- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు బతకాలంటేనే భయమేస్తుంది!
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ మధ్య 'దేశ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. దేశంలో కలిసి

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ మధ్య 'దేశ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. దేశంలో కలిసి మెలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య చీలికకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ప్రశ్నించే గొంతుకులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పు చేయకపోయినా కేంద్రం వేధింపులకు గురి చేస్తోందని, జైళ్లలో పెట్టి వేధిస్తోందని, ప్రస్తుతం దేశాన్ని చూస్తుంటే భయమేస్తుందని విమర్శించారు.
ఆర్థిక భాషలో sustainability అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలు దీర్ఘకాలికంగా మనుగడ సాధించేలా ఉన్నాయా లేదా భవిష్యత్తును పణంగా పెట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందేలా ఉన్నాయా? అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మరీ అనుత్పాదక ఖర్చులు పెడుతుండటం చూస్తుంటే మన బిడ్డల భవిష్యత్తును ఫణంగా పెట్టి ముందుకు వెళుతున్న విధానం కనపడుతోంది. ఈరోజు దేశం అప్పు 200 లక్షల కోట్లకు పైగా చేరింది. అంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. ఏమన్నా ఆదాయం సమకూర్చే ఖర్చులు పెట్టారా? అంటే అది కూడా ప్రశ్నార్ధకమే.
ఆడపిల్లల బతుకు భయపెడుతోంది!
అప్పట్లో జగద్ధాత్రి మరణం కలిచి వేస్తే, నిన్న కాక మొన్న బతకగల ధైర్యం, స్థైర్యం, పట్టుదల నిబద్ధత ఉన్న మేధావి స్వేచ్ఛ మరణం చూస్తే బతకాలంటేనే భయమేస్తుంది. నిర్భయ, అభయ, ఆయేషా మీరా మరెందరో! ఆధ్యాత్మికత చాటున నిత్యానందస్వామి, ఆశారాం బాపూజీ, కటూవ, మంజునాథ స్వామి సాక్షిగా వందలాది పసిబిడ్డల, మహిళల హత్య, హత్యాచారాలను చూస్తుంటే గుండె సముద్రమై కళ్లల్లో అలలు ఎగిసిపడుతుంటే ఇంకా బతకాలని లేదు. వీరందరూ చనిపోవడం వెనక వ్యక్తుల కన్నా పెట్టుబడిదారి, కార్పొరేట్ ప్రభుత్వ వ్యవస్థలు చేస్తున్న హత్యలు..బతకడానికి దారిలేని, ప్రేమల కోసం ఆరాటపడుతున్న ఎంతోమంది ఆడపిల్లలు బతుకు గురించి తలుచుకుంటే నాకు చాలా భయమేస్తుంది.
బతుకుపై నమ్మకం ఏది?
భర్తలు భార్యలను, భార్యలు భర్తలను చంపుతున్న కాలం. నమ్మించి ప్రియులు చేసే సామూహిక హత్యాచారాలు, హత్యలు. పాలు తాగే పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు హత్యాచారాలు హత్యలు. నమ్మకం లేని కుటుంబ, సమాజాలపై పిల్లల్ని వదలలేక పిల్లలను హత్య చేసి, తనకు తాను హత్య చేసుకుంటున్న తల్లులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఇవన్నీ చూస్తుంటే బతకాలంటే చాలా చాలా భయం వేస్తోంది అమర్త్యసేన్‌జీ.
తాళాల వెనుక జీవితాలు..
ఇక పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్ వలన మన పైన ఎవరో మన కింద ఎవరో, మనకు కుడి ఎడమల ఎవరో తెలియని పరిస్థితి. సెక్యూరిటీలు, మేనేజర్లు ఉన్నా తలుపులు మూతల వెనక మనుషులు.. తలుపుల ముందు ఎవరొస్తారోనన్న భయంతో బలమైన ఇనప చట్రాలు, వాటికి బలమైన తాళాలు. ఫోన్ చేస్తే ఉప్పులు, పప్పులు, మందులు, కూరలు, టిఫిన్లు అన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఇవి కాదు కావాల్సింది. నాలుగు మాటలు చెప్పుకోవడానికి మనుషులు కావాలి.. ఒకరితో ఒకరు మానవ సంబంధాలు లేకుండా బతకగలమా? మాటా మంతీ లేకుండా బతికేటట్లయితే ఎవరి చేలో వాళ్ళు, ఎక్కడో ఓ చోట ఇల్లు కట్టుకొని బతకొచ్చు కదా! గుంపు జీవితాలను గడుపుతూ వస్తేనే సమాజాల అభివృద్ధి జరిగింది. పక్షులు జంతువులు కూడా గుంపు జీవితాన్నే గడుపుతుంటాయి. మనుషులు అంతే. ఒకప్పుడు తినడానికి సరైన ఆహారం లేకపోయినా పచ్చడి మెతుకులు తింటూ కష్టం సుఖం పంచు కుంటూ నలుగురు మధ్య సంతోషంగా బ్రతికే స్థైర్యం, ధైర్యం ఉండేది. ఇప్పుడు అన్నీ ఉండొచ్చు. కానీ, మాట్లాడడానికి మనుషులే లేరు.
మాట్లాడే మనుషులు లేని సమయం
నిజమే! ఫోను చేయలేని పరిస్థితులు వస్తే కరోనా కాలంలో లాగా బతుకుతున్నాం. నిజానికి కరోనా కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలన్న పనిచేశాయి. ఓ కవి అన్నట్లు మాట్లాడే మనుషులు లేని ఈ సమయములో నా శత్రువైనా సరే ఓ మాట మాట్లాడితే బాగుండు అని కోరుకుంటున్న వాళ్లు ఎంతమంది చదువురాని, చదువులేని, 10వ తరగతి తప్పిన పిల్లలను వ్యసనాలకు బానిసలను చేసి హీరోయిజం నరనరాన నింపి చేతులకు, చేతలకు కనపడని ఆయుధాలను ఇచ్చి దాడులకు పురిగొల్పుతున్న రాజకీయ వ్యవస్థలు, మూస, మూక దాడులు. 100 సంవత్సరాలు వెనక్కి పోయిన ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని చూస్తుంటే బతకాలి అన్న ఆశ రోజుకు కృంగిపోతున్నది అమర్త్యసేన్‌జీ. అగ్రరాజ్య అండదండలతో ఇరాన్, ఇరాక్, పాలస్తీనాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు. పసిపిల్లల ప్రాణాలను హరిస్తూ జాతి హననానికే పూనుకోవడం చూస్తే మనుషులుగా మనం బతికున్నామా అనిపిస్తుంది సేన్ జీ. సహజం కానీ మరణం ఏదైనా సరే ప్రభుత్వం, వ్యవస్థలు చేస్తున్న హత్యలే కదా.
ఆశావాద దృక్పథం ఇంకా చావలే...
అయినా నాకు చిన్న ఆశ, చిన్న బాధ్యత ఉంది. రంగనాయకమ్మ మాట్లాడుతూ, “ఇలా అనుకుంటే స్పార్టకస్ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాడా? బానిస సమాజం పోయిద్ది అనుకున్నామా? పోయింది. రాజరికం పోయిద్ది అనుకున్నామా? పోయింది. కౌలు రైతు వ్యవస్థ పోయిద్ది అనుకున్నామా? పోయింది. జమీందారీ వ్యవస్థ పోయిద్ది అనుకున్నామా? పోయింది. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ పోయిద్ది. ఎప్పటికైనా కమ్యూనిస్టు సమాజం వస్తుంది. రాక మానదు. అప్పటిదాకా పోరాటం చేయాల్సిందే’’ అన్నారు. ఈ ఆశావాద దృక్పథంతోనే జీవిస్తున్నాను. జీవిస్తాను.
కాంతి నల్లూరి
63003 28040






