ఇకపై ఆ స్కూళ్లల్లో పుస్తకాలు ముందు పెట్టుకొని పరీక్ష రాయొచ్చు..

by Ravi |   (  Updated:2025-09-07 01:16:16  IST  )

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలు, మూల్యాంకన వ్యవస్థను సంస్కరించాలని

ఇకపై ఆ స్కూళ్లల్లో పుస్తకాలు ముందు పెట్టుకొని పరీక్ష రాయొచ్చు..
X

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలు, మూల్యాంకన వ్యవస్థను సంస్కరించాలని విద్యావేత్తల అభిప్రాయం. కేవలం విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా విశ్లేషణ, తార్కిక ఆలోచన, సృజనాత్మకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. జాతీయ పాఠశాల విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం- 2023, జాతీయ విద్యా విధానం- 2020లు సైతం విద్యార్థుల మూల్యాంకన ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ క్రమంలో ఒత్తిడి లేని వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి ఓపెన్ బుక్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవల సీబీఎస్సీ 9వ తరగతికి ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ విధానంలో విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాలకు పుస్తకాలు, నోట్స్, అధ్యయన సామగ్రిని అనుమతిస్తారు. విద్యార్థులు వాటిని చూసి సమాధానాలు రాయొచ్చు. అయితే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు కూడా విద్యార్థి సమస్యా పరిష్కార శక్తి, సృజనాత్మకత, ప్రాక్టికల్ అప్లికేషన్, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేసేలా ఉంటాయి. ఈ విధానం సీబీఎస్సీ అనుబంధ పాఠశాలలో అమలు చేయనున్నారు. ఇప్పుడు రాష్ట్ర బోర్డులు సైతం ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థుల మూల్యాంకన పద్ధతులను ఆధునీకరించే ప్రయత్నంలో, కేరళ పాఠశాలల్లో ఓపెన్ బుక్ పరీక్షలను అమలు చేయడాన్ని పరిశీలిస్తోంది.

విద్య వ్యాపారానికి అడ్డుకట్ట!

భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థ పరీక్షలు, బట్టీపట్టిన అభ్యాసం చుట్టే తిరుగుతుంది. చదువుల ఒత్తిడికి ప్రధాన కారణం పరీక్షలేననీ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీటిని తట్టుకోలేక దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరి కట్టడానికి విద్యాసంస్థల్లో విద్య కౌన్సిలర్లను నియమించాలని సూచించింది. ఈ క్రమంలో ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం తీసుకురావడం కొంత ఉపశమనం కల్పించే అంశం. పరీక్షలు అంటే ఒత్తిడి, భయం లేని పద్ధతి ఇదీ. విషయాన్నీ కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించవచ్చు. అలాగే విశ్లేషణ నైపుణ్యాలు, విమర్శనాత్మక దృక్పథం, సృజనాత్మక ఆలోచనలకు పెద్దపీట వేస్తుంది. వాస్తవంగా సీబీఎస్సీ ఓపెన్-బుక్ అసెస్‌మెంట్‌ తీసుకురావడం ఇదేం తొలిసారి కాదు. 2014లో వివిధ సబ్జెక్టులలో 9, 11 తరగతులకు ఓపెన్ టెక్స్ట్-బేస్డ్ అసెస్‌మెంట్ (OTBA)ను ప్రవేశపెట్టింది. అయితే విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడంలో పెద్దగా విజయం సాధించకపోవడంతో దీనిని 2017-18లో నిలిపి వేశారు. ఇటీవల పరీక్షల ఒత్తిడి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి తెచ్చారు.

పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తుంది!

గతేడాది మార్చిలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఓపెన్ బుక్ ఎగ్జామ్ (OBE) అమలు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి సీబీఎస్సీ ఒక సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్-డిసెంబర్‌లలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10 తరగతుల ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులకు అలాగే 11, 12 తరగతుల ఇంగ్లీష్, గణితం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులకు అనుమతించి పైలట్ అధ్యయనం నిర్వహించింది. వచ్చే ఏడాది 2026-27 నుంచి 9వ తరగతి పరీక్షలకు ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానంలో జరిగే పరీక్షలు తక్కువ ఒత్తిడితో కూడుకున్నవని భువ నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులతో 2021లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. పైగా దేశంలో పరీక్ష సంబంధిత విద్యార్థుల ఆత్మ హత్యలను తగ్గిస్తుందనీ స్పష్టం చేసింది. ఓపెన్ బుక్ విధానంతో బోర్డు పరీక్షల కోచింగ్ పరిశ్రమ విస్తరణను నిరోధించవచ్చు. ర్యాంకులు, మార్కుల ప్రాధాన్యం తగ్గుతుంది. దీంతో విద్య వ్యాపారాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. ఈ పరీక్ష విధానం వనరుల నిర్వహణ, విశ్లేషణ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు సమర్థవంతంగా రిఫరెన్స్ మెటీ రియల్‌లను ఉపయోగించడం నేర్చుకుంటారు. సంబంధిత సమాచారాన్ని త్వరగా కనుగొనే నైపుణ్యం, అన్వయించుకోవడం తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా విద్యాసంస్థలు విద్యార్థులను ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాయి.

సవాళ్లను అధిగమించాలి!

ఈ విధానంలో విద్యార్థులు పుస్తకం చూసి జవాబులు రాయడం అంత సులభం కాదు. పుస్తకాన్నీ చదివి ఉంటేనే రాయగలడు. కావున ఈ పద్ధతిలో కూడా విద్యార్ధులలో అనేక రకాల నైపుణ్యాలను పరీక్షించవచ్చు. ప్రశ్నాపత్రం రూపకల్పనలో మూస పద్ధతి సరికాదు. ఇది విద్యార్థుల్లో తార్కిక జ్ఞానం, సృజనాత్మకత వంటి భావనలు పెంపొందించే విధంగా ఉండాలి. విశ్లేషణాత్మక, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించాలి. ఓపెన్ బుక్ పరీక్షను ఎలా రాయాలో ముందుగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు సైతం ప్రశ్నలను రూపొందించడంలో తర్ఫీదు పొందాలి. ఓపెన్ బుక్ విధానంలో పరిమితులు కూడా లేకపోలేదు. ఇది ప్రధానంగా ఉన్నత తరగతులకే ఉపయోగం. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆశించిన ప్రయోజనం ఉండదు. ఓపెన్ బుక్ పరీక్షలో కొన్నిసార్లు విద్యార్థులు కంఠస్థం, తార్కిక, విమర్శనాత్మక ఆలోచనా వంటి ప్రాథమిక నైపుణ్యాలను విస్మరించే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుల పట్ల ప్రేరణ తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులు సమాచారం కోసం ఎక్కువ సమయం వెచ్చించి అసంపూర్ణమైన లేదా తొందరపాటు సమాధానాలు రాయవచ్చు. వనరుల లభ్యతలో అసమానతల వలన విద్యార్థులు వెనుకబడే అవకాశం ఉంది. పరీక్ష సమయంలో అందరికీ ఒకే రకమైన మెటీరియల్‌ను విద్యా సంస్థలే అందిస్తే మేలు జరుగుతుంది. ఈ లోపాలను సరిదిద్ది ముందుకు వెళ్తే ఓపెన్ బుక్ పరీక్ష విధానం విజయవంతం అవుతుంది.

- సంపతి రమేష్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

79895 79428

Next Story