- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీల అస్తిత్వంపై.. కార్పొరేట్ దండయాత్ర
పాండవులు, శ్రీరాముడు వంటి పురాణ పురుషులు తమ అరణ్యవాసాన్ని ధర్మాచరణ కోసం ఎంచుకున్న పవిత్ర భూమి అరణ్యాలు.. వేల సంవత్సరాల చరిత్ర గల ఈ దండకారణ్యం, కేవలం ఆశ్రయం పొందిన ప్రదేశంగానే

పాండవులు, శ్రీరాముడు వంటి పురాణ పురుషులు తమ అరణ్యవాసాన్ని ధర్మాచరణ కోసం ఎంచుకున్న పవిత్ర భూమి అరణ్యాలు.. వేల సంవత్సరాల చరిత్ర గల ఈ దండకారణ్యం, కేవలం ఆశ్రయం పొందిన ప్రదేశంగానే కాక, ధర్మాన్ని, ప్రకృతిని అనుసరించి జీవించే విధానానికి ప్రతీకగా నిలిచింది. కానీ, భారత దేశంలోని అడవి ప్రాంతాలు, ప్రత్యేకించి రాజ్యాంగం ద్వారా ఐదవ షెడ్యూల్ రక్షణ కల్పించిన గిరిజన ప్రాంతాలు, నేడు అపారమైన ఖనిజ సంపద కారణంగా ఆధునిక కార్పొరేట్ సంస్థల దోపిడీకి, ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యానికి బలి అవుతున్నాయి.
ఈ భూములను ఇప్పుడు కేవలం బొగ్గు, బాక్సైట్, ఇను ము, యురేనియం వంటి ఖనిజాలను వెలికి తీసే కేంద్రా లుగా మాత్రమే చూస్తున్నారు పాలకులు. ఈ దోపిడీ కేవ లం భూమిని ఆక్రమించడమే కాదు, తరతరాలుగా ప్రకృ తితో మమేకమై జీవిస్తున్న ఆదివాసుల అస్తిత్వాన్ని, సంస్కృ తిని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నంగా ఉంది. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న ఆదివాసీలపై చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు, వారిపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి.
రాజ్యాంగ రక్షణల ఉల్లంఘన..
భారత రాజ్యాంగం, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి ప్రత్యేక సంస్కృతికి రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ఐదవ షెడ్యూల్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ రక్షణలకు తోడుగా రూపొందించబడిన కీలక చట్టాలైన పెసా-1996, అటవీ హక్కుల చట్టం- 2006లను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. PESA చట్టం ప్రకారం, మైనింగ్ లేదా ఏదైనా భూమి వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు గిరిజన గ్రామ సభ ముందస్తు అంగీకారం తప్పనిసరి. అయితే, అదానీ, జిందాల్, ఎస్సార్ వంటి సంస్థలకు గనుల తవ్వకం అనుమతులు మంజూరు చేసే క్రమంలో, ప్రభుత్వాలు ఈ గ్రామ సభల అధికారాలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఈ తీర్మానాలను తప్పుడు పద్ధతుల్లో పొందడమో లేదా అధికారుల ఒత్తిడితో తారుమారు చేసి, ఈ చట్టాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కార్పొరేట్ దోపిడీ..
గిరిజనులు కేవలం అడవులపై ఆధారపడే జీవన సమూహాలు మాత్రమే కాదు. శతాబ్దాలుగా ఈ అడవులకు సంరక్షకులు. వారి సాంప్రదాయ పరిజ్ఞానం, భూమి, వనరులను నిలకడగా వినియోగించుకునే విధానాలు పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం. వారి దేవతలు, ఆచారాలు, పండుగలు.. అడవి, పర్వతాలు, నీటి వనరుల చుట్టూ అల్లుకుని ఉంటాయి. వీరిని కాపాడుకునేందుకు అటవీ చట్టం వారి వ్యక్తిగత, సామాజిక హక్కులను చట్టబద్ధంగా గుర్తించినప్పటికీ, ఈ హక్కుల అమలును అడ్డుకుంటూ, ప్రభుత్వాలు అడవులను కార్పొరేట్లకు సులభంగా అప్పజెప్పడానికి వీలుగా విధానపరమైన మార్పులు చేస్తున్నాయి. అవి గిరిజనులను అడవి నుంచి శాశ్వతంగా వెళ్లగొట్టే కుట్రగా భావించబడుతున్నాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న ఆదివాసీలపై చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రపంచం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, అడవులను కాపాడుకోవడంలో ఆదివాసీల పాత్రను విస్మరించడం అనేది భవిష్యత్తుకు ప్రమాదకరం.
సుప్రీంకోర్టు నియత్రించమని చెప్పినా..
మైనింగ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో, అటవీ శాఖ, మైనింగ్ శాఖల మధ్య సరైన సమన్వయం లోపించడం, పర్యావరణ ప్రభావ అంచనాలు సరిగ్గా అంచనా వేయలేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు సైతం సమత తీర్పులో గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ను నియంత్రించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ప్రభుత్వాలు కొత్త చట్టాలను రూపొందించడం, లేదా ఉన్న చట్టాల అమలును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చట్టాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అధికారం ఉన్నందున, స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆదివాసుల హక్కులను బలిచేయడం సులభమవుతోంది. గిరిజన సలహా మండలి వంటి రాజ్యాంగ సంస్థలు కూడా కేవలం నామమాత్రంగానే పనిచేస్తూ, గిరిజనులకు న్యాయం చేయడంలో విఫలమౌతున్నాయి.
గిరిజనుల ఐక్యత ఎంతో ముఖ్యం!
ఐదవ షెడ్యూల్ ప్రాంతాన్ని రక్షించుకోవడం, తద్వారా అడవి పవిత్రతను, దేశ ఖనిజ సంపదను కాపాడుకోవడం తక్షణ అవసరం. ఇందుకు కావలసింది గిరిజనుల ఐక్యత, పౌర సమాజం క్రియాశీల మద్దతు. ఆదివాసీలు తమకు రాజ్యాంగం కల్పించిన గ్రామసభ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అంతర్జాతీయ వేదికలపై తమ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపాలి. ప్రభుత్వాలు సైతం తక్షణం PESA, FRA చట్టాలను పూర్తి స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ ఇవ్వాలి. గిరిజనుల ఆత్మగౌరవాన్ని, జీవనాన్ని కాపాడటం అనేది కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదు, దేశ పర్యావరణ భద్రతకు, రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత కీలకం. వారి సంస్కృతిని, ప్రకృతితో వారి అనుబంధాన్ని కాపాడటమంటే, దేశ సహజ వనరులను భవిష్యత్తు తరాలకు సంరక్షించడమే.
-వెంక గారి భూమయ్య
98485 59863






