బీసీ ఉద్యమానికి.. తాత్విక పునాదులు ఉన్నాయా?

by Ravi |   (  Updated:2025-10-31 01:01:24  IST  )

ప్రపంచంలో ఏ లక్ష్యమైనా గమ్యం చేరుకోవాలంటే అది ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. అమెరికా, ఫ్రెంచ్, రష్యా విప్లవాలైనా,

బీసీ ఉద్యమానికి.. తాత్విక పునాదులు ఉన్నాయా?
X

ప్రపంచంలో ఏ లక్ష్యమైనా గమ్యం చేరుకోవాలంటే అది ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. అమెరికా, ఫ్రెంచ్, రష్యా విప్లవాలైనా, భారత స్వతంత్ర పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన తర్వాతనే గమ్యాన్ని చేరుకున్నాయి. అయితే లక్ష్యం, గమ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒక తాత్విక పునాది, భావజాల విస్తరణ అవసరం.

తమిళనాడులో పెరియర్ రామస్వామి నాయకర్ స్వాభిమాన ఉద్యమం ద్వారా ఆత్మగౌరవం, విద్యా, సమానత్వం కోసం ఉద్యమించాడు. ఆయన వెనుకబడిన తరగతుల తాత్విక ఉద్యమాల ప్రభావంతో ద్రవిడ రాజకీయాలు ఉద్భవించాయి. 1949లో అన్నాదురై డీఎంకే పార్టీని స్థాపించి 1967లో తొలి బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కరుణానిధి, స్టాలిన్ ముఖ్యమంత్రులు కాగలిగారు. ఈ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలోనే ఏఐఏడీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. వారు బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగారు. ఇక కేరళ రాష్ట్రంలో శ్రీ నారాయణ గురు ‘శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం’ స్థాపించి వెనుకబడిన తరగతుల సామాజిక, విద్య, ఆర్థిక ఉన్నతి కోసం ప్రయత్నిస్తూ వారిలో తాత్విక పునాదిని ఏర్పరిచారు. అందుకే పినరాయ్ విజయన్ లాంటి బీసీ నాయకులు ముఖ్యమంత్రులు కాగలిగారు. కర్ణాటకలో దేవరాజ్ ఉర్సు బీసీ, దళిత, అల్పసంఖ్యాక ఉద్యమానికి పునాది వేశాడు. అందువల్లే, ఉర్సు, సిద్ధరామయ్య లాంటి బీసీ నాయకులు ముఖ్యమంత్రులు కాగలిగారు.

ఆ భావజాల వ్యాప్తి జరగనందునే..

రామ్ మనోహర్ లోహియా సోషలిస్టు ఉద్యమాలు ఉత్తర భారతదేశంలో వెనుకబడిన తరగతులను రాజకీయంగా చైతన్య పరిచాయి. ఆయన తాత్విక నినాదం మండల కమిషన్‌కు పునాది అయింది. ఆ మండల్ కమిషన్ సిఫారసుల అమలు ఉద్యమానికి నాంది పలికి కర్పూరీ ఠాగూర్, ములాయిక్ సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ లాంటి వారు ముఖ్యమంత్రులు కాగలిగారు. ఉత్తరప్రదేశ్‌లో కాన్సిరాం 1978లో బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి, 1981లో దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి (DS4) స్థాపించి అణగారిన వర్గాలను రాజకీయంగా చైతన్యపరిచి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బహుజనుల ప్రాతినిధ్యాన్ని పెంచి, 1995లో మాయావతిని ముఖ్యమంత్రిగా చేయగలిగారు.

ఒక్క బీసీ కూడా సీఎం కాలేదు.. ఎందుకు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, నేటి తెలంగాణ రాష్ట్రంలో గానీ అటువంటి వెనక బడిన తరగతుల పోరాట నేపథ్యంతో కూడిన తాత్విక పునాదులు ఏ మేరకైనా ఉన్నాయా? ఆ రకమైన భావజాలం ఏమైనా ఉందా? రాజ్యాధికారాన్ని అందుకునే స్థాయిలో ఇతర వెనుక బడిన తరగతుల తాత్విక పునాది గాని, భావజాల వ్యాప్తి గాని లేదు కాబట్టే 60 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, 10 సంవత్సరాల తెలంగాణాలో గాని ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు.

ఇందులో తప్పు ఎవరిది?

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను అన్ని పార్టీల మద్దతుతో శాసనసభ ఆమోదిస్తూ గవర్నర్‌కు పంపడం, అది గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, తదుపరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేయడం, అది గవర్నర్ సంతకం కాకుండా పెండింగ్‌లో ఉండటం, దీంతో 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపడం, అది పెండింగ్‌లో ఉండటంతో, ప్రభుత్వం జీవో- 9 ద్వారా ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ ఇవ్వడం ఆ లోపు హైకోర్టు ఇందుకు స్టే విధించడం, సుప్రీంకోర్టులో పిల్ వేయడం, ఆ కోర్టు హైకోర్టులోనే నిర్ణయించుకోండని పిల్ కొట్టివేయడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈ పరిణామాలను చూసైనా బీసీలు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఈ మొత్తం పరిణామాలలో తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది? రిజ ర్వేషన్ల సాధనకు అక్టోబర్ 18న ‘బంద్ ఫర్ జస్టిస్’కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. పాల్గొన్నాయి. మరి అందరూ శాకాహారులైతే రొయ్యల పులుసు ఎక్కడ పాయే? అన్నట్లుంది వ్యవహారం.

తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ..

ఈ మొత్తం వ్యవహారంలో బీసీలు ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఏ పార్టీ వారైనా వారి వారి ప్రయోజనాల కోసమే నటిస్తున్నారు కానీ పూర్తి చిత్తశుద్ధి లేదనేది అర్థం చేసుకోవాలి. మనం ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్యం తాత్విక పునాదిని ఏర్పరచాలి. ఆ తాత్విక పునాదిపై భావ ప్రచారం జరగాలి. ఆ భావ ప్రచారం ప్రజా ఉద్యమంగా మారాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉదాహ రణగా తీసుకోవాలి. 1969 తొలి దశ ఉద్యమంతో తెలంగాణ ఏర్పాటు కాకపోవడానికి కారణం ప్రజల్లో ఆ భావ ప్రచారం లేకపోవడం, కానీ 2009లో జరిగిన మలిదశ ఉద్యమం అలా కాదు.. ఈ ఉద్యమాన్ని కళారూపాల పేర భావ ప్రచారం చేశారు.. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా భావజాలం పుస్తక రూపేణా, కరపత్రాల రూపేణా, పత్రికల్లో వ్యాసాల రూపేణా, ప్రజల్లోకి వెళ్లగలిగింది. అప్పుడే ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. ఆ లక్ష్యం గమ్యాన్ని చేరుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అవతరించింది.

మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి!

మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణ రాష్ట్రంలో గానీ, బీసీ ఉద్యమానికి తాత్విక పునాది ఏ మేరకు ఏర్పడిందో బీసీ నాయకులు ప్రశ్నించుకోవాలి? బీసీ భావజాలం ఏ మేరకు గ్రామీణ ప్రాంతాలకు చేరుకుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి? ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవడంలో భాగంగానైనా బీసీల తాత్విక పునాదులు గట్టి పరచుకోవాలి. కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాలు, పత్రికల్లో వ్యాసాలు, జిల్లా, తాలూకా, మండల కేంద్రాలలో శిక్షణ తరగతుల రూపేణా భావజాలం గ్రామీణ ప్రాంతానికి చేరాలి. చివరగా శాంతియుత పద్ధతుల్లో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అప్పుడే న్యాయవ్యవస్థ తీర్పులను అధిగమించే రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ద్వారా చేయించుకోగలుగుతాం. ఆ దిశగా తెలంగాణలో మరో ప్రత్యేక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.

-జుర్రు నారాయణ యాదవ్,

94940 19270

Next Story