- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లె కథలకు ప్రాణం పోసిన దర్శక శిఖరం
పల్లెటూరి అందాలు, మట్టివాసన, సహజమైన భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించిన దర్శక శిఖరం భారతీరాజా 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సినీ ప్రయాణం, సాధించిన విజయాలు, దక్షిణాది సినీ రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక కథనం.

దక్షిణాది సినీ చరిత్రలో పల్లె అందాలను, మట్టి వాసనను, సామాన్య మనుషుల భావోద్వేగాలను వెండితెరపై సజీవంగా ఆవిష్కరించిన దర్శకుల్లో భారతీరాజా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్టూడియోలకు పరిమితమైన సినిమాను పల్లెల బాట పట్టించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నో మరపురాని చిత్రాలు, కొత్త నటీనటులను తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ దిగ్గజ సినీ సృష్టికర్త వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో 84వ ఏట కన్నుమూయడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.
దక్షిణాది సినిమా చరిత్ర చూస్తే, కొందరి పేర్లు కేవలం దర్శకులుగా కనిపించవు. ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్తలుగా కనిపిస్తారు. ఆ జాబితాలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు డైరెక్టర్ భారతీరాజా. ఆయనే సినిమాను స్టూడియో గోడల నుంచి పల్లెటూరి మట్టి వాసన వీచే పొలాల వైపు నడిపించిన విప్లవకారుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు- ఆనందాలు, బాధలు - భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్క రించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు.. భావోద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు.
సహాయ దర్శకుడిగా మొదలై..
1941 జులై 17న తేని జిల్లా అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ, సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పి.పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘16 ఏళ్ల వయసు’తో సినీ సంప్రదాయాన్ని తిరగరాసి 1977లో వచ్చిన ‘16 వయ తినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది) సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమి తమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్ర దాయాలను తిరగరాశారు.
తెలుగులోనూ తనదైన ముద్ర..
కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా, ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులాబీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టివాసనను వెండితెరపైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. హీరోయిన్లను మేకప్ లేకుండా స్వచ్ఛంగా చూపించేవారు. దీని వెనుక కారణాన్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. ‘‘నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా’’ అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపర్చారు.
పురస్కారాల పంట..
భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. ఆయన తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’(తిరు), గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా.
-ఇస్కా రాజేష్ బాబు,
96520 39780






