- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Andesri: మట్టి పరిమళం కవిత్వానికి రూపం..
తెలంగాణ కవిత్వానికి మట్టి పరిమళం ఇచ్చిన పేరు.. అందెశ్రీ. ఆయన కవిత్వం పుస్తకాల పుటల్లో కాదు, పల్లె పంట పొలాల్లో పుట్టింది. గ్రామీణ జీవితంలోని సవ్వడులు, రైతు చెమటలోని సత్యం, సాధారణ మనిషి ఆవేదన..

తెలంగాణ కవిత్వానికి మట్టి పరిమళం ఇచ్చిన పేరు.. అందెశ్రీ. ఆయన కవిత్వం పుస్తకాల పుటల్లో కాదు, పల్లె పంట పొలాల్లో పుట్టింది. గ్రామీణ జీవితంలోని సవ్వడులు, రైతు చెమటలోని సత్యం, సాధారణ మనిషి ఆవేదన.. ఇవన్నీ ఆయన పద్యంలో ప్రాణం పోసుకున్నాయి. అందెశ్రీ కవిత్వం సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చిన సాక్ష్యం. ఈ ప్రజాకవి, తన మాటలతో ఒక తరం ఆలోచనలను మలిచాడు. మట్టి, మనిషి, మానవత్వం ఆయన సాహిత్య త్రివేణి. ఆ త్రివేణి ప్రవాహమే ఆయనను కవి మాత్రమే కాక, ప్రజల గుండె చప్పుడుగా నిలిపింది.
అందెశ్రీ కవిత్వం మానవ విలువల పునాదిపై నిలిచిన ఒక సాంస్కృతిక చరిత్ర. అది ఒక పల్లె మనిషి గళం.. నిశ్శబ్దాన్ని కూడా మాటగా మార్చిన గొంతు. ఆయన పదాన్ని స్పృశిస్తే చాలు మట్టి పరిమళం అంటుకుంటుంది. స్వరాన్ని ఆలకిస్తే శతాబ్దాల సామాన్యుడి చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. ఆ గొంతుక ఇప్పుడు నిశ్శబ్దమైందంటే.. మన అంతరంగంలోని ఆర్ద్రత కూడా ఒక్క క్షణం మూగబోయింది.
ప్రకృతి ఒడిలో అక్షరాభ్యాసం
అందెశ్రీ కవిత్వానికి అచ్చు పుస్తకాల కన్నా పల్లె జీవితమే పెద్ద బడి. మట్టి పొరల్లోంచి మొలకెత్తిన పదాలకు ఆయన దేహమే ఒక తాళపత్రం. రాగానికి తాళం సహజంగా జత కూడినట్లు, ఆయన భాషలో ఒక అద్భుతమైన గ్రామీణ మాండలిక సౌరభం ఉంటుంది. అమ్మ పాడే జోల పాట మొదలు, కర్షకుడి స్వేద గీతం వరకు అన్నీ ఆయన కవితల్లో ప్రాణం పోసుకున్నాయి. ‘పదం అంటే పల్లె తల్లి ఊపిరి, స్వరం అంటే రైతన్న చిందించిన రక్తాశ్రువు. నా కవిత్వం... సామాన్యుడి గుండె చప్పుడు.’ అన్నాడు అందెశ్రీ. ఆయన ప్రకృతి కన్న బిడ్డ.
బతుకు వ్యధే ఉద్యమ నాదం
ఆయన వరంగల్ జిల్లాలోని ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించాడు. ఎలాంటి చదువు లేక పోయినా, సమాజం అనే పెద్ద బడిలో జీవితాన్ని చదివిన మహనీయుడు. ‘నేను ప్రజల పక్షం.. నాది ప్రజా మార్గం’ అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి. ఆయన తన కవిత్వాన్ని అట్టడుగు వర్గాల అస్త్రంగా మలిచారు. ఆయన గీతాల్లోని ఆవేదన కేవలం అభినయం కాదు.. అది ఒక ఆచరణాత్మక దిశ. సమాజం కట్టుకున్న అసమానతల గోడలపై ఆయన పాట ఒక యుద్ధభేరి. అది రక్తం చిందించని ఒక మహాయుధం, కాలాన్ని సైతం కదిలించగల పదునైన అస్త్రం.
పలికితే మందారం.. కురిస్తే అశ్రుధార
ఆయన వాక్య నిర్మాణంలో నూలు పోగు లాంటి మెత్త దనమూ, చేతి కర్రలాంటి కరుకుదనమూ రెండూ ఉంటాయి. పల్లె పదాల సహజత్వంతోనే విశ్వజనీన సత్యాలను ఆవిష్కరించిన రసవాది. పాండిత్య ప్రకర్షతో బరువుగా కాకుండా, సామాన్యుడి వాడుక భాషలో అత్యంత లోతైన భావాలను పలికించారు. అందుకే ఆ పాటలు పసిపాపలకు జోలలుగా, యువతకు కర్తవ్య బోధలుగా, వృద్ధులకు జ్ఞాపకాల పేటికలుగా నిలిచిపోయాయి.
ఒక జాతి జెండాగా ఎగిరిన ‘జయజయహే’
పాటే ప్రాణంగా.. పదమే ప్రపంచంగా ప్రపంచం అంత తిరిగాడు. ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అంటూ ఆయన రాసిన గీతం, తెలంగాణ మలిదశ ఉద్య మానికి ఊపిరి పోసింది. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, నేడు రాష్ట్ర గీతంగా ఒక జాతి జెండాగా ఎగిరింది. కేవలం ఉద్యమ గీతాలే కాదు, ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ అంటూ ఆయన పాడినప్పుడు కంటతడి పెట్టని తెలుగువాడు లేడంటే అతి శయోక్తి కాదు. మారుతున్న కాలంలో మానవ సంబంధాలు ఎలా మంటగలిసి పోతున్నాయో అత్యంత సహజంగా చెప్పిన దార్శనికుడు.
మానవత్వం సంగమించిన కవిత్వం
మట్టి నుండి మానవత్వం దాకా అందెశ్రీ కవిత్వం ప్రధానంగా మూడు ధారలుగా ప్రవహించింది అవి.. భూమి- నేలతో మనిషికున్న అవినాభావ సంబంధం, అన్నదాతల కన్నీటి వెతలు, జల సిరుల ప్రాధాన్యత. అస్తిత్వం- మన జాతి గుర్తింపుకు మూలమైన భాష, సంస్కృతి, చరిత్రల ఆత్మగౌరవ పతాక. మానవత- అట్టడుగు వర్గాల వారి జీవితాల్లోని విషాదాన్ని, ఆనందాన్ని సమానంగా హత్తుకోవడం.
స్వరంలో ఆర్ద్రత - పదంలో గాఢత
ఆయన గొంతులో ఒక విచిత్రమైన వైరుధ్యం ఉంటుంది. ఒకేసారి అమ్మ పాడే లాలి పాటలోని మాధుర్యం, జీవితం విసిరే సవాళ్లలోని కాఠిన్యం రెండూ వినిపిస్తాయి. అక్షరాలు ఆవేదనతో అరిచినట్టూ ఉంటాయి. అదే సమయంలో ఆత్మను ఓదార్చినట్టూ ఉంటాయి. ఈ ద్వంద్వ ప్రవృత్తే ఆయన్ను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. అందుకే ‘నా పాటలు వేదికల మీద ముగిసిపోవు, అవి జనజీవన క్షేత్రాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి’ అంటాడు అందెశ్రీ.
ఆయన మిగిల్చిన వారసత్వం..
ఒక కవి నిష్క్రమణ అంటే కేవలం ఒక వ్యక్తి వెలిగిపోవడం కాదు. ఒక విజ్ఞాన సర్వస్వం కనుమరుగవడం. కానీ అందెశ్రీ భౌతికంగా దూరమైనా మన ముందు రెండు బృహత్తర బాధ్యతలను ఉంచి వెళ్లారు.. అవి మాతృభాషను ప్రాణ ప్రదంగా కాపాడుకోవడం, పల్లె నుడి కారాలతో మానవీయ విలువలను పెంచడం, పాటను పీడిత ప్రజల పక్షాన నిల బెట్టడంతో పాటు పాటను సాంస్కృతిక ఆనందానికే కాదు, సామాజిక న్యాయానికి కూడా ఆయుధంగా మలచడం.
నది సముద్రంగా మారిన కాలం..
సాధారణంగా నదులు సముద్రంలో కలుస్తాయి. కానీ కొన్ని నదులే సముద్రాలుగా మారుతాయి. అందెశ్రీ ఆ కోవకు చెందిన అరుదైన స్రవంతి. ఆయన గుండె చప్పుడు ఇప్పటికీ కోట్లాది మంది తెలుగువారి హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుంది.
‘మట్టి మనుషుల భుజాలపై ఆకాశాన్ని దించి
బీడువారిన బతుకుల్లో ఆశల విత్తనాలు నాటి
గుండె గొంతుకలో శ్రమజీవన రాగాన్ని
పలికించిన ఓ లోక కవి!
నీవు నిశ్శబ్దమయ్యావని అనుకోవడం మా భ్రమ...
ప్రతి నాగలి సాలులో, వీచే ప్రతి పైరగాలిలో
నీ పాట మొలకెత్తుతూనే ఉంటుంది.’
జోహార్ అందెశ్రీ! మీ పాట మా గుండెల్లో పదిలం.
- మెర్సీ మార్గరెట్
90528 09952






