పార్టీలు సభ జరపడంలో ఇప్పటికీ పాత పద్దతులేనా? సాంకేతికతను వినియోగించుకోలేరా?

by Ravi |   (  Updated:2025-06-01 01:00:20  IST  )

ఎక్కువలకు పోవద్దు అంటే ఎవరు వినిపించుకుంటారు, "తగ్గేదేలే" మన జీవన సూత్రం అయ్యాక. కార్యకర్తలు తగ్గడం లేదు.

పార్టీలు సభ జరపడంలో ఇప్పటికీ పాత పద్దతులేనా? సాంకేతికతను వినియోగించుకోలేరా?
X

"ఎక్కువలకు పోవద్దు" అంటే ఎవరు వినిపించుకుంటారు, "తగ్గేదేలే" మన జీవన సూత్రం అయ్యాక. కార్యకర్తలు తగ్గడం లేదు. ఇక రాజకీయ పార్టీలైతే ఒక్కో భారీ సభకు లక్షల మంది హాజరయ్యారని రొమ్ము విరుచుకుంటారు. ఇన్ని లక్షల మంది హాజరు కానున్నారని ముందు గానే హడలు కొడుతుంటారు. అంత మంది జనాన్ని సమీకరించాలంటే, సభాస్థలికి తీసుకురావాలంటే, వచ్చేవారికి దారి పొడవునా అన్నపాన సదుపాయాలను సమకూర్చాలంటే, సభాస్థలిలో ఏర్పాట్లు చేయాలంటే ఎంత ఖర్చవుతుందో తలుచుకుంటే చుక్కలు కనిపిస్తాయి.

వీటికి తోడు దోవ పొడవునా బ్యానర్ల, ఫ్లెక్సీల, ఆర్చీల, కటౌట్ల ఆర్భాటం. పైగా వచ్చిన వాళ్ళలో నూటికి 90 శాతం ఆ రోజు సంపాదించే ఆదాయాన్ని వదులుకొని ఊరికే రారు కదా. వారికి బేటా చెల్లించాలి. ఇక అనుకున్న వేళకు సభ ప్రారంభం కాదు అన్నది జగద్విదితం. దాంతో, సమయానికి కొన్ని గంటల ముందే ప్రాంగణమంతా నింపబడుతున్న శ్రోతలకు కర్ణానందంగా, నేత్రపర్వంగా, సాంస్కృతిక కార్య క్రమాల ఏర్పాటు కోసం పెద్ద మొత్తంలో మరో ఖర్చు.

ఎన్ని పనిదినాలు వృధా!

ఇటీవల ఒక రాజకీయ పక్ష బహిరంగ సభ దాదాపు 12 వందల ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాది ప్రజల సౌకర్యం కోసం 10 లక్షల మంచినీటి సీసాలు, 16 లక్షల మజ్జిగ పొట్లాలు ఏర్పాటు చేసింది. 1200 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించింది. వివిధ మార్గాల్లో ఆరు అంబులెన్సులు సిద్ధంగా ఉంచింది. ఇటీవలే పై హంగులన్నిటితో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మళ్లీ లక్షలాది మంది ప్రజలు హాజరైన బహిరంగ సభ నిర్వహించబడింది. రోజులు లేదా వారాల తరబడి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఈ ఏర్పాట్ల యోజనలో, ఆచరణలో, పర్యవేక్షణలో నిమగ్నులయ్యారు. ఇంత భారీ కార్యక్రమం జరగకపోతే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్ని పనిదినాలు వృధా కాకుండా ఉండేవో? అలాగే ఇంతమంది జనం కనీసం ఒకరోజు పనీ పాటా మానుకున్నందున వివిధ రంగాల్లో ఎన్ని పనులు కుంటుపడ్డాయో, వాయిదా పడ్డాయో..? వాటి ఆర్థిక మూల్యం ఎంతో ఎవరికెరుక?

ఎన్నో ఇబ్బందులు..

ప్రభుత్వ, ప్రభుత్వేతర రవాణా సంస్థల, వ్యక్తుల వాహనాలను ఈ తిరునాళ్ళకు వినియోగించడం వలన, దారి మళ్లింపుల వలన, సాధారణ ప్రజానీకానికి కలిగే ఇబ్బం దులు మాటేమిటి? ఇంత అనుత్పాదక వ్యయం మన పేద దేశం భరించగలదా? ఇక శాంతి, భద్రతల వ్యవహారం మాటేంటి? దారిపొడుగునా పోలీస్ పహారా. వచ్చే పోయే వాహనాల నిలుపుదల. తనిఖీ. వేరే మార్గాల్లో వెళ్లవలసిన కారణంగా ఆ తోవలంట వాహనాల పొడుగైన వరసలు.. ఇబ్బందిని ఓర్చుకోక తప్పని ప్రయాణికులు.. ఏదైనా మిన్ను విరిగి మీద పడే పని ఉన్నా అంతే సంగతులు.. అత్యవసర వైద్య చికిత్స లేదా కాన్పు అవసరమైతే దయగల పోలీసు అధికారులు అనుమతిస్తేనే ముందుకు వెళ్లడం. ఇంతా చేస్తే, వేదిక మీ దున్న నాయకులను కళ్ళారా చూసే భాగ్యం, మహా అయితే, కొన్ని వేల మందికి మాత్రమే కలుగుతుంది. తక్కినవారు, డబ్బు ఖర్చు చేసి అందుబాటులోకి తెచ్చిన, వెండితెరల మీద చూడవలసిందే.

సభలకు దానికే వస్తున్నారా?

ఈ మాత్రం దానికి బస్సుల్లో కుక్కబడి, లారీలలో నిలబడి, దూరం తక్కువ ఐతే నడిచి, కుదిరితే సురా పావనులై, అలసి సొన జనం పెద్దల దీర్ఘ ఉపన్యాసాలను ఆసక్తితో వినడం అయ్యే పనేనా! నిజంగా ఉపదేశాలను వినాలనే తలంపుతో సభలకు వచ్చే వారెందరు? "నువ్వొకందుకు పోసావు. నేనొకందుకు తాగాను" బాపతే గాని, ఈ జాతరలకు వచ్చేవారంతా ఆయా రాజకీయ పక్షాల అభిమానులనుకోవడానికి ఆస్కారం లేదు.

జబ్బలు చరచడం మానండి!

గత పదేళ్లుగా 23 కోట్ల మంది క్రమం తప్పకుండా దేశ ప్రధాని "మన్ కీ బాత్" కార్యక్రమం ప్రతి ఆదివారం ఇళ్లలోనే ఉండి వింటున్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను 28.8 కోట్ల క్రీడాభిమానులు తమ ఇళ్లల్లోనే కూర్చుని తిలకిస్తున్నారని అంచనా. ఈ దిశగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒక ముందడుగు పడింది. ఇటీవలే‌ తన కార్యాలయంలో కూర్చునే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి నేరుగా గ్రామస్తులతో "మాటామంతీ" సాగించారు. రాజకీయ పక్షాలు పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యే రీతిగా సభలు నిర్వహిస్తూ, ఈ మాధ్యమాల పూర్తి విని యోగం ద్వారా తమ సందేశాలు దేశమంతటా వినిపించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రాజకీయ పక్షాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ జబ్బలు చరచుకోవడం మాని, ప్రజా సంక్షేమ సాధనలో పోటీపడాలి.

మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story