పసి ప్రాణాలను కాపాడలేరా?

by Disha edit |
పసి ప్రాణాలను కాపాడలేరా?
X

అనేక సంవత్సరాలుగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, ఆగడాలు, వసతులు. వాటికి అనుబంధంగా ఉండే హాస్టల్ సౌకర్యాల మీద విచారణ జరపాలని సమాజం డిమాండ్ చేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదు. యాజమాన్యలు ఇచ్చే లంచాలకు తలొగ్గిన అధికారులు, నాయకులు నామమాత్రపు తనిఖీలు చేసి అనుమతులు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చీకటి గదిలో ఇరికి బలవుతున్నారు. ఈ పరిస్థితులలోనే 2017 లో 47 మంది విద్యార్థులు చనిపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆయా పాఠశాలల గుర్తింపులను రద్దు చేయాలి.

కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యతో వ్యాపారం చేస్తున్నాయని, రాష్ట్రం సాధించాక వాటన్నింటినీ తరిమి కొడతామని తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకులు గొప్పగా చెప్పారు. కానీ, ఆ మాటలు ఇప్పుడు నీటి మీది రాతలయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావుల ఆశలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యారంగంలో దోపిడి ఏ మాత్రమూ ఆగలేదు. తల్లిదండ్రులు తమ నెత్తురును చెమటగా చేసి, వచ్చిన సంపాదనతో తమ పిల్లలను కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు పంపిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు తల్లిదండ్రులను జలగలలాగా పీల్చుకు తింటున్నాయి. ప్రచార ఆర్భాటాలు, ఆకర్షణీయమైన బ్రోచర్లు, ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రత్యేక రాయితీలంటూ మాయమాటలు చెబుతూ పిల్లలను చేర్పించుకుంటారు. ఆ తరువాత చుక్కలు చూపిస్తారు.

బాధ్యత లేకుండా

ఆహ్లాదకర వాతావరణంలో ఆడుతూ, పాడుతూ చదువుకోవలసిన పిల్లలను గాలి, వెలుతురు లేని ఇరుకు గదులలో బందీలను చేస్తున్నారు. ఆట స్థలాలు, ప్రయోగశాలలు లేనే లేవు. రోజుకు 10 నుంచి 14 గంటలపాటు చదువులంటూ మానసిక ఒత్తిడిని పెంచుతున్నారు. 'నేటి బాలలే రేపటి పౌరులని' సందర్భం వచ్చినప్పుడల్లా మన నాయకులు ఊదరగొడుతూ ఉంటారు. తెలంగాణ వచ్చాక కూడా ఎంతో మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సమయంలో అధికారులు స్పందించిన పాపాన పోవడం లేదు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పాలకులు ఇసుమంతైనా బాధ్యతగా లేకపోవడం బాధాకరం. వారు రాజకీయ లబ్ధి కోసమే వ్యవహరించడం సర్వసాధారణమైంది.

మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో ఉన్న ఓ పాఠశాలలో అఖిల అనే తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందింది. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. న్యాయం చేయాలని రెండు రోజులపాటు అడిగితే కనీసం కూడా స్పందించలేదు. అంటే, రాజకీయ పలుకుబడి, అధికారుల సహకారం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సందర్శించకపోవడం విచారకరం. విద్యాధికారులు యాజమాన్యంపై కేసు పెట్టలేదు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కమిటీ నివేదిక ఏది?

అనేక సంవత్సరాలుగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, ఆగడాలు, వసతులు. వాటికి అనుబంధంగా ఉండే హాస్టల్ సౌకర్యాల మీద విచారణ జరపాలని సమాజం డిమాండ్ చేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదు. యాజమాన్యలు ఇచ్చే లంచాలకు తలొగ్గిన అధికారులు, నాయకులు నామమాత్రపు తనిఖీలు చేసి అనుమతులు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చీకటి గదిలో ఇరికి బలవుతున్నారు. ఈ పరిస్థితులలోనే 2017 లో 47 మంది విద్యార్థులు చనిపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

నిజంగా ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆయా పాఠశాలల గుర్తింపులను రద్దు చేయాలి. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపడానికి కమిటీ వేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఐదు సంవత్సరాలుగా ఆ కమిటీ ఏం చేస్తోందో, ఏం నివేదిక ఇస్తోందో? ఎప్పుడు ఇస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ప్రాణాలు రక్షించుకునే విధంగా కృషి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలి.

మాదం తిరుపతి

USFI రాష్ట్ర కార్యదర్శి

కేయూ, వరంగల్

94919 62243


Next Story

Most Viewed