కామన్ మ్యాన్ డైరీ: కామా తురాణాం...!

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: కామా తురాణాం...!
X

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన రాములు చేపలు పడుతూ బతికేవాడు. చెరువులు ఆనవాళ్లు కోల్పోయి బతుకుదెరువుకు తోటివారంతా హైదరాబాద్‌కు చేరడంతో తాను కూడా పదేళ్ల క్రితమే సిటీకి వచ్చేశాడు. వెంకటాపురంలో ఇద్దరు మిత్రులతో కలిసి ఉండేవాడు. సెంట్రింగ్ వర్క్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఓ మేస్త్రీకి రూ. పది వేలు ఇచ్చి పని నేర్చుకున్నాడు. ఏడాది తరువాత దోస్తులతో కలిసి పని మొదలుపెట్టాడు. సంపాదన బాగా ఉండడంతో బైక్ కొన్నాడు. ఊరిలో ఇంటిని రిపేర్ చేయించాడు. తల్లి పోచమ్మ అక్కడే ఉంటున్నది. చుట్టాలలోనూ రాములుకు మంచి పేరొచ్చింది. అదే ప్రాంతంలో ఉండే కిష్టయ్య తన కూతురు సంధ్యను రాములుకు ఇచ్చి వివాహం చేశాడు.

కట్నకానుకలు పెద్దగా ఆశించలేదు. సంధ్యను తల్లివద్దే ఉంచాడు. రెండు మూడు రోజులకు ఒకసారి ఊరికి వెళ్లొచ్చేవాడు. ఆరు నెలలు గడిచాయి. సంధ్య తాను హైదరాబాద్​ వచ్చేస్తానని భర్తను అడిగింది. రాములు సమ్మతించలేదు. తన తల్లిని చూసుకోవాలని చెప్పాడు. కావాలంటే తాను ఊరిలోనే ఏదో ఓ పని చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఓ రోజు పుట్టింటికి వెళ్లిన సంధ్య హైదరాబాద్‌కు మకాం మార్చుతానంటనే వస్తానని కరాఖండిగా చెప్పింది. రాములు సైతం మొండికేశాడు. కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు సంధ్య తండ్రి కిష్టయ్య. కోడలును హైదరాబాద్ తీసుకెళితే తనకు​అభ్యంతరం లేదని చెప్పింది పోచమ్మ. దీంతో రాములు హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాడు.

*

వెంకటాపురంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పోచమ్మ అప్పుడప్పుడూ వచ్చి వెళుతోంది. సమయం చిక్కినప్పుడల్లా రాములు ఊరుకు వెళ్లొస్తున్నాడు. సంధ్య పండుగల సమయంలో వెళ్తున్నది. గర్భవతి కావడంతో పురుడు పోసుకొనేందుకు పుట్టింటికి వెళ్లింది. వెంకటాపురం ఇంటిని ఓనర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మేశాడు. కొత్త యజమాని ఖాళీ చేయమన్నాడు. రాములు మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అద్దె మూడున్నర వేల రూపాయలు. తానొక్కడే సామానంతా సర్దేశాడు. ఇంతలో 'సంధ్యకు పురిటినొప్పులొస్తున్నాయని, గజ్వేల్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని' కిష్టయ్య నుంచి ఫోన్ వచ్చింది. సంధ్య మగబిడ్డకు జన్మనిచ్చింది.

సాధారణ డెలివరీ కావడంతో మూడు రోజులలోనే డిశ్చార్జి చేశారు. బంధువులందరినీ పిలిచి తొట్లె కార్యక్రమాన్ని గ్రాండ్‌గానే చేశారు. మూడు నెలల పాటు పుట్టింటిలోనే ఉన్న సంధ్య తర్వాత రాములు సొంతింటికి వచ్చింది. అత్త పోచవ్వతో కలిసి రెండు మూడు రోజులుంది. హైదరాబాద్ వెళ్లిపోదామనడంతో రాములు భార్యను, తల్లిని తీసుకొని బొల్లారం వచ్చేశాడు. 'బాబుకు ఏడాది వచ్చే వరకు ఇక్కడే ఉండమ్మా, వాడిని పట్టుకునేందుకు నీవుంటేనే బాగుంటుందని' అన్నాడు రాములు. సరే అన్నది పోచవ్వ. అత్త తమతో ఉండటం సంధ్యకు ఇష్టం లేదు. ఏదో గొడవ పెట్టుకోవడం మొదలెట్టింది. పరిస్థితి గ్రహించిన పోచవ్వ తాను పట్నంలో ఉండలేనని ఊరెళ్లిపోయింది.

*

ఇంటి ఓనర్ పేరు శంకర్. ఆటోలు కిరాయికి ఇస్తుంటాడు. 45 యేళ్లు ఉంటాయి. భార్య పేరు గీత. సంతానం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేదు. పిల్లలు లేకపోవడంతో సంధ్య కొడుకును ఎత్తుకొని ఆడించేవారు. అలా వారు సంధ్యకు దగ్గరయ్యారు. పని కోసం బయటికి వెళ్తున్న భర్త రాత్రి ఎనిమిది గంటల వరకు తిరిగిరాకపోవడం. వచ్చేటప్పుడు మందు కొట్టి రావడం మామూలైపోయింది. ఓ రోజు శంకర్ భార్య గీత పుట్టింటికి వెళ్లింది. ఎప్పటి నుంచో సంధ్యపై కన్నేసిన శంకర్ దీనిని అవకాశంగా తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో సంధ్యకు మనసులోని మాట చెప్పాడు. 'తాగుబోతోడితో ఏం సంసారం చేస్తావ్, నేను చూసుకుంటాను, అవసరాలకు డబ్బులు సర్దుతానని' లొంగదీసుకున్నాడు.

సంధ్య ప్రవర్తనలో మార్పును గమనించాడు రాములు. ఎక్కడో తేడా కొడుతోందని భావించాడు. ఓ రోజు రాత్రి ఇంటికి వచ్చే సమయానికి శంకర్ ఆమె బెడ్ రూం నుంచి బయటికి రావడం చూశాడు. 'ఎందుకొచ్చాడు. ఏం జరుగుతోందంటూ' నిలదీశాడు. సంసారం నాశనమైందని ఏడ్చాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. బయటికి వెళ్లి మరో క్వార్టర్ తాగొచ్చాడు. సంధ్యను కొట్టాడు. అరుపులు గమనించిన శంకర్ వచ్చి రాములును తోసేశాడు. బెల్టుతో చితకబాదాడు. బస్తీవాళ్లంతా జమయ్యారు. వాళ్లకు ఏం చెప్పాలో రాములుకు అర్థం కావడం లేదు. శంకర్ నోరు పెంచాడు. 'బాగా తాగొచ్చి పెండ్లాన్ని కొడుతుండు, చెత్త నా కొడుకు' అంటూ తిడుతున్నాడు. గుమిగూడిన జనమంతా ఇళ్లకు వెళ్లిపోయాడు.

*

మరుసటి రోజు పనికి వెళ్లాడు రాములు. చేతులు ముందుకు కదలడం లేదు. సంధ్య తనను ఇంత మోసం చేస్తున్నదేమిటి? అనే ఆలోచన పదే పదే వస్తున్నది. పనిని మధ్యలోనే వదిలేశాడు. మందు తాగి ఇంటికి వెళ్లాడు. సంధ్య ఇంట్లో లేదు. టెన్షన్ పడి ఫోన్ చేశాడు. ఎత్తడం లేదు. గంట తర్వాత శంకర్‌తో బైక్ మీద ఇంటికి వచ్చింది. 'ఎక్కడికి వెళ్లారంటూ' గద్దించాడు. 'నీకు చెప్పాలని రూల్ ఉందా?' అంటూ సంధ్య గొంతు పెంచింది. రాములు సహనం కోల్పోయాడు. భార్య చెంప ఛెళ్లుమనిపించాడు. మళ్లీ సీన్‌లోకి శంకర్ ఎంటరయ్యాడు. ఈ సారి ఏకంగా ఓ లాఠీ తీసుకొనే వచ్చాడు. చితకబాదాడు. మళ్లీ జనం గుమిగూడారు. 'తాగొచ్చి ఆ పిల్లను ఆగం చేస్తుండు దొంగ నాకొడుకు' అంటూ తిడుతున్నాడు.

సంధ్య మరుసటి రోజు ఉదయం తండ్రికి ఫోన్ చేసింది. భర్తకు పిచ్చిలేసిందని, తనను చితకబాదున్నాడని ఏడుస్తూ చెప్పింది. దోస్తులను తీసుకుని బొల్లారానికి వచ్చాడు కిష్టయ్య. తండ్రి రాగానే బోరున విలపించింది సంధ్య. అందరూ కలిసి రాములును ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాములు మానసికంగా బాగానే ఉన్నాడన్నారు డాక్టర్లు. రెండు రోజుల తర్వాత ఊరిలో పంచాయితీ పెట్టారు. సమస్య పరిష్కారం కాలేదు. రాములు లిక్కర్ బంద్ చేసి డైజోఫాం కలిపిన కల్లు తాగుతున్నాడు. ఎప్పుడూ మగత నిద్రలోనే ఉంటున్నాడు. పనికి వెళ్లడం లేదు. ఎక్కడ ఉంటున్నాడో.. ఎక్కడ పడుకుంటున్నాడో తెలియదు.

*

విషయం తెలిసిన పోచవ్వ బొల్లారం వచ్చింది. రాములు ఇంటిలో లేకపోవడంతో సంధ్యను అడిగింది. ఆమె రివర్స్‌లో గొడవకు దిగింది. 'నీ దగ్గరే ఉన్నడట కదా, తొందరగా తీసుకురా' అంటూ గద్దించింది. 'వాడికి పిచ్చిలేసింది, ఎటేటో తిరుగుతున్నడు, కల్లుదుకాణాల దగ్గర సూడుపో' అన్నడు శంకర్. ఓ కల్లుదుకాణం దగ్గర పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించింది పోచవ్వ. తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించుకుంది. బొల్లారంలో ఉంటున్న ఇంటికి తీసుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం శంకర్ వచ్చాడు. 'మీ వోడికి పిచ్చి లేసింది. మెంటల్ ఆస్పత్రిలో చూపిద్దామంటూ' నమ్మబలికాడు. తిరిగి మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కల్లు సేవించడంతో మానసిక ఆందోళన చెందుతున్నాడని రెండు రోజులలో ఇంటికి తీసుకుపోవచ్చని చెప్పారు. పోచవ్వ బెంగతోనే సొంతూరుకు చేరింది.

రెండు రోజుల తరువాత రాములును తీసుకెళ్లమని సంధ్యకు ఫోన్ చేశారు డాక్టర్లు. శంకర్‌కు చెప్పింది సంధ్య. ఆస్పత్రికి వెళ్లి రాములును ఇంటికి తీసుకొచ్చారు. కాలికి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. అదను కోసం ఎదురు చూస్తున్నాడు శంకర్. మూడేళ్ల బాబు గాడ నిద్రలో ఉన్నాడు. రాములూ నిద్రపోతున్నాడు. పథకం ప్రకారం ముఖంపై దిండు పెట్టి రాములును చంపేశారు. రాత్రికి రాత్రే ప్రాణం పోయిందని అందరికీ ఫోన్లు చేసింది సంధ్య. శవాన్ని సొంతూరికి తీసుకుపోయారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. డెడ్ బాడీ వద్ద దొరికిన చిన్న క్లూ ఆధారంగా సంధ్య, శంకర్ జైలు పాలయ్యారు. రాములు కొడుకు సాత్విక్ అమ్మమ్మ దగ్గరకు చేరాడు. ఓ బలహీన క్షణం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.

Also Read : చాక్లెట్ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారం..


ఎంఎస్‌ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed