ఆదివాసీ వీరనారి దుర్గావతి

by Disha edit |
ఆదివాసీ వీరనారి దుర్గావతి
X

ధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గల మదన్ మహల్ కొండల మీద మొఘల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్యకాంక్షకి ఒక వీరనారి రాణి దుర్గావతి నేలకొరిగింది. బుందేల్‌ఖండ్ సంస్థానాధీశుడు, గోండు రాజు అయిన చందవేల్‌కు 1524 అక్టోబర్ ఐదున దుర్గావతి జన్మించింది. 1550 నుంచి 1560 మధ్య ఆమె భర్త దళపత్ సింహ్ జబల్‌పూర్, బుందేల్‌ఖండ్‌ను స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి పాలించాడు. దుర్గావతి తన తండ్రి చందవేల్, భర్త దళపత్ సింహ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజ్యపాలన కొనసాగించింది. గోండులు స్వతంత్ర రాజ్యంగా ఉండటం సహించలేని అక్బర్ తన సేనాధిపతి ఆసిఫ్‌ఖాన్ చేత కుట్రపన్ని దళపతి సింహను కాల్చి చంపించాడు. దీంతో రాణీ దుర్గావతి మదన్ మహల్ కొండలనే కేంద్రంగా చేసుకొని ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంది.

అవమానకరమని భావించి

చిన్నతనం నుంచే పౌరాణిక, చారిత్రక గాథలు వింటూ తన్మయత్వం పొందిన దుర్గావతి అస్త్ర, శస్త్ర విద్యలలో ఆరితేరింది. భర్త అడుగుజాడలలో ప్రజలను సుఖశాంతులతో పాలించింది. ఢిల్లీ పాదుషా అయిన అక్బర్ దుర్గావతిని తనకు సామంతురాలిగా ఉండాలని ఆసిఫ్‌ఖాన్ ద్వారా ఆదేశించాడు. ఆది నుండి స్వతంత్ర రాజ్యంగా విలసిల్లిన గోండు రాజ్యం ఒక తురక భూపతికి సామంత రాజ్యంగా మారడం అవమానకరమని, వనవాసుల ఉనికికి భంగకరమని భావించిన దుర్గావతి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆసిఫ్‌ఖాన్ గోండు రాజ్యం మీదకు దండెత్తాడు.

దుర్గావతి 'అబలను కాదు సబలను' అని నిరూపిస్తానని మొఘల్ సైన్యానికి సవాల్ విసిరి యుద్ధానికి దిగింది. మగ వేషం ధరించి యుద్ధంలో దుర్గావతి ప్రదర్శించిన శౌర్యానికి గోండు సైనికులు, మంత్రులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. దుర్గావతి వీరోచిత పోరాటాన్ని చూసిన ఆసిఫ్‌ఖాన్ భారీ సైన్యంతో గోండుల కోటను ముట్టడించాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

వారసుడు నేలకొరిగినా

అటు మొఘల్ చక్రవర్తి సామ్రజ్యకాంక్ష. ఇటు గోండుల స్వాతంత్ర్యేచ్ఛ. హోరాహోరిగా సాగుతున్న యుద్ధంలో దుర్గావతి వారసుడు సైతం ప్రవేశించి మొగలాయి సైనికులను ఎత్తిన కత్తి దించకుండా వధించడం మొదలుపెట్టాడు. మొఘల్ సైనికులు ఆ బాలుడిని దొంగచాటు దెబ్బ తీయడంతో అతడు అమరుడయ్యాడు. వారసుడు చనిపోయాడని తెలిసినా దుర్గావతి యుద్ధాన్ని ఆపవద్దని ఆజ్ఞాపించింది. ఇది తెలిసి దుర్గావతిని మొచ్చుకున్నాడు ఆసిఫ్‌ఖాన్.

యుద్ధరంగంలో బలహీనపడుతున్నా గోండు సైనికులు మహా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. అప్పటికీ యుద్ధం చేసి నీరసించి, గాయాలపాలైన దుర్గావతి తలకి బాణం తగిలింది. అయినా పోరాటాన్ని వీడలేదు. మొగలాయి సైనికులందరూ మూకుమ్మడిగా ఆమెపై విరుచుకుపడటంతో రణరంగం నుండి నిష్క్రమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొఘల్ సైన్యం చేతిలో పరాభవం చూడలేక ఖడ్గానికి మొక్కిన వీర వనిత అదే ఖడ్గంతో తనని తాను పొడుచుకుని యుద్ధ భూమిలోనే ప్రాణత్యాగం చేసింది. (24 జూన్ 1964). గోండు సైనికులు ఆ వీర నారీమణిని ఆమె పుత్రుని శిబిరం వద్ద దహనం చేశారు. గోండు రాజ్య సుపరిపాలన కోసం వీర మరణం పొందిన వీరనారి దుర్గావతి ఆదివాసీ యోధురాలు కావడమేనేమో, భారతీయ వీరవనితలలో ఆమె పోరాట చరిత్రను పాలకులు విస్మరించారు.

(నేడు రాణి దుర్గావతి వర్ధంతి)


గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

9491318409


Next Story

Most Viewed