- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యుదయ సాహితీ కిరణం ఆరుద్ర
తరానికో వంద కవులు/ తయారౌతారెపుడూ/ వందలోనూ మందలోనూ/ మిగల గలిగేదొక్కడు’..అని ఆరుద్రే అన్నట్టు అభ్యుదయ

‘తరానికో వంద కవులు/ తయారౌతారెపుడూ/ వందలోనూ మందలోనూ/ మిగల గలిగేదొక్కడు’..అని ఆరుద్రే అన్నట్టు అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో నిలదొక్కుకుని ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాల్చిందీ తానొక్కడే అనడంలో ఎంతో నిజం దాగి ఉంది. శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర పండితుడు, పరిశోధకుడు, నాటకకర్త, గేయ రచయితగా, అనువాదకుడుగా, సాహితీవేత్తగా, విమర్శకుడుగా ఎనలేని కీర్తి, ప్రతిష్టలను అధిరోహించిన మేటికవి.
ఆరుద్ర బాల్యం..వివాహం
‘కవిత కోసమే నేను పుట్టాను క్రాంతి కోసమే కలం పట్టాను’ అని ఆధునిక కవుల్లో బలంగా గొంతెత్తిన ఆరుద్ర అసలు పేరు ‘భాగవతుల సదాశివశంకరశాస్త్రి’.1925 ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించారు. 1954లో సుప్రసిద్ధ రచయిత్రి ‘రామలక్ష్మిని’ వివాహం చేసుకున్నారు. తన అర్ధాంగి అనటం కంటే పూర్ణాంగిగా అన్నింటిలో సహాయ సహకారాలను అందించి, ఆరుద్ర జీవితాన్ని సంపూర్ణ మయం చేసిన ఘనత ఆమెకు దక్కుతుంది. బ్రతుకు సాగడం కోసం విమాన దళంలో బ్యాండ్ బాయ్ గానూ, ఆనందవాణి పత్రికలోనూ, ఫోటోగ్రాఫర్ గాను ఎన్నెన్నో అవతారాలను ఎత్తి మద్రాసుకు వచ్చి స్థిరపడి సినీ, సాహిత్యాలకు చేరువయ్యాడు. సైన్యంలో కూడా కొంత కాలం పనిచేశారు.
రజాకార్ల దాష్టికానికి ప్రతీక 'త్వమేవాహం'
ఆరుద్ర రచనల్లో ఎంతో విలక్షణమైంది ‘త్వమేవాహం’ తెలంగాణ పోరాట నేపథ్యంలో విడుదలైన కావ్యం. రజాకార్లు అమానుషంగా అత్యాచారం చేసిన ఓ యువతి కథనాన్ని కృష్ణా పత్రిక ప్రచురించింది. రైలు గుడివాడ దాటి వెళ్తోంది. ఇంతలో ఓ బోగీలో ఉన్న ఓ యువతి లేచి నిలబడింది. శరీరం మీద ఉన్న బట్టల్ని విప్పి నగ్నంగా నిలబడింది. ఆ బోగీలో ఉన్న ఓ పెద్దాయన "ఆడపిల్లవు అలా నగ్నంగా ఉన్నావు నీకు సిగ్గు లేదా అన్నాడు. అప్పుడామె దీనంగా మాట్లాడుతూ ‘నాకు సిగ్గా నైజాం కిరాతకులు నన్ను వారం రోజుల పాటు నగ్నంగా చెట్టుకు కట్టేసి అట్టే పెట్టారు. చూడండి నా వంటి నిండా ఉన్న గాయాలు’ అని గోడు వినిపించింది. ఈ దుస్సంఘటనకు చలించి 1948లో ఆరుద్ర త్వమేవాహం రచించారు.
సినీవాలి
సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రకళ అని గ్రహించాలి. ఆరుద్ర కలం నుంచి జాలువారిన మరో వైవిధ్యమైన రచన 'సినీ వాలి'. ఇందులో మధ్యతరగతి మనస్తత్వం, నగర జీవన చిత్రణ ఇతివృత్తంగా ఉంది. ఆరుద్ర 'కూనలమ్మ పదాలు' ప్రతిపద రమణీయాలు. పదపద చమత్కారాలు. మంచి రచన చదివాక బాగా.. ‘భోంచేసినట్టుండాలి/ కొంచెం బాధపడాలి/ జ్వరం రావాలి/ ఒళ్లు విరగాలి’ ఈ బావిలోంచి తేరుకుని బాగుపడాలి అంటారు.
సమగ్రాంధ్ర సాహిత్యం
తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంధం ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుటాల ధారావాహిక గ్రంథం. సర్కారు సహాయం గాని, విశ్వవిద్యాలయాల సహకారం గాని లేకుండా సినీ క్షేత్రంలో ఉంటూనే సమగ్రాంధ్ర సాహిత్యం రాయడం ఒక్క ఆరుద్రకే సాధ్యమైందని పేర్కొనవచ్చు. రాజవంశాల పేర్లతో యుగవిభాగం చేశారు. ఎందరో అజ్ఞాత కవులను వెలికితీశారు. ఇంకా పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రాశారు. ‘గురజాడ గురుపీఠం’, ‘మన వేమన’ ,‘వేమన్న వేదం’ మొదలైన ఎన్నో విమర్శ వ్యాసాలను రచించారు.
సినిమా పాటల హోరు..
ఆరుద్ర 1948లో సినిమా రంగంలో ప్రవేశించారు. సుమారు 400 సినిమా పాటలను రాశారు. ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘పిల్లలు దేవుడు చల్లనివారే’, ‘నేనొక ప్రేమ పిపాసిని’, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ‘గాంధీ పుట్టిన దేశమా ఇది’ వంటి పాటలు ఇప్పటికీ మన గుండెల్లో మార్మోగుతున్నాయి. ఆరుద్ర వందలాది సినిమాలకు సంభాషణలు రాసి ప్రశంసలు పొందారు. చదరంగం, ఇంటింటి పద్యాలు, మహనీయులు, దక్షిణ వేదం, గాయాలు-గేయాలు, పైలాపచ్చీసు, శుద్ధ మధ్యాక్కరలు, సాలభంజికలు, లోహవిహంగాలు తదితర రచనలు ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి.
ఆరుద్ర 73వ ఏట 1998 జూన్ 4న చెన్నైలో అస్తమించారు. నేటికీ మనందరికీ ఆయన పుస్తకాల రూపంలో ఎప్పుడూ పలకరిస్తూనే ఉన్నారు. అతని అడుగుజాడలే నేటి తరానికి వెలుగు జాడలై మనల్ని మునుముందుకు నడిపిస్తాయి.
(ఆగస్టు 31న ఆరుద్ర శత జయంతి ముగింపు సందర్భంగా)
-లలితా రెడ్డి
తెలుగు ఉపాధ్యాయిని,
97046 99726






