెప్పే డైలాగులు గొప్ప సన్నివేశాన్ని తలపిస్తాయి.. చూస్తున్నంత సేపూ మధ్య యుగాలలో మన సమాజంలోని కుల వ్యవస్థ, అస్పృశ్యత, అవమానాలు ఏమాత్రం తక్కువ అరాచకాలు కాదేమో అనే నిజం వెంటాడుతుంది.. ఈ సినిమా కోసం విల్ స్మిత్ నిజంగా తన చేతులను మురికి చేసుకున్నాడు. ఒక చిత్తడి నేలలో, అతను ఒక మొసలితో పోరాడతాడు, తేనె కోసం చెట్టు ఎక్కుతాడు, వాసన పసిగట్టే కుక్కలను దూరంగా ఉంచడానికి కొన్ని పద్ధతులను రూపొందిస్తాడు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించినఈ సినిమాకు విల్ స్మిత్ తన పాత్రకు జీవం పోశాడనే చెప్పాలి. చిత్రీకరణ కోణం నుండి చూస్తే ఇది ఒక కఠినమైన చిత్రం. దాదాపు ప్రతి షాట్‌లో ఆయన అద్వితీయమైన నటన... మామూలుగా ఉండే ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేంత శక్తివంతంగా మార్చింది. నలుపు - తెలుపులో చిత్రీకరించిన ఈ చిత్రం కేవలం ఒక చారిత్రక కథనం కంటే ఎక్కువగా, ఒక థ్రిల్లర్‌గా కనిపిస్తుంది.
సినిమా: Emancipation (విముక్తి)
నటీనటులు: విల్ స్మిత్, బెన్ ఫోస్టర్,తదితరులు
దర్శకుడు: ఆంటోనీ ఫక్వా
లభ్యం: Apple టీవీ
-కె. రాజశేఖర
73964 94557






