ఏకపక్షంగా లేని ఏపీ రాజకీయం

by Disha edit |
ఏకపక్షంగా లేని ఏపీ రాజకీయం
X

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ సారి ఎవరి అంచనాలకూ అందని విధంగా ఉన్నాయి. వివిధ సంస్థల సర్వేల ఫలితాలు నమ్మే విధంగా లేవు. ఆయా పార్టీల తరఫున ఆ సర్వేలు ప్రకటిస్తున్నట్లుంది. టీడీపీ బీజేపీ, జనసేనతో జతకట్టి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ సీపీఐ, సీపీఎంల పొత్తుతో పోటీ చేస్తోంది. వైసీపీ మాత్రం గతంలో మాదిరే ఒంటరిగానే పోటీ చేస్తోంది.

ఎన్నికలంటే విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు తారాస్థాయిలో వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏపీలో రాజకీయ విమర్శల్లో భరించలేని బండ బూతులు కూడా వచ్చేశాయి.‘‘ఈ ఎన్నికలు ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం.. తాము సిద్ధం’’ అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీని ఓడించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాజధాని అమరావతి, మూడు రాజధానుల అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనకు స్పష్టంగా తెలుస్తోంది.

సామాజిక న్యాయం సాధించబట్టే...

వివిధ పార్టీల ఆలోచనలు క్లుప్తంగా పరిశీలించినట్లయితే.. ‘సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన పేదలతోపాటు క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు,ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, సీఎం సామాజిక వర్గం వారు, వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది మాకు ఓట్లు వేస్తారు. బీసీ, ఎస్టీ,ఎస్సీలలోని అన్ని కులాల వారిని గుర్తించి, ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాజ్యసభ, శాసన మండలి సభ్యుల పోస్టులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సామాజిక న్యాయం పాటించాం. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధాలకు కట్టుబడి ఉన్నాం. లోక్ సభ, శాసనసభ సీట్ల విషయంలో కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమేగాక, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, మహిళల విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించాం. వారికి 50 శాతం సీట్లు కేటాయించాం. ఇవే మమ్మల్ని రెండోసారి విజయతీరాలకు చేరుస్తాయి. అని వైసీపీ భావిస్తోంది.

అవినీతి, అభివృద్ధి మధ్యే పోటీ

‘‘ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, చంద్రబాబు సామాజిక వర్గం వారు, మధ్య, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు మాకు ఓట్లు వేస్తారు. అలాగే మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి, అమరావతితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన అంశం, వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, ఇసుక, మద్యం, మైనింగ్, గంజాయి ద్వారా వైసీపీ నేతలు కోట్ల రూపాయలు గడించారు. అన్ని వర్గాల ప్రజలకు వేధింపులు ఎక్కువైపోయాయి. పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. అని టీడీపీ నమ్మకంతో ఉంది. ఈ అంశాలే మమ్మల్ని గెలిపిస్తాయని నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీని ఏపీలో పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు. పార్లమెంట్ తలుపులు మూసి, చర్చ లేకుండా, అన్యాయంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందన్న అభిప్రాయంతో ఏపీ ప్రజలు ఉన్నారు. అలాగే, కమ్మూనిస్టుల పరిస్థితి రాష్ట్రంలో బాగా దిగజారిపోయింది. వారు ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. రాజకీయ, సామాజిక, ట్రేడ్ యూనియన్, విద్యార్థి యూనియన్, అన్ని వర్గాలలో ఉద్యమాల తీవ్రత తగ్గడం, అత్యధిక మంది నేతల ప్రవర్తన తదితర కారణాల వల్ల సీపీఐ, సీపీఎం బాగా క్షీణించాయి.

బీజేపీతో పొత్తు ఇష్టం లేనప్పటికీ..

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల విషయానికి వస్తే అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో, రాష్ట్ర ప్రజలలో ఎక్కువ మందికి ఇష్టం లేదు. ఈ పొత్తు వల్ల ముస్లింలు అత్యధిక మంది టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ.. వంటి అంశాలు విషయంలో రాష్ట్ర ప్రజలు బీజేపీ అంటే మండిపడుతున్నారు. అంతే కాకుండా, వైసీపీతో బీజేపీకీ లోపాయకారి ఒప్పందం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి, కనీసం కోర్టుకు హాజరు కాకపోవడానికి కూడా బీజేపీ మద్దతే కారణంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇక సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన విషయంలో జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపు వర్గం నుంచి కూడా జనసేనకు అనుకున్న స్థాయిలో మెజార్టీ లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభం వంటి ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఆ ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదం లేకపోలేదు.

పేద వర్గాలు ఓట్లేస్తే చాలా?

వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ, అభ్యర్థులను మార్చడం, మళ్లీ మార్చడం, ప్రకటించడంలో జాప్యం వంటి అంశాలు ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓట్లు వేయడానికి క్యూలలో నిలబడే ఓపిక ఉన్న పేద వర్గాలు ఎక్కువగా వైసీపీకే వేసే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగ, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు కూడా ఓపిక చేసుకుని క్యూలో నిలబడి ఓట్లు వేస్తే టీడీపీ కూటమి లాభ పడే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగితే మాత్రం టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సారి ఎన్నికలు గతంలో మాదిరి ఏకపక్షంగా ఉండే అవకాశం మాత్రం లేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. అభివృద్ధి, సంక్షేమం కంటే కులాల ప్రభావం కూడా ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ఉంటుంది. ఈ ఎన్నికలు చాలా పోటాపోటీగా జరుగుతాయి. మరీ అంత మితిమీరిన నమ్మకం ఎవరికీ పనికిరాదు. పొగరు తలకెక్కితే మాత్రం ప్రమాదం!

- శిరందాసు నాగార్జున,

సీనియర్ జర్నలిస్ట్.

94402 22914


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed