ఇంగ్లీష్ గొప్పతనాన్ని మీరు తగ్గించలేరు!

by Ravi |   (  Updated:2025-07-04 01:00:44  IST  )

భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ మాట్లాడే వారిని అవమానక రంగా వ్యాఖ్యానించిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.

ఇంగ్లీష్ గొప్పతనాన్ని మీరు తగ్గించలేరు!
X

భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ మాట్లాడే వారిని అవమానక రంగా వ్యాఖ్యానించిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. మాతృభాషల ప్రాధాన్యత గురించి చెప్పే క్రమంలో ఇంగ్లీషుపై అంత వ్యతిరేక వ్యాఖ్య చేయడం ఎందుకని విస్తృతంగా చర్చ మొదలైంది..

నిజానికి, ఇంగ్లీష్ భాష ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన, విస్తృతంగా మాట్లాడే భాషలలో ఒకటి. ఇది కేవలం ఒక భాష కాదు, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, సాంకేతిక రంగాలలో వంతెనగా పనిచేస్తుంది. మాతృ భాషను, జాతీయ భాషను ప్రేమించడం, విరివిగా వాడు కోవడం, అభివృద్ధి చేసుకోవడం తప్పు కాదు. అవసరం కూడా. అయితే ప్రజలకు ఉద్యోగ, ఉపాధి, వర్తక, వ్యాపారాలకు ఏ భాష ఉపయోగపడుతుందో అదే ప్రజలు విధిగా నేర్చుకుంటారు.. జీవన భృతితో సంబంధం లేకుండా నూటికి ఒకరో, ఇద్దరో ఇతర భాషలను స్వీయ ఆసక్తుల మేరకు నేర్చుకోవచ్చు.

ప్రపంచ సమైక్యతకు వంతెన..

ఇంగ్లీష్ భాష ప్రపంచంలోని వివిధ దేశాలు, సంస్కృతుల మధ్య సంభాషణకు సాధనంగా ఉంది. భారత దేశం వంటి బహుభాషా దేశంలో, హిందీ, తెలుగు, తమిళం వంటి భాషలతో పాటు ఇంగ్లీష్ ఒక సామాన్య భాషగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ఒక తెలుగు వ్యక్తి, ఒక బెంగాలీ వ్యక్తితో ఇంగ్లీష్‌లో సులభంగా మాట్లాడగలడు.. ఇక అంతర్జాతీయ సమావేశాలు, వాణిజ్య ఒప్పం దాలు, దౌత్య సంబంధాలలో ఇంగ్లీష్ ఒక కీలక భాషగా ఉంది. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగిస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాంకేతిక కంపెనీలు ఇంగ్లీష్‌ను ప్రధాన భాషగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, ఒక గ్రామీణ యువకుడు ఇంగ్లీష్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో ఉద్యోగం సంపాదించవచ్చు. మరి ఇంగ్లీష్ లేకపోతే, అతని అవకాశాలు పరిమితం అవ్వవా?

సాంకేతికత, వినిమయ భాష

ఇంగ్లీష్ ఇంటర్నెట్, సాంకేతికత రంగాలలో ఆధిపత్య భాష. వికీపీడియా, యూట్యూబ్, గూగుల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధిక సమాచారం ఇంగ్లీష్‌లో ఉంటుంది. భారతీయ విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఆన్‌లైన్ కోర్సులు, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకు, పైథాన్, జావా వంటి ప్రోగ్రామింగ్ భాషల డాక్యుమెంటేషన్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఇంగ్లీష్ తెలియకపోతే, ఈ రంగాలలో రాణించడం కష్టం.

దేశంలో ఇంగ్లీష్ ప్రాముఖ్యత

భారతదేశంలో ఇంగ్లీష్ ఒక అధికారిక భాషగా, న్యాయ వ్యవస్థ, పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. సుప్రీంకోర్టు, పార్లమెంట్ చర్చలలో ఇంగ్లీష్ వాడబడుతుంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలలో ముందుకు వెళ్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడగలిగే వ్యక్తులు సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం పొందు తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల గ్రామీణ యువతకు నగరాలలో, అంతర్జాతీయ స్థాయిలో సమానంగా పోటీ పడే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక రైతు కుమారుడు ఇంగ్లీష్ నేర్చుకొని ఉద్యోగంలో చేరి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు.

ఏ భాషనైనా.. అవమానించొద్దు!

ఇంగ్లీష్ భాషను అవమానించడం కంటే, దాని ప్రాముఖ్యతను గుర్తించి, భారతీయ భాషలతో సమన్వయం చేస్తూ ప్రోత్సహించాలి. ఇంగ్లీష్ ఒక భాష కాదు, అది జ్ఞానం, అనేక అవకాశాలు ఇచ్చే జ్ఞాన భాండాగారం, ప్రపంచ సమైక్యతకు ద్వారం. స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌ను కూడా నేర్చుకోవడం ద్వారా భారతీయ యువత ప్రపంచ స్థాయిలో రాణించగలదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ భాష గొప్పతనాన్ని అర్థం చేసుకొని, అన్ని భాషలను సమానంగా గౌరవించే విధంగా మాట్లాడాలి. నిజానికి భాష అవసరం భావ వ్యక్తీకరణకు తోడ్పడేదే. అన్ని భాషలూ గొప్పవే. ఇందులో ఎక్కువ, తక్కువ అనే అభిప్రాయాలు అవసరం లేదు. మనకు ఎన్ని భాషలు తెలిస్తే అంతగా మన జ్ఞాన పరిధి విస్తరించి... నలుదిశలా వ్యాపిస్తుంది. అన్ని భాషలను సమదృష్టితో చూడాలి. రాగద్వేషాలకు అతీతంగా ప్రేమించగలగాలి. ఆ భాషలో భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ భాషనూ తక్కువ చేసి చూడకూడదు. మనకు "ఫలానా" భాష రానంత మాత్రాన ఆ భాష వ్యర్థం అయిపోదు. ఏ భాష గొప్పతనం దానిదే.

- డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story