- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి అపశ్రుతులు.. అవసరమా?
ఈ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా మనిషి ఆధ్యాత్మిక ఆలోచనలను తృప్తి పరచుకోవడం కోసం ప్రార్థనాలయాలను, పుణ్యక్షేత్రాలను

ఈ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా మనిషి ఆధ్యాత్మిక ఆలోచనలను తృప్తి పరచుకోవడం కోసం ప్రార్థనాలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు. తాజాగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని కోరికతో ఏపీ, తెలంగాణ నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి, అనేక మంది భక్తులు ఒకేసారి తిరుపతికి చేరడం, టికెట్లను తీసుకునే దగ్గర తోపులాట జరగడం, అందులో 6 మంది భక్తులు మరణించడం 40 మంది క్షతగాత్రులు కావడం శోచనీయం. వాస్తవంగా ఇది దుర్ఘటన, అనుకోని సంఘటన. ఈ విషయంపై రాజకీయ కోణంలో ఆరోపణలు ప్రత్యారోపణలను చేసుకోవడం వల్ల మరణించిన వారి ఆత్మలు క్షోభకు గురౌతాయి తప్ప సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాజకీయాలు ధర్మపరాయణులను మనో దౌర్భాల్యానికి గురిచేస్తాయి.
పండగ రోజే దేవుడిని దర్శించుకోవాలా?
ఈ దుర్ఘటనకు కారణం టీటీడీ నిర్వహకులా? లేక భక్తులా? అనే విషయంలో నిష్పాక్షికమైన విశ్లేషణ ఎవరూ చేయలేరు. ఒకే రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చినపుడు, వచ్చిన భక్తుల్లో ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేనప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. దేశంలో అనేక కుంభమేళాలు, నదీ పుష్కరాలు నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగి, భక్తులు మరణించారు. ఈ విషయంలో భక్తి ప్రదర్శన తప్ప, ఆధ్యాత్మిక ఔన్నత్యం లోపించడమేనని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. పండుగ రోజే దేవుని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అనే భక్తి భావాన్ని ఆధ్యాత్మిక కోణంలో, ధార్మిక కోణంలో, సామాజిక కోణంలో హిందువులకు అర్థం చేయించడంలో హిందూ సమాజానికి సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు, సిద్ధాంతకర్తలు, స్వామీ జీలు, మఠాధిపతులు, హిందుత్వ సంస్థల వాళ్లు విఫలమయ్యారా? అనే అనుమానం కలుగక మానదు. ఒకే రోజు, ఒకే చోటికి, ఒకే సమయంలో అందరూ వెళితే, పరిస్థితి ఎలా ఉంటుంది అనే విచక్షణ లేకుండా భక్తిని ప్రదర్శించుకోవాలంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇంతకు భిన్నంగా ఉండాలని కోరుకున్నా అది జరగదు!
భక్తులను కన్ఫ్యూజన్‌కి గురిచేసి..
ఇక సినిమా పిచ్చి ముదిరి, సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలని, పిల్లలతో సహా సినిమాకు వెళ్లి హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి ఉదంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యగా భావించి, అసెంబ్లీలో చర్చించడం, ఈ ఉదంతానికి కారణమైన సినిమా హీరోను అరెస్టు చేయడం, ఈ విషయం సద్దుమనగాలనే ఉద్దేశంతో సినిమా ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వంటి విషయాలన్నీ ఈ నేపథ్యానికి సంబంధించినవే! ఇక తిరుమల లడ్డు మహా ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని, ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వ హస్తం ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూటమిలోని నాయకులు చేసిన ఆరోపణలను వైసీపీ నాయకులు మరిచిపోలేరు. తిరుపతి తొక్కిసలాట అంశం ఆ పార్టీ నాయకులకు ఒక అస్త్రంగా మారుతుంది. ఇక ఈ ఉదంతంపై అధికార ప్రతిపక్ష పార్టీల సొంత మీడియా తనదైన రీతిలో భక్తులను అంటే హిందువులను కన్ఫ్యూజన్‌కు గురి చేసే పరిస్థితికి తెరలేపింది. మీడియాకు కావాల్సింది ఇలాంటి విషయాలే కదా?
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877






