బీజేపీ కోర్టులోకి.. బీసీ రిజర్వేషన్ల బంతి

by Ravi |   (  Updated:2025-07-24 00:45:49  IST  )

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది.

బీజేపీ కోర్టులోకి.. బీసీ రిజర్వేషన్ల బంతి
X

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఈ బిల్లుకు చట్టబద్దత సాధించేందుకు ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపిన రేవంత్‌ సర్కార్ అది ఆలస్యం అవుతుండడంతో పార్లమెంటులో తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీజేపీ సర్కారును ఇరుకున పెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మరల్చేలా కాంగ్రెస్‌ కార్యచరణ చేసినట్లు స్ప‌ష్టమౌతుంది. తద్వారా బీసీలపై కాంగ్రెస్‌ పార్టీకున్న కమిట్‌మెంట్‌ నిరూపించుకోవాలని చూస్తోంది.

గవర్నర్‌ నిర్ణయం ఆలస్యం కావడంతో..

2024 ఫిబ్రవరి మొదటి వారంలో బీసీ కుల గణన పై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం. శాసన సభలో తీర్మానం చేసి, అతి తక్కువ కాలంలోనే బీసీ కుల గణన చేసి అసెంబ్లీ, మండలిలో 42 శాతం రిజర్వేషన్ల తీర్మానం చేసి చట్ట‌బద్దతకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అది ఆలస్యం అవుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌కు తీర్మాణం చేసి ఈ నెల15న గవర్నర్‌కు నివేదించింది. అయితే గవర్నర్ సైతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సూచనలు, రాజ్యాంగ, న్యాయ పరిశీలనల చేసి నిర్ణయం తీసుకునే విషయంలో ఆలస్యం అవుతున్నట్లు స్పష్టమౌతుంది. కాగా.. సెప్టెంబర్‌ 30లోగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ బీసీ రిజర్వేషన్ల అమలుకై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

బహుముఖ వ్యూహంతో..

తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచే అవకాశాలున్నా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన మంత్రి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చకపోయినా, రాష్ట్ర గవర్నర్‌ అమోదించపోయినా.. న్యాయ పరంగా చిక్కులు ఎదురైనా.. అది బీజేపీపై నెట్టి ప్రజా క్షేత్రంలో ఎండగట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చూస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ పరిధిలో అన్ని ప్రయత్నాలూ పూర్తి చేసినట్లు ప్రజలకు సంకేతాలిచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి చెప్పలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వమే కుల సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయితే ఇందుకు చాలా కాలం పట్టనుంది. ఇక రాష్ట్ర బీజేపీ నాయకులేమో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌ తీసివేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే ఈ బిల్లును స్వాగతిస్తామని. ముస్లింలకు ఇచ్చింది రాజకీయ రిజర్వేషన్లు కాబట్టే ఈ బిల్లును వ్యతి రేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని ఇర కాటంలోకి నెట్టేసింది. ఈ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఇక్కడి బీజేపీ రాజకీయ భవిష్యత్‌ ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు మస్తు మైలేజీ !

స్థానిక సంస్థల్లోనే కాకుండా, విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్‌ చెప్పింది. బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో జనరల్‌ కోటాలో పోటీ పడలేక నష్టపోతున్నామనే అభిప్రాయం బీసీల్లో ఉంది. 42 శాతం రిజర్వేషన్ల పెంపు వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశల్లో యువత ఉంది. వచ్చే నోటిఫికేషన్లలో బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోనుంది. ఇక రాష్ట్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్వాగతిస్తుండగా, కేటీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు తాము తీసుకొచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా, మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఒక పార్టీలోనే ఒకరి వర్గం స్వాగతించడం, మరొకరి వర్గం విమర్శించడంతో గులాబీ కేడర్‌ గందరగోళంలో పడింది.

చిలగాని జనార్ధన్‌

8121938106

Next Story