- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హత లేకున్నా ఈ ఉద్యోగం చేయొచ్చా?
ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగ మైనా ఏ ఉద్యోగం చెయ్యాలన్నా దానికి సంబంధించిన విద్యార్హత

ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగ మైనా ఏ ఉద్యోగం చెయ్యాలన్నా దానికి సంబంధించిన విద్యార్హత లేదా ట్రైనింగ్ తప్పనిసరి. ఉదాహరణకు ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, డాక్టర్, అకౌంటెంట్ వంటి ఉద్యో గా లకు వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే తప్ప, ఎవరిని పడితే వాళ్లను తీసుకోరు. కానీ ప్రైవే టు రంగంలో ఉపాధ్యాయ వృత్తి చేయడానికి ఎవరైనా అర్హులే.. గవర్నమెంట్ బడుల్లో కాకుండా ప్రైవేట్ బడుల్లో ఎవరైనా టీచింగ్ చెయవచ్చు. టీచింగ్‌కి సంబంధిం చిన విద్యా ర్హతలు పెద్దగా అవసరం లేదు. ఇది సమంజసమేనా?
ప్రతి ప్రొఫెషన్‌కి ఒక క్వాలిఫికేషన్ తప్పని సరైనప్పుడు, అత్యంత ముఖ్యమైన టీచింగ్ ప్రొఫెషన్‌కు అర్హతలు అవసరమే లేదను కోవడం ఎంత వరకు సమంజసం? ఈ విషయాన్ని సమాజం అలుసుగా తీసుకుని నిర్లక్ష్యం చేయడం చింతించాల్సిన విషయం.
ఖాళీగా ఉంటే ఈ ప్రొఫెషన్‌కు..
అన్ని రోజులూ ఖాళీగా ఉన్న ఒక గ్రాడ్యుయేట్ తల్లి తన పిల్లలకు స్కూల్‌కి పోయే వయసు వచ్చేసరికి స్కూల్‌లో టీచర్ అవు తుంది. జాబ్ చేయకుండా హౌస్ వైఫ్‌గా ఉందామనుకున్న ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యు యేట్ భర్త ఆన్‌సైట్‌కి పోతే బోర్ కొడుతోందని టీచర్‌గా జాయిన్ అవుతుంది. కొంతమంది తమ పిల్లల స్కూల్‌లోనే టీచర్ అయితే ఫీజులో రాయితీ వస్తుందని, తమ పిల్లల చదువును గమనించడం సులభమని టీచర్స్ అవుతారు. నాకు తెలిసిన ఒక స్కూల్‌లో తెలుగు రాని వాళ్లను టీచర్స్‌గా తీసుకుంటున్నారు. తెలుగు రాని వాళ్లు ఖచ్చితంగా పిల్లలతో మంచి ఇంగ్లీష్‌లోనే మాట్లాడి మంచి టీచింగ్ చెబుతారని ఒక మూఢ నమ్మకం. వీళ్లంతా టీచింగ్ చెయ్యకూడదనో, టీచింగ్‌కి అస్సలు పనికి రారనో చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ వీళ్లు వేరే జాబ్‌కి ఎందుకు అప్లై చెయ్యరంటే దానికి కావలసిన అర్హత ఉండదు.
అర్హతలే లేకపోతే ఎలా?
ప్రైవేట్ బడుల్లో (ఎంత పెద్ద school అయినా) ఎవరైనా టీచింగ్ చెయ్యొచ్చు. టీచింగ్‌కి సంబంధించిన విద్యార్హతలు అవసరం లేదు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో కేవలం బోధనా పద్దతులే కాకుండా, చైల్డ్ సైకాలజీ, పిల్లలను డీల్ చెయ్యడం, చైల్డ్ డెవలప్మెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సిలింగ్ వంటివి కూడా నేర్పిస్తారు. కారణం టీచింగ్ చెయ్యడానికంటే ముందు పిల్లలను అర్థం చేసుకోవడం ముఖ్యం, అది కూడా పిల్లల వయసును బట్టి మారుతుంది. పిల్లల యాక్టివ్ టైం ఇంట్లో కంటే బడిలోనే ఎక్కువగా ఉంటుంది. వాళ్ల వ్యక్తిత్వ వికాసం జరిగేది కూడా అక్కడే. అయితే ఈ కోర్సులు చేసిన ఉపాధ్యాయులంతా పిల్లలని అంత బాగా డీల్ చేస్తున్నారా? అన్న విషయం పక్కన పెడితే, ఉపాధ్యాయ వృత్తికి అసలు అర్హతలే అవసరం లేదనుకోవడం ఎంతవరకు సమంజసం? ఏదైనా స్కూల్‌కి పోయి మీ దగ్గర టీచర్స్ బీఈడీ చేశారా? అంటే, లేదు కానీ మా స్కూల్‌లోనే మంచి ట్రెయినింగ్ ఇస్తామని టక్కున చెప్తారు. ఖచ్చితంగా అది పైన చెప్పిన కోర్సులకు ప్రత్యామ్న్యాయం కాదు. గవర్నమెంట్ కూడా చూసీ చూడనట్టు ఉంటుంది. ప్రతి ప్రొఫెషన్‌కి ఒక క్వాలిఫికేషన్ తప్పనిసరైనప్పుడు, అత్యంత ముఖ్యమైన టీచింగ్ ప్రొఫె షన్‌ను అలుసుగా తీసుకోవడం, నిర్లక్ష్యం చేయడం చింతించాల్సిన విషయం.
ఇతర దేశాల్లో..
ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా విద్యార్థులు పిల్లలే.. కాకపోతే వాళ్లతో డీల్ చేయాల్సిన విధానం వేరేగా వుంటుంది. వయసు పెరిగే కొద్ది అది ఇంకా సున్నితంగా ఉండి కష్ట తరమవుతుంది. ప్రైవేట్‌వి అయినా, గవర్నమెంట్‌వి అయినా స్కూల్స్, కాలేజెస్‌లో టీచింగ్ ఉద్యోగాలకు కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాక ప్రత్యేకమైన టీచింగ్ కోర్స్‌లు, చైల్డ్ సైకాలజీకి సంబంధించిన కోర్స్‌లు తప్పనిసరి చెయ్యాలి. ప్రభుత్వం తరచుగా తనిఖీలు జరుపుతూ ఇట్లాంటి నిబంధనలు పాటించేట్టు చెయ్యాలి. పాటించకుంటే చర్యలు తీసుకోవాలి. వేరే దేశాలు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాయి. యూకేలో టీచింగ్ చేయాలంటే అక్కడ ఉన్న టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేయడమే కాక, అక్కడ ఐదేళ్లు ఉండి తను ఎలాంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడలేదని నిరూపించుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు మాత్రమే కాదు రేపటి వనరులు కూడా.. పౌరుల కోసం కాకపోయినా, కనీసం వనరులను కాపాడుకోవడానికైనా ప్రభుత్వం టీచింగ్ రంగంలో మార్పులు తేవాలి. ఆలోచించండి.
Note: టీచింగ్ జాబ్ చేసే వాళ్లను కించపరచడం, నొప్పించడం నా ఉద్దేశ్యం కానే కాదు.
- మాలతి పల్లా
సీనియర్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్
90103 96655






