- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌పై అనర్హత వేటుకూ సిద్ధపడతారా..?
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు చెందిన నాల్గవ సెషన్ గురువారం 9 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు చెందిన నాల్గవ సెషన్ గురువారం 9 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఈసారి హాజరయ్యే విషయమై ఉత్కంఠ నెలకొంది. హాజరు కాకపోతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉండడంతో, పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, ఒక సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా 60 సమావేశ దినాలు గైర్హా జరైతే, అతని సభ్యత్వాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సహా వైసీపీ సభ్యులపై అనర్హత వేటు ఊహాగానాలకు తావిస్తోంది.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతారా..?
ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండగా, శాసనసభ నిబంధనల ప్రకారం 10 శాతం సభ్యులు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా ఇస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీసం 19 మంది అవసరం కాగా, వైసీపీ వద్ద ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ హోదాను నిరాకరించిన స్పీకర్ నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. సభకు గౌరవం లేదంటూ, ప్రజాక్షేత్రమే తమ వేదిక అంటూ వైసీపీ గత సమావేశాలను కూడా బహిష్కరించింది.
చర్చల్లో పాల్గొనడం నైతిక బాధ్యత..
ఈ సమావేశాలు రాష్ట్ర ప్రజల సమస్యలపై చర్చకు అత్యంత కీలక వేదికగా మారాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలు, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల పురోగతి, గత ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కాం, నకిలీ ఒప్పందాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగాలి. అదే సమయంలో ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు పలు జిల్లాల్లో రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. పంట నష్టాలు, యూరియా వంటి అవసరమైన ఎరువుల కొరత, సరఫరా లోపాలు, నష్ట పరిహారం లభించకపోవడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వహించాలి. సభకు హాజరుకావడం వల్ల ప్రజల సమస్యలు చర్చకు వచ్చి పరిష్కార మార్గాలు అందుతాయి.
పీపీపీ మోడల్‌పై డోంట్ వర్రీ
ఇప్పటికే ప్రభుత్వంపై పీపీపీ మోడల్‌లో నిర్మాణం జరుపుతున్న వైద్య కళాశాలలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం స్పందిస్తూ, పీపీపీ మోడల్ వల్ల పేదలకు ఎలాంటి నష్టం జరగదని, ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరిగుతున్నాయని పేర్కొంది. త్వరగా నిర్మాణం పూర్త వ్వడంతో పాటు సేవలు అందుబాటులోకి రావడం లక్ష్యంగా పీపీపీ పద్ధతిని అనుసరిస్తున్నామని చెప్పింది.
ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం..
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వాలంటే ప్రతిపక్షం అసెంబ్లీలో పాల్గొనడం అవసరం. సభ అనేది కేవలం అధికారానికి మద్దతు ఇవ్వడానికే కాదు, ప్రజా సమస్యలను చర్చించేందుకు, పరిష్కారాలు సూచించేందుకు, ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నిలబెట్టేందుకు ఉండే వేదిక. కాబట్టి వైసీపీ తమ వైఖరిని పునఃసమీక్షించి అసెంబ్లీలో పాల్గొనడం ద్వారా ప్రజల మద్దతు నిలబెట్టుకోవడం అవసరం. ఇది వారి బాధ్యత మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం కూడా. ప్రతిపక్ష హోదా దక్క లేదనే కారణంతో ప్రజాస్వామ్య వేదిక అయిన శాసనసభను బహిష్కరించడం బాధాకరం. ఇది రాజకీయంగా మాత్రమే కాక, నైతికంగా కూడా వైసీపీకి నష్టం.
-వాడవల్లి శ్రీధర్
99898 55445






