దేశాన్ని నడిపిందీ.. నడిపించేదీ కాంగ్రెస్సే!

by Ravi |   (  Updated:2024-12-28 00:46:09  IST  )

శతాబ్దాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి బలై నిరుపేద దేశంగా మారిన భారతదేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో

దేశాన్ని నడిపిందీ.. నడిపించేదీ కాంగ్రెస్సే!
X

శతాబ్దాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి బలై నిరుపేద దేశంగా మారిన భారతదేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. లింగ వివక్ష, నిరుద్యోగం, కులవివక్ష, మతతత్వ విద్వేషాలు, ఆర్థిక అసమానతలు, టెర్రరిజం వంటి సమస్యలను నిర్మూలించడానికి కాంగ్రెస్ తన పాలన ద్వారా విశేష కృషి చేసి చాలా మటుకు విజయం సాధించిందనే చెప్పాలి. దేశం అనేక రంగాల్లో విశేష అభివృద్ధి సాధించడంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది. లౌకిక ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధురాలై కొనసాగుతోంది.

భారత రాజకీయాలను పార్లమెంటరీ ప్రజాస్వామ్య గాడిలో నడిపి సమతావాదానికి తనవంతు కృషి చేసిన 139 సం.ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ అనేక మంది ఆదర్శ రాజకీయ నాయకులను దేశానికి అందించింది. జవహర్ లాల్ నెహ్రూ లాంటి గొప్ప నాయకుడు ప్రజాస్వామ్య, సామ్య వాద దిశలో దేశాన్ని నడిపి దేశ ప్రజాబహుళ్యాన్ని అభివృద్ధి పంథాలో నడిపించారు. ఆలీన విధానంతో ప్రపంచ రాజకీయాల్లో నెహ్రూ శాంతి దూతగా వెలుగొందారు. బీ.ఆర్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని రాయడంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది. భారత్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించడంలో రాజ్యాంగం పాత్ర జగద్విదితమే. రాజకీయాలలో చివరిదాకా నైతిక విలువలను తూ.చ తప్పకుండా పాటించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ వారే. ఉప ప్రధాని, రక్షణ, కార్మిక మంత్రిగా దళిత నేత బాబు జగ్జీవనరాం ఎదిగారు.

ఆధునిక భారత నిర్మాత నెహ్రూ!

బ్రిటిష్ ఇండియాలో భారతీయ సమాజం పేదరికానికి, విభజన రాజకీయాలకు గురై వెనకబాటుతనంలో కూరుకుపోయింది. అలాంటి తరుణంలో నెహ్రూ దేశ తొలి ప్రధానిగా, ఆధునిక భారతదేశ నిర్మాతగా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించారు. నెహ్రూ పాలనలో పంచవర్ష ప్రణాళికలతో 7 శాతం వార్షిక పారిశ్రామిక వృద్ధిని దేశం సాధించింది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద పారిశ్రామిక దేశంగా ఆవతరించింది. స్వదేశీ పరిశ్రమల సంస్కరణల్లో భాగంగా భూ సంస్కరణలు ప్రారంభించి వ్యవసాయాభివృద్ధిని సాధించింది. వ్యవసాయ పరిశోధనల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. సామాజిక సంస్కరణల్లో భాగంగా 1955-56‌ల మధ్య నాలుగు హిందుకోడ్ బిల్లులను ఆమోదింపజేసి మహిళా సాధికారతకు పునాదులు వేశారు. అగ్ర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి దేశాభివృద్ధికి వారి మద్దతును సాధించారు.

ఆదర్శాలకు నిలువెత్తు రూపం శాస్త్రి

తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ ఆదర్శ విధానాలను కొనసాగించి 1966లో పాకిస్తాన్ దురాక్రమణను సమర్థంగా ఎదుర్కొని తాష్కెంట్ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు.

ఉక్కు మహిళ విజయేందిర

ఇందిరాగాంధీ 1966లో దేశ మూడవ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నెహ్రూ ఆదర్శాలను తన పాలనలో అమలు పరచి సమాజంలో అట్టడుగు వర్గాల వారిని అధికార పరిధిలోకి తీసుకొచ్చారు. గరీబీ హఠావో అనే నినాదంతో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1975లో వెట్టిచాకిరి నిర్మూలనకు చట్టం తీసుకొచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు. హరిత విప్లవం ద్వారా వ్యవసాయం దిగుబడులను గణ నీయంగా పెంచగలిగారు. 20 బ్యాంకులను జాతీయం చేసి, రాజభరణాలను రద్దు చేసి, 20 సూత్రాల ప్రణాళికలను అమలు పరచి పేదరిక నిర్మూలన దిశగా ముందుకు కదిలారు. 1971లో పాకిస్తా‌న్‌తో యుద్ధంలో విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవతరణకు తోడ్పడి దుర్గామాతగా నాటి ప్రతిపక్ష నేతల నుంచి జేజేలు అందుకున్నారు. 1984లో ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని అంతం చేసేందుకు బ్లూస్టార్ ఆపరేషన్ చేపట్టి తదనంతరం తన ప్రాణాలనే ఇందిరాగాంధీ దేశం కోసం అర్పించారు.

టెలికాం, సాఫ్ట్‌వేర్ ఆద్యుడు రాజీవ్

ఇందిర మరణాంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశంలో సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ రంగాలను కొత్తపుంతలు తొక్కించారు. 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించి యువ నాయకుడిగా వెలుగొందారు. విదే శాంగ విధానంలో భాగంగా మన దేశ భద్రత కోసం శ్రీలంకలోని తమిళల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సమయంలో ఎల్టీటీఈ తీవ్రవాదుల బాంబు దాడిలో మరణించారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ

1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సరళీకృత ఆర్థిక విధానాలు ఆచరించి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి అపర చాణక్యుడిగా పేరుగాంచారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసి మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు విజయవంతంగా నడిపారు.

ఆర్థిక రంగ రథ చోదకుడు మన్మోహన్

2004లో యూపీఏ కూటమి తరపున ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన డా.మన్మోహన్ సింగ్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధి రేటు చైనా వార్షిక వృద్ధి రేటుతో పోటీ పడింది. రెండో అతివేగ ఆర్థిక అభివృద్ధి దేశంగా భారతదేశం పేరుగాంచింది. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ నిరుద్యోగాన్ని పారదోలేందుకు కృషి చేశారు. దేశంలో ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు 20 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. దేశంలో పెరుగుతున్న తీవ్రవాదాన్ని అరికట్టడానికి విశేషంగా కృషి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలను పేదలకు పంచడానికి విశేష కృషి చేసిన ఆర్థికవేత్త మన్మోహన్.

వైఫల్యాలను దాటి మునుముందుకు..

ఎంతటి గొప్ప పాలనలో కూడా కొన్ని వైఫల్యాలు ఉంటాయి. దీనికి కారణాలు లేకపోలేదు. అభివృద్ధి అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, ప్రపంచానికే ఆదర్శ పూరితమైన భారత జాతీయత పునాదిగా జాతీయ సమైక్యతను సాధించి, దేశ సార్వభౌమాధికారాన్ని విజయవంతంగా కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనన్నది నేటి తరం తెలుసుకోవాల్సిన చారిత్రక సత్యం. నేడు దేశం అనేక రంగాల్లో విశేష అభివృద్ధి సాధించడంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది అన్నది వాస్తవం. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడం కాంగ్రెస్ ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానాలే ఫలితమే. ఈ ఫలాలను పేదవారికి పంచడానికి యువత ఆదర్శ నాయకుడు, రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా కృషి చేస్తోంది నెహ్రూ, గాంధీ ఆచరించిన సామ్యవాద, లౌకిక విధానాల ఆధారంగా క్రియాశీలంగా పనిచేస్తూ లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కంకణబద్దురాలై ముందుకు సాగుతోంది.

( ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం సందర్భంగా)

పెండ్యాల విక్రమార్క

పరిశోధక విద్యార్థి, ఓయూ

70321 26503

Next Story