సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించగలదా.. రాజ్యాంగ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

by Ravi |   (  Updated:2025-05-27 01:30:21  IST  )

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్లకు రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకో వడానికి నిర్దిష్ట

సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించగలదా.. రాజ్యాంగ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
X

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్లకు రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకో వడానికి నిర్దిష్ట గడువు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు లేనప్పుడు కోర్టు ఈ ఆదేశాలు ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలు ఈ వ్యవహారంలోని రాజ్యాంగపరమైన చిక్కులను మరింతగా వెలుగులోకి తెచ్చాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు, ఆయన దానిని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. అయితే, గత కొంతకాలంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిన తర్వాత, ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో గణ నీయమైన జాప్యం చోటు చేసుకుంటోంది. దీనివల్ల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, కొత్త చట్టాల అమలు ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

సుప్రీం స్పష్టతతో.. రాష్ట్రాలకు ఊరట!

ఈ వ్యవహారాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు, సంబంధిత రాష్ట్రాల వాదనలను విన్న అనంతరం, ఈ సమస్యపై స్పష్టమైన మార్గదర్శకాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఈ తీర్పులో ప్రధానంగా రాజ్యాంగంలోని రెండు ముఖ్యమైన అధికరణలు చర్చకు వచ్చాయి. మొదటిది ఆర్టికల్ 200, ఇది రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు విషయంలో గవర్నర్‌కు ఉన్న అధికారాలను వివరిస్తుంది. గవర్నర్ బిల్లును ఆమోదించే అధికారం, తిరస్కరించే అధికారం లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం కలిగి ఉంటారు. రెండవది ఆర్టికల్ 201, ఇది రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును గవర్నర్ పంపినప్పుడు, రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చునని తెలుపుతుంది. ఈ రెండు అధికరణలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, సుప్రీంకోర్టు తన తీర్పులో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. అంతే కాకుండా, ఒకవేళ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చోటు చేసుకుంటే, అందుకు తగిన కారణాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఊరటనిచ్చింది. పైగా ఇది రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను పరిరక్షించడంలో సహాయపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు ప్రకారం, రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, లేదా కొన్ని నిర్దిష్ట సవరణలతో తిరిగి పంపాలి. నిర్ణయం తీసుకోవడంలో అనవసరమైన జాప్యం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగబద్ధ పదవులను గౌరవించాలి!

అయితే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఈ తీర్పును సమర్థిస్తూ, ఇది రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పరిరక్షిస్తుందని, గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాల అధికారాలను మరింత క్రమబద్ధీకరిస్తుందని వాదిస్తున్నారు. మరోవైపు, మరికొందరు ఈ తీర్పును విమర్శిస్తూ, ఇది రాష్ట్రపతి అధికారాలలో అధికంగా జోక్యం చేసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా బహిరంగంగానే ఈ తీర్పును విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో, రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని వారు వాదిస్తున్నారు. రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని రాజ్యాంగ పరిధిలో వినియోగించాలని, న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని వారు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ పాత్రపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది.

అత్యున్నత వ్యవస్థ ఇదే!

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, “న్యాయ వ్యవస్థ చట్టాలను పరిరక్షించేది” అని పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. న్యాయ వ్యవస్థ లేకపోతే, చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. పౌరుల హక్కులు ఉల్లంఘించబడవచ్చు. న్యాయవ్యవస్థ ఈ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా, న్యాయ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పరిరక్షిస్తుంది. ఒకప్పుడు పార్లమెంటే అత్యున్నతమైనదని వాదించబడింది, అంటే పార్లమెంటు చేసిన చట్టాలే దేశంలో అత్యున్నతమైనవని కొందరు భావించారు. అయితే, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగమే అత్యున్నతమైనదని, న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుతుందని కూడా పేర్కొంది, అంటే రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలను మార్చే చట్టాలను న్యాయ వ్యవస్థ కొట్టివేస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ ముఖ్యమైన బాధ్యత.

రాష్ట్రపతికి గడువు లేదు..

మరోవైపు న్యాయవ్యవస్థ తన పరిధిని దాటి కార్యనిర్వాహక శాఖ అధికారాల్లో జోక్యం చేసుకుంటోందని విమర్శకులు పేర్కొంటున్నారు. రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బిల్లులను ఆమోదించకుండా నిలిపివేసే అధికారాన్ని ఇస్తుంది. అయితే, ఈ తీర్పు ఆ అధికారాన్ని తగ్గిస్తుందనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రపతికి గడువు విధించడం ద్వారా, రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాన్ని పరిమితం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉండవచ్చు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన గడువు లేనందున, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజ సమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ తీర్పు అమలును బట్టి..

సుప్రీంకోర్టు ఈ మూడు నెలల గడువును ఏ ప్రాతిపదికన నిర్ణయించిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది రాష్ట్రాల వాదనలు, పాలనా సౌలభ్యం, లేదా ఇతర న్యాయ సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది. రాజ్యాంగంలో అధికారాల విభజన స్పష్టంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఈ పరిధుల మధ్య స్పష్టత లోపిస్తుంది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షకురాలిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పటికీ, కార్యనిర్వాహక అధికారాల్లోకి అతిగా జోక్యం చేసుకుంటోందనే విమర్శలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అంశంపై మరింత లోతైన చర్చలు జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు అమలు దాని పర్యవసానాలను బట్టి రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అనే దానిపై ఒక నిర్ణయా నికి రావచ్చు. అయితే, ప్రస్తుతానికి ఇది న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ పరిధులపై ఒక ముఖ్యమైన చర్చను లేవనెత్తింది.

డా.కట్కూరి,

న్యాయ నిపుణులు

94909 34520

Next Story