జననాల రేటు..తగ్గితే డేంజర్

by Ravi |   (  Updated:2025-07-12 00:45:40  IST  )

మన దేశం జనాభాపరంగా ఈ ఏడాది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఐక్యరాజ్య‌సమితి తెలిపింది.

జననాల రేటు..తగ్గితే డేంజర్
X

మన దేశం జనాభాపరంగా ఈ ఏడాది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఐక్యరాజ్య‌సమితి తెలిపింది. ఈ ఏడాది చివరి కల్లా జనాభా 146 కోట్ల చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే జననాల రేటు నిర్దేశిత స్థాయి కంటే దిగువకు పడిపోయిందని వెల్లడించింది. గత నలభై ఏళ్ల తర్వాత ఇది తగ్గుముఖం పట్టినట్టు నివేదిక తెలుపుతుంది. ఏ దేశంలోనైనా సగటు రీప్లేస్మెంట్ రేటు కనీసం 2.1 శాతంగా ఉండాలి. కానీ భారత్‌లో సంతాన ఉత్పత్తి రేటు 1.9 శాతంకి పడిపోయింది. జననాల రేటు తగ్గి పోయినప్పటికీ, భారతదేశ జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతుంది.

ఉపాధి అవకాశాలు ఆవశ్యం

మన దేశ జనాభాలో వయసుల వారిగా 68 శాతం జనాభా 15 నుంచి 64 ఏళ్ల లోపు వయో వర్గానికి చెందిన వారు. ఇది వర్కింగ్ ఏజ్ గ్రూప్, అత్యధిక జనాభా వర్కింగ్ ఏజ్ గ్రూపులో ఉండటం అనేది భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఈ ఏజ్‌లోని వారికి తగినన్ని ఉపాధి అవకాశాలు ప్రభుత్వ విధానపరమైన మద్దతు లభిస్తే భారత్ ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తుంది. అలాగే 10 నుంచి 24 ఏళ్ల లోపు వారు 26 శాతం. 0 నుంచి 14 ఏళ్ల లోపు వారు 24 శాతం. 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు 17 శాతం మంది ఉన్నారు. అదే విధంగా 65 ఏళ్లకు పైబడిన వారు భారత దేశంలో కేవలం 7 శాతం మంది ఉన్నారు. ప్రజల ఆయుర్దాయాలు పెరుగుతున్నందున రాబోయే కొన్ని రోజుల్లో 65 ఏళ్ల పైబడిన వయో వర్గంలోని వృద్ధుల సంఖ్య మరింత పెరగవచ్చు. 1971 దశకం నాటికి మన దేశ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు ఐదుగురు పిల్లల్ని కనడం. కానీ ఇప్పుడు మహిళలు సగటున ఇద్దరు పిల్లలకే జన్మనిస్తున్నారు.

తెలంగాణలో అసమానత్వం జాస్తి

అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో బాలురతో పోలిస్తే బాలికల జననాలు గణనీయంగా తగ్గుతున్నాయి. 2022 లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. తెలంగాణ తరువాత బిహార్ (891), మహారాష్ట్ర (906)లు మాత్రమే ఉన్నారు. ఏపీలో ఇది (938)గా నమోదయింది. 2022లో తెలంగాణలో వెయ్యి మంది బాలురకు 907 మంది బాలికలతో తక్కువ నిష్పత్తి నమోద యింది. దేశంలో బాలురు 52.4 శాతం ఉంటే, బాలికలు 47.6శాతంగా ఉంది.

లింగ సమానత్వం ఇప్పటికీ లేదు!

ఇలా బాలికల జననాల రేటు తగ్గిపోవడం ప్రమాదకర సంకేతమే.. ముఖ్యంగా సమాజంలో గుణాత్మక మార్పులకు సాహకారం చేసి రాజకీయ రంగంలో స్త్రీల వాటా వారి జనాభాకు తగినట్టుగా ఉందా! ఆర్థిక కార్యక లాపాల్లో స్త్రీ, పురుషుల భాగస్వామ్యం, అందుకు లభిస్తున్న అవకాశాలు, విద్య, ఆరోగ్యం, జీవనస్థితి గతులు, రాజకీయ సాధికారత ప్రాతిపదికలుగా 148 దేశాల కేటాయించిన ర్యాంకుల్లో ఇండియా 131 స్థానంలో చతికిలబడింది. బాలికల జననాల రేటు తగ్గిపోతూ స్త్రీ పురుష నిష్పత్తిలో ఆగాధం పెరిగిపోతే సృష్టికి ప్రమాదం. సమానత్వం సుదూర స్వప్నం కారాదు?

మేకిరి దామోదర్,

957366 6650

Next Story