- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ బుల్లీయింగ్.. డిజిటల్ యుగంలో పెరుగుతున్న మౌన హింస
ఇప్పటి హైటెక్ కాలంలో ఇంటర్నెట్ అందరికీ ఒక పెద్ద వేదిక. చదువు, ఉద్యోగం, వినోదం... అన్నింటికీ ఇది అవసరం. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద సమస్య కూడా పెరుగుతోంది, అదే సైబర్ బుల్లీయింగ్.

ఇప్పటి హైటెక్ కాలంలో ఇంటర్నెట్ అందరికీ ఒక పెద్ద వేదిక. చదువు, ఉద్యోగం, వినోదం... అన్నింటికీ ఇది అవసరం. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద సమస్య కూడా పెరుగుతోంది, అదే సైబర్ బుల్లీయింగ్. అంటే మొబైల్, సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు, చాట్ యాప్స్, వక్రీకృత గ్రూప్‌ల వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడం, వేధించడం, అవమానించడం. సైబర్ బుల్లీయింగ్ కేవలం ‘సరదా’ కాదు. ఒక లోతైన భావోద్వేగ సమస్య లేదా ప్రవర్తన లోపం. వాళ్లు ఇలా ప్రవర్తించడానికి కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కానీ ఆ ప్రవర్తనను సమర్థించరాదు.
ఎలా జరుగుతుంది?
నిరంతరం నెగెటివ్ లేదా దూషణలతో కామెంట్లు పెట్టడం. మీ వ్యక్తిగత సమాచారాన్ని వ్యంగ్యంగా పంచడం. మీ ఫోటోలను మార్చి ట్రోల్ పేజీల్లో పెట్టడం. గ్రూపుల్లో మిమ్మల్ని అవమానించే మీమ్స్ తయారు చేయడం. బెదిరించే మెసేజులు పంపడం. సోషల్ మీడియాలో నకిలీ రూమర్స్ పర్చడం. ఇవి చిన్నగా కనిపించినా, బాధితుడు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ.. సైబర్ బుల్లీయింగ్ బాధితులపై దీర్ఘకాల మానసిక ప్రభావాలు చూపుతుంది. రోజూ ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొనే వారు స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్‌లో పడిపోతారు. నిరంతరం నిందలు వినడం వల్ల మనసు బలహీనపడుతుంది. ఇతరులతో మాట్లాడటం, బయటకు వెళ్లడం కూడా ఇష్టపడరు.. సోషల్ మీడియా ఓపెన్ చేయడానికి కూడా భయపడే స్థితి వారిలో ఏర్పడుతుంది.
సైబర్ బుల్లీయిస్టుల మానసిక లక్షణాలు
స్వీయ గౌరవం తక్కువగా ఉంటుంది. తమను తాము బల హీనంగా భావించే వాళ్లు, ఇతరులను కిందపడేసి తాము ‘బలమైన వాళ్లం’ అని భావించే ప్రయత్నం చేస్తారు. అతి స్వార్థం. ‘నేనే గొప్ప’ భావన. కొంతమందికి తాము ఎవరినైనా తక్కువగా చూపించడానికి హక్కు ఉందనిపిస్తుంది. ఇది ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ లక్షణం’. ఇతరుల భావాలు ఏమిటి అని ఆలోచించకుండా, తాము చేసేది సరదాగా అనిపిస్తే చాలు అనుకునే స్వభావం. ఆగ్రహం లేదా హఠాత్ చర్యలను నియంత్రించలేక పోవడం. కోపం, అసూయ, అసహనం ఉన్నప్పుడు వెంటనే దూషించే మెసేజ్‌లు రాయడం..
ఎందుకు వారు టార్గెట్ చేస్తారు?
బలహీనంగా కనిపించే వారు సైబర్ బుల్లీల దృష్టిలో పడతారు. చాలాసార్లు ఒంటరి, సైలెంట్, సున్నితమైన వాళ్లను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ‘వాళ్లు తట్టుకోలేరు’ అని దుర్మార్గంగా భావిస్తారు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే వారిపై గురి పెడతారు. చురుకైన, ఎక్కువ పోస్ట్ చేసే, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవారు ట్రోలింగ్‌కు బలవుతారు. పాలిటిక్స్, మతం, సినిమా వంటి సున్నితమైన విషయాల్లో విభిన్న అభిప్రాయం చెప్పిన వారని టార్గెట్ చేస్తారు. మహిళలు, బాలికలపై ట్రోలింగ్, స్టాకింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్లను ‘ఈజీ టార్గెట్’గా అనుకునే వక్రీకృత ఆలోచన వీరిలో ఉంటుంది. అసూయ కలిగితే అది సైబర్ బుల్లీయింగ్ రూపంలో వెలువడుతుంది.
ఇది చిన్న తప్పు కాదు..
సైబర్ బుల్లీయింగ్ కేవలం ఆన్‌లైన్‌లో చేసిన చిన్న తప్పు కాదు, అది వ్యక్తి అంతర్ముఖ భావాలు, అసురక్షితత, కోపం, అనుభూతి లోపం, పర్యావరణ ప్రభావాలు వంటి వాటన్నింటి ప్రతిబింబం. సైబర్ బుల్లీయింగ్ స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం, భయభ్రాంతి, స్వీయ గౌరవం కోల్పోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే సైకాలజిస్టులు చెబు తున్నట్లు, బాధితులు మాట్లాడడం, సహాయం కోరడం, మౌనంగా ఉండకపోవడం అత్యంత ముఖ్యమైనది. దానికి పరిష్కారం అవగా హనతో పాటు, మానసిక మద్దతు, చట్టపరమైన రక్షణ అనే మూడు వంతెనల ద్వారానే ఇది సాధ్యమవుతుంది.
- అనూరాధ నాయుడు ఎం
సైకాలజిస్ట్,
83175 88344






