పోలవరం ఆలస్యానికి కారకులు మీరు కాదా?

by Ravi |   (  Updated:2025-10-03 01:01:12  IST  )

పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా

పోలవరం ఆలస్యానికి కారకులు మీరు కాదా?
X

పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తుండ టంతో వైసీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా బాధపడుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టు నిర్మాణం 84 శాతం పూర్తి కావడంతో వారికి దిక్కుతోచడం లేదు. అందుకే పోలవరం నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉందని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి పోలవరంపై బరితెగించి అబద్దాలకు తెగబడుతున్నారు..

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారని, చంద్రబాబు రూ. 20 వేల కోట్లకు ఒప్పుకొంటే తాము రూ. 47 వేల కోట్లకు ఒప్పించామని, పోలవరంపై కేంద్రాన్ని కనీసం అడిగే పరిస్థితిలో కూటమి లేదని పచ్చి అబద్దాలకు తెగబడ్డాడు మాజీ మంత్రి బుగ్గన. నేడు పోలవరం నాశనంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు పోలవరంపై మొసలి కన్నీరు కార్చడం చూసి జనం నవ్వుకుంటున్నారు. 2014–19 మధ్య ప్రాజెక్ట్ పురోగతిని పరిశీలిస్తే సీఎం చంద్రబాబు 31 సార్లు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. 104 సార్లు వర్చు‌వల్‌గా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రభుత్వం నిరంతర పర్య వేక్షణలో దాదాపు 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి.

మూడు శాతం పనులే జరిగాయి..

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులు ఆగకుండా తక్షణం అవసరమైన నిధులను రాష్ట్ర ఖజానా నుండి సమకూర్చింది. కేంద్రం నుండి నిధుల విడుదల కోసం వేచి చూడకుండా జాప్యం లేకుండా పనులు కొనసాగించింది. 2019 జూన్ నుండి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండర్స్ పేరుతో ప్రత్యామ్నాయం చూపించకుండా కాంట్రాక్టర్‌ను తొల గించి 16 నెలలు కాంట్రాక్టర్‌ను నియమించలేదు. అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాల వల్ల 2020 లో వచ్చిన వరదలకు డయా ఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయి రూ.2745 కోట్ల అదనపు భారం పడింది. పనులు ప్రణాళిక, షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం, డిజైన్ ఖరారులో జాప్యం, అవసరమైన సిబ్బంది, యంత్రాల సమీకరణలో జాప్యం మూలంగా డయా ఫ్రమ్ వాల్ డ్యామేజీ అయినట్లు ఐఐటీ హైదరాబాద్ నివేదిక ఇచ్చింది. జగన్ పాలన ఐదేళ్లలో కేవలం ప్రాజెక్టు పనులు 3.84 శాతం మాత్రమే జరిగాయి.

ఇవన్నీ చేసింది మీరు కాదా?

భూసేకరణ, తగినంత నిధులు కేటాయించకపోవడం ఆర్ ఆర్ పనులు ప్రాజెక్ట్ పురోగతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అన్ని కార్య నిర్వాహక ఏజెన్సీలు 2024 మే నాటికి పనులు నిలిపి వేసింది వాస్తవం కాదా? నాటి సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని 4సార్లు గడువులు ప్రకటించి 5వ సారి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చేతులెత్తేసింది నిజం కాదా? టీడీపీ హయాంలో పోలవరానికి ఖర్చు చేసిన నిధులను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తే ఆ నిధులు పోలవరానికి ఖర్చు పెట్టకుండా రూ.3,385.58 కోట్లు దారి మళ్లించి పోలవరంను ముంచింది మీరు కాదా? ఈ ప్రాజెక్ట్‌ను 2022లో ఫేజ్-1, ఫేజ్-2‌గా విభజించింది మీరు కాదా? ఎన్నికలకు ముందు పోలవరం నిర్వాసితులకు అదనంగా ఎకరానికి 10 లక్షలు పరిహారం ఇస్తానని, అధికారంలోకి వచ్చాకా వారిని మోసం చెయ్యలేదా? పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక్క రూపాయి నష్టపరిహారం కానీ ఇవ్వకుండా వారిని మోసం చేసింది మీరు కాదా?

ఓర్వలేక ఈ అబద్ధాలు..

రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టును వేగవంతం చెయ్యడానికి, తిరిగి ట్రాక్‌లో పెట్టడానికి 15 నెలల్లోనే 3 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్షించి పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్ర జలశక్తి, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ బృందం ఏడాదిలో నాలుగుసార్లు పోలవరాన్ని సందర్శించి. ప్రాజెక్టును అసాంతం పరిశీలించి సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నారు. డిసెంబర్ ఆఖరుకు డయా ఫ్రం వాల్ పూర్తి కానున్నది. మొత్తం హెడ్ వర్క్స్ డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేక ఈర్ష్యా, ద్వేషంతో చంద్రబాబుపై అబద్దాల విషం కక్కుతున్నారు. మొండి గురువు, బండ శిష్యులు మాదిరిగా బుగ్గన తమ తప్పులను యధా రీతిన కూటమి మెడకు చుట్టాలని చూశారు. అమాయక ముఖం పెట్టి పోలవరంపై గుండెలు బాదుకుంటూ కార్చే మొసలి కన్నీళ్లకు రాష్ట్ర ప్రజలు కరిగిపోరని వైసీపీ నాయకులు తెలుసుకోవాలి.

-నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story