- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానులకూ చట్టబద్ధత అవసరమా?
దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది. దేశంలో ఏ రాష్ట్రం తన రాజధానిని రక్షించుకోవా ల్సిన అగత్యం ఏర్పడలేదు.. ఏ రాష్ట్రం ఈ స్థాయిలో రాజకీయ వ్యంగ్యాన్ని ఎదుర్కోలేదు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది. దేశంలో ఏ రాష్ట్రం తన రాజధానిని రక్షించుకోవా ల్సిన అగత్యం ఏర్పడలేదు.. ఏ రాష్ట్రం ఈ స్థాయిలో రాజకీయ వ్యంగ్యాన్ని ఎదుర్కోలేదు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికి కూడా రాజధాని చట్టబద్ధత కోసం ప్రత్యేక చట్టం చేయాలన్న డిమాండ్ రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రాజధానిని రక్షించుకోవడానికి చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ..
దేశంలో ఎక్కడా ప్రభుత్వం మారితే రాజధాని మార్చాలి అనే చర్చ జరగలేదు. దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజధాని అంశం ప్రాంతీయ విద్వేషాలకు ఇంధనంగా మారి చట్టబద్ధత కల్పించాల్సిన స్థాయికి దిగజారి రాజధానిని చట్టంలో బంధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజ్యాంగానికి చట్టబద్ధత అసాధారణం!
భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడా రాజధానికి చట్ట బద్ధత కల్పించాలనే నిబంధన లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల రాజధానులు ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల ద్వారానే ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చట్టం అవసరమైంది? ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మార్చే చర్చ పెట్టే రాజకీయాలు ఉన్నంత కాలం రాష్ట్రం ముందుకు వెళ్లదు. ప్రజలు అభివృద్ధి ఎరుగరు. రాజధానికి చట్టబద్ధం చేయడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రక్షణ.
ఏ కోడ్ లేని రాజధాని..
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల పేరుతో విశాఖ పట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో ప్రధానంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్ అంథకారంలో చిక్కుకుంది. మూడు రాజధానులే తమ రాజకీయ అజెండా అని ప్రకటించి, ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ పరాజయం పాలైంది. రాజధాని అమరావతికి ఇంత వరకు ప్రత్యేకంగా పోస్టల్ శాఖలో పిన్ కోడ్ లేదు. టెలికం శాఖకు సంబంధించి ఎన్టీడీ, ఐఎస్ఓ కోడ్ లేదు. వెలగపూడిలోని సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు కార్యాలయాల్లో ఈ రెండు కోడ్లతోనే ల్యాండ్ ఫోన్లు కొనసాగుతున్నాయి. ప్రత్యేక పిన్ కోడ్ కేటాయింపు లేదు. ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి ఉంటుందా లేదా? అనే సందేహం అమరావతి రైతులను వెంటాడటంతో రాజ ధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
చట్టంతోనే రాజధానికి రక్షణ..
చట్టం చేస్తే అమరావతిపై రాజకీయ జోక్యం ఉండదని అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుందని రాజధాని రైతులు అభిప్రాయపడటంతో, గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును కూటమి ప్రభుత్వం రద్దు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక, ఏకైక రాజధానిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉంది. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయ నుంది. దీంతో ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి రాజధాని చట్టబద్ధత ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావడానికి వేగంగా అడుగులు పడుతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ విషయమై సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో అనేక సార్లు చర్చించడంతో అమరావతి చట్టబద్ధ ప్రక్రియ వేగం పుంజుకుంది.
చట్టబద్ధతకు అడుగులు పడుతున్న వేళ..
ఎట్టకేలకు రాజధాని చట్టబద్ధతకు అడుగులు పడుతున్న వేళ అమరావతి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం వల్ల కేవలం రాజకీయ గుర్తింపే కాకుండా, ఆర్థిక పరిపాలనా పరమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. చట్టబద్ధమైన రాజధానిగా గుర్తింపు ఉంటేనే ప్రపంచ బ్యాంక్ వంటి అంత ర్జాతీయ సంస్థల నుంచి రుణాల సేకరణ సులభతరం అవుతుంది. అలాగే భవిష్యత్‌లో రాజధాని మార్పుపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ చట్ట బద్ధత రక్షణ కవచంలా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ పెట్టుబడుల ఆకర్షణకు మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అమరా వతిని రాజధానిగా చట్టబద్ధం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా ఈ బిల్లును ఆమోదింపజేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. కాబట్టి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించి రాజధాని అమరావతికి రక్షణ కల్పించి, వికృత రాజకీయానికి అడ్డు కట్టవేయాలి.
- నీరుకొండ ప్రసాద్
98496 25610






