- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ ఆత్మీయతా స్పర్శ.. బాలన్
మలయాళ చిత్రం 'బాలన్' ఎలా ఉంది? తల్లీ కొడుకుల అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపించిన ఈ భావోద్వేగ చిత్రంలో కథ, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం, సాంకేతిక అంశాలు..

మలయాళం సినిమాలు గొప్ప అనుభూతులు, అనుబం ధాలను సస్పెన్స్ థ్రిల్లింగ్ గా మలచటంలో ప్రసిద్ధి పొందాయి. ‘దృశ్యం’ సిరీస్, ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి విజయవంత మయిన సినిమాలు ఇందుకొక ఉదాహరణ. ప్రపంచ సినిమాకు మదర్ సెంటిమెంట్ ఓ విజయవంతమైన వ్యాపార సూత్రం. తల్లీ కొడుకుల కథను ఈ నేపథ్యంలో చూపిన కథ ‘బాలన్’. దర్శకుడు చిదంబరం. ‘మంజుమ్మల్ బాయ్స్’ తరువాత తీసిన చిత్రం
కథేమిటి..?
గర్భవతిగా హత్యానేరం పైన జైలుకెళ్లిన ఇందు (ఫర్జానా), కొడుకు వాసుదేవన్ (ఆదిశేషన్)తో విడుదల అవుతుంది. తన గతం కొడుకుపై పడకుండా, ఎవరికి తెలియని అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలికి ‘కేర్ టేకర్’గా ఉంటుంది. కానీ.. అనుకోని పరిస్థితుల్లో ‘ఇందు’ మరో హత్య చేయవలసి వస్తుంది. ఈ కారణంగా వాసుదేవన్ ఆమెకు దూరమవుతాడు. ఈ కొడుకు ఆ తల్లి దగ్గరకి ఎన్నటికీ చేరకూడదని కుట్ర చేస్తుంటాడు క్రిమినల్ అబ్బాస్ (టోవినో థామస్). వాసుదేవన్ కారణంగా పోలీస్ ఆఫీసర్ పవిత్రన్ తన ప్రియురాలికి దూర మవుతాడు. కొడుకు, తల్లిని కలిశాడా? పవిత్రన్, అబ్బాస్ వంటివారి ప్రయత్నాల పర్యవసానం ఏమిటి? చివరకు ఏమయిందనేది చిత్రం చూసి తెలుసుకోవాలి.
నటీనటులు..
నటన తల్లీ కొడుకులుగా ఫర్జానా పలథింగల్, ఆదిశేషన్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఆదిశేషన్ కళ్ళతో పలికించిన భావాలు అద్భుతం. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల నడుమ సాగుతుంది. వారి మధ్య అనుబంధం, వాటిని నిలుపుకునే క్రమంలో తల్లిగా ఫర్జానా ఫలథింగల్, ఆదిశేషన్‌ల నటన ‘బాలన్’ను ఓ మంచి చిత్రంగా నిలిపాయనవచ్చు. అబ్బాస్‌గా టోవిన్ థామస్ పాత్ర గెస్ట్ వంటిది. అతని ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగుంటాయి. పాత్రకు ప్రాధాన్యం తక్కువ. మహమ్మద్ జినాన్, జాన్ పాల్ లాల్ తదితరులు పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం..
ఈ కథకు వ్యాపార సూత్రాల థ్రిల్లర్‌లా మలిచే అవకాశమున్నా, దర్శకుడు నిజాయితీగా తాను అనుకున్న పంథానే స్క్రీన్‌పై చూపించాడు. తల్లీ కొడుకుల బాండింగ్‌ను అద్భుతంగా ఆవిష్కరించాడు చిదంబరం. జీతూ మాధవన్ రాసుకున్న కథ అటువంటిది. ఈ చిత్రానికి సైజ్ ఖలీద్ ఫోటోగ్రఫీ, సుషీన్ శ్యామ్ బిజిఎమ్‌లు ప్రాణం పోశాయి. ఎడిటర్ వివేక్ హర్నర్‌కు దర్శకుడు మరింత స్వేచ్ఛను ఇవ్వ వలసిందనిపిస్తుంది. నిర్మాతలు వెంకట కె నారాయణ, శైలజ దేశాయ్ కృషి అభినందనీయం.
గొప్ప కవితాత్మక భావోద్వేగ చిత్రం..
మలయాళీ సినిమాల్లో థ్రిల్లర్స్ కు మంచి పేరుంది. చక్కని మలుపులు, పాటలు లేకుండా, ఎంతో హుందాగా కొనసాగుతాయి. నిర్మాతలు ప్రచారం చేసినట్టుగా ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా మాత్రం చూడకూడదు. నిరాశపరుస్తుంది. ఆర్ట్ మూవీలా గొప్ప కవితాత్మక భావోద్వేగా చిత్రంగా దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఇందుకు కారణం. ‘ప్రపంచంలో తల్లికి మించిన యోధురాలు’ లేదనేది ఈ సినిమాకు వర్తిస్తుంది. ఓ తల్లి తన కొడుకు అందమైన భవిష్యత్ కోసం చేసిన పోరాటాలు, త్యాగాలను మనసుకు హత్తుకునేలా దృశ్యమానం చేశారు దర్శకుడు. తల్లి కోసం తపనపడే కొడుకు ఆరాటం చూపరులను ద్రవింపజేస్తుంది. ఈ అంశాలకు అంతర్లీనంగా ఓ రివేంజ్ డ్రామా కూడా ఉంది. ‘బాలన్’లో ముగింపు ట్విస్ట్ అద్భుతం. నిడివి మాత్రం పెద్దది. కాస్త సహనము అవసరం.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395






