- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది సినిమా కాదు.. ఒక అనుభవం
'బాలన్: ది బాయ్' సినిమా ఎలా ఉంది? తల్లి–కొడుకుల భావోద్వేగ ప్రపంచాన్ని ఉత్కంఠభరిత కథనంతో ఆవిష్కరించిన ఈ మలయాళ చిత్రం ప్రేక్షకులను ఎందుకు కట్టిపడేస్తుందో పూర్తి రివ్యూలో తెలుసుకోండి.

‘కన్నుంటే చూసి, పెన్నుంటే రాసీ.’ అన్నాడు మహాకవి. రెండు కళ్లతో చూసి వచ్చినా, ఏదీ రాయలన్పించడం లేదు. ‘బాలన్: ది బాయ్ సినిమా’ ట్రాన్స్ ఇంకా ఒకటి రెండు రోజుల వరకు పోయేలా లేదు. దీన్ని కొందరు సస్పెన్స్ అంటున్నారు.. కొంతమంది సైకలా జికల్ థ్రిల్లర్ అంటున్నారు. నిజానికి అసలు దీని జానర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్ సినిమా. ఒక అద్భుతమైన అనుభవం. ఈ సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే ఆ తల్లీ, కొడుకుల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళుతుంది. వారి సమస్యలు మన సమస్యలవుతాయి. వారి బాధ మన బాధవుతుంది. చివరి ఫ్రేమ్ వరకు సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. దర్శకుడు ‘చిదంబరం’ మలయాళం ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోవలసిన పేరు. సుషీన్ శ్యాం మ్యూజిక్, షైజూ ఖాలిద్ కెమెరా పని తనం, వివేక్ హర్షన్ ఎడిటింగ్, అన్నింటికీ మించి జీతూ మాధవన్ రైటింగ్. అంత చిన్నబ్బాయి అధి శేషణ్, సౌత్ ఇండియన్ స్వరా భాస్కర్‌లా కన్పిస్తున్న ఫర్జానా పలాతింగల్, అతిథి పాత్రలో వచ్చిన తోవినో థామస్.. ఇలా ప్రతి ఒక్కరి నటన, ప్రతీదీ ఒకే ఉద్దేశం లోకి సింక్ అయితే తయారైన సినిమా. మనం ఉహించలేని ట్విస్టుతో ముగిసి, సంతృప్తినిచ్చే చక్కని, చిక్కని సినిమా. దేనికైనా అనుభవించే అదృష్ట ముండాలి. కాన్స్ ప్రేక్షకులు ఊరకనే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చుండరు. మా ఇంటికి దగ్గరలో జయంతీ సినిమా టాకీస్‌లో ఒకప్పుడు నూన్ షోలుగా మలయాళం అడల్ట్ సినిమాలు ఆడేవి. ఇప్పుడు ఆ హాలు మల్టీప్లెక్స్‌గా మారింది. సరిగ్గా అదే నూన్ షో టైం స్లాట్‌లో ‘బాలన్: ది బాయ్’ హిందీ వెర్షన్ చూశాం. మలయాళం సినిమా దేశానికి తన సత్తాను చాటుతోంది. కానీ, ఏం లాభం? మాతో పాటు హాల్లో మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. మంచి సినిమాను చూసే యోగం కూడా అందరికీ ఉండదు. ‘చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా’? మన మొహానికి ‘ధురందర్’, ‘పెద్ది’ చాలనుకుంటే మనల్ని బాగుచేసేవారుండరు. నా మాట మీద నమ్మకముంటే మీ ఊరిలో ఏ హాళ్లో ఉన్నా చూసేయండి. ఓటీటీ కోసం ఎదురుచూసే తీరిక మీకుంటే అది మీ ఇష్టం.
- బాలాజి
90077 55403






