Andesri: అందెశ్రీ చిరంజీవియే!

by Ravi |   (  Updated:2025-11-11 00:45:43  IST  )

తెలంగాణ గగనాన నిన్నటి వరకు నినదించిన ఆ గళం ‘జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం’ అంటూ ఆలాపించిన ఆ స్వరామృతం.. నిన్న ఉదయం నిశ్శబ్దమైపోయింది. ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ (అందె ఎల్లయ్య) ఇక లేరు. నిన్న గాంధీ ఆసుపత్రిలో అనా రోగ్యంతో చికిత్స పొందుతూ

Andesri: అందెశ్రీ చిరంజీవియే!
X

తెలంగాణ గగనాన నిన్నటి వరకు నినదించిన ఆ గళం ‘జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం’ అంటూ ఆలాపించిన ఆ స్వరామృతం.. నిన్న ఉదయం నిశ్శబ్దమైపోయింది. ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ (అందె ఎల్లయ్య) ఇక లేరు. నిన్న గాంధీ ఆసుపత్రిలో అనా రోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన జీవనయాత్రకు స్వస్తి పలికారు. తెలంగాణ సాహిత్య ప్రపంచానికీ, ప్రజా హృదయాలకీ ఇది తీరని నష్టం.

సామాన్యుడి అసామాన్య ప్రతిభ

సాదాసీదా గొడ్ల కాపరిగా జీవన ప్రారంభం చేసిన ఓ వ్యక్తి, తన లోపల నిండిన భక్తి, భూమి పట్ల ప్రేమ, మాతృభాష పట్ల ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రజల గుండెలలో నిలిచిన తపస్వి... చదువులేమీ లేకపోయినా, జీవితానుభవమే ఆయనకు శాస్త్రమై, కవిత్వమే ఆయనకు బతుకుదారి చూపింది. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని రేబర్తి గ్రామం ఆయన జన్మస్థలం. అదే మట్టి ఆయన మనసుగా మారింది. తెలంగాణ ప్రజోద్యమపు తుపానులో అందెశ్రీ స్వరం పిడుగులా గర్జించింది. ‘జయజయహే తెలంగాణ’ గీతం ప్రతి ఒక్కరి అభిమానం, ప్రతి ఉచ్ఛ్వాసం కదిలించే ధ్వనిగా మారింది. ఆ గీతం కేవలం పదాల సంకలనం కాదు. అది తెలంగాణ ఆత్మస్పూర్తి స్వరూపం. పల్లెల సోయగం ఆయన పదాలలో కొట్టుకొచ్చినట్లు కనపడుతుంది. ప్రజా జీవితం ఆయన కవితల్లో మెరిసి మురుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమయ్యే ప్రతివేళ ఆయన గళం ప్రజల్లో ఉద్యమ జ్వాలలంటించింది.

ఇదే ఆయన అత్యున్నత బహుమతి..

సినిమా ప్రపంచంలోనూ ఆయన స్వరం ప్రత్యేక స్థానం నిలుపుకుంది. ‘గంగ’, ‘ఆవారాగాడు’, ‘బతుకమ్మ’ లాంటి చిత్రాలలో ఆయన గేయాలు తెలంగాణ భావాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి. ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు’ వంటి పాటలు సామాజిక ఆవగాహనకు కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. 2006లో వచ్చిన ‘గంగ’ సినిమాకి ఆయన అందుకున్న నంది పురస్కారం ఆయన ప్రతిభకు ప్రతీకగా నిలిచింది. పురస్కారాలు ఆయన వెతుక్కోలేదు.. అవే ఆయనను వెతికాయి. లోక్ నాయక్ పురస్కారం, దాశరథి సాహితీ పురస్కారం, సుద్దాల హనుమంతు - జానకమ్మ అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గౌరవం, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ లాంటివెన్నో వచ్చాయి. ఈ జాబితా అంతం కానిది. కానీ అందెశ్రీకి అందిన అత్యున్నత బహుమతి ఆయనను ప్రేమించిన ప్రజల గుండెల్లో నిలిచిన అభిమానమే. ‘తెలంగాణా ధూంధాం’ ఉద్యమ స్ఫూర్తిలో ఆయన వాక్యాలు బల్లెంలా మారాయి. ఆయన సాహిత్యం, ఆయన గేయాలు, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ కలిపి తెలంగాణ ఆత్మగాథగా నిలిచాయి.

ఆయన గీతం ఉన్నంతకాలం..

ఆయన లేని శూన్యంలో తెలంగాణ తల్లి హృదయం శోకవిలాపం చేస్తోంది. కానీ ఆయన గళం, ఆయన గీతం, ఆయన స్ఫూర్తి ఈ నేలతో ఎప్పటికీ దూరమవదు. ప్రతి ఉదయం పాఠశాలల్లో, ప్రతి సభా వేదికపై ‘జయ జయహే తెలంగాణా’ నినాదం వినిపించేంత వరకు అందెశ్రీ చిరంజీవియే. ఆయన జీవితం ఒక పాటయై, అది తెలంగాణ తల్లి గుండెలో నిత్యం మోగుతూనే ఉంటుంది. చిరునవ్వుతో అక్కున చేర్చుకొనే అందె శ్రీ నేడు అందరినీ విడిచి వెళుతున్న క్షణాన శోకతప్త హృదయంతో అక్షర నివాళులర్పిస్తూ..

- కమలేకర్ నాగేశ్వర్ రావు

9848493223

Next Story