విలువల పక్షపాతి...జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

by Ravi |   (  Updated:2025-08-26 01:15:29  IST  )

భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవులు గౌరవానికి మాత్రమే కాదు, బాధ్యతలకు ప్రతీక. ప్రజాస్వామ్య

విలువల పక్షపాతి...జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
X

భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవులు గౌరవానికి మాత్రమే కాదు, బాధ్యతలకు ప్రతీక. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముకలుగా నిలిచే రాజ్యాంగ సంస్థలు నేడు అనేక ఒత్తిడులకు లోనవుతున్న తరుణంలో, అటువంటి పదవుల్లో తటస్థత, విలువల పట్ల నిబద్ధత, న్యాయబద్ధ దృక్పథం కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో భారత ఉపరాష్ట్రపతి పదవికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిజస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అభ్యర్థి త్వం ఒక గంభీరమైన విలువ ఆధారిత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతోంది.

ఉపరాష్ట్రపతి పదవి దేశ రెండవ అత్యున్నత స్థానం. ఇటువంటి కీలక పదవికి విలువలతో కూడిన, న్యాయ పరంగా నిశ్శబ్ద విప్లవాలు చేసిన వ్యక్తి అభ్యర్థిత్వం దేశ ప్రజలలో ఆశాజనకంగా మారుతోంది. ఆయన పేరు ఉప రాష్ట్రపతి పదవికి వినిపించటం గర్వించదగిన విషయం.

తాత్విక న్యాయమూర్తి

తెలంగాణ మట్టిలో పుట్టిన ఈ మేధావి, అత్యున్నత న్యాయస్థానంలో సేవలందించి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఎనలేని కృషి చేశారు. తన సేవలతో న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత సమీపంగా తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు స్పష్టమైన ప్రభావం చూపాయి. సామాజిక న్యాయం, వర్గ హీనుల హక్కుల పరిరక్షణ, కేంద్రీకృత అధికారానికి వ్యతిరేకత వంటి అంశాల్లో ఆయన తీర్పులు లోహియా ఆలోచనల ప్రతిబింబంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఒక ‘న్యాయవాది అని మాత్రమే కాదు- తాత్వికుడు’ అని కూడా పిలువవచ్చు.

చారిత్రాత్మక సల్వా జుడుం తీర్పు

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి న్యాయ ప్రస్థానంలో 2011లో వచ్చిన సల్వా జుడుం తీర్పు ఒక చారిత్రాత్మక మైలురాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావో యిస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేట్ మిలిషియా సల్వా జుడాన్ని ఆయన నేతృత్వంలోని బెంచ్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఆయన ఇచ్చిన తీర్పులో ఈ పదాలు ముఖ్యంగా నిలిచిపోయా యి. ప్రజల రక్షణ ప్రభుత్వ బాధ్యత. దానిని ఆయుధాలు పట్టిన ప్రైవేట్ మిలిషియాల చేతిలో అప్పగించడం అనాగరికం, రాజ్యాంగ విరుద్ధం. ఈ తీర్పు ద్వారా ఆయన గిరిజనుల హక్కులను, మానవ హక్కులను, ప్రభుత్వ అధికార హ‌ద్దు ల‌ను స్పష్టంగా నిర్వచించారు. ఇది భారత న్యాయ వ్యవస్థలో మానవతా దృక్పథానికి నిలిచిన మలుపు కావడం విశేషం.

లోహియా స్ఫూర్తితో నడిచిన తీర్పులు..

జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి తీర్పులు కేవలం చట్టాలను అనుసరించలేదు. అవి సామాజిక న్యాయం, శ్రామిక వర్గాల సంక్షేమం, మౌలిక హక్కుల పరిరక్షణ వంటి లోతైన తాత్విక అంశాలనూ స్పృశించాయి. ఆయన న్యాయ దృష్టిలో నైతికత, నిబద్ధత, సమగ్రత కీలకమైన పాత్ర పోషించాయి. మౌలిక హక్కులు పుస్తకాలలో ముద్రించబడిన వాక్యాలుగా కాకుండా, ప్రజల జీవితాల్లో అమలు అవ్వాల్సిన హక్కు లుగా ఆయన పరిగణించారు.

తెలంగాణకు న్యాయబద్ధ మద్దతు!

తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి దృక్పథం స్పష్టంగా కనిపించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ సంఘాలకు ఇచ్చిన సూచనలు, పునర్విభజన అంశాల్లో గళమెత్తిన తీర్పులు, తెలంగాణ పట్ల అభిమానం కాదు. న్యాయబద్ధ బాధ్యత అని సూచిస్తాయి. తెలంగాణ అంటే ఒక ప్రాంతం కాదు. అధికార వ్యవహారాల్లో హక్కులను కోల్పోయిన ప్రజలకు న్యాయ స్వరూపం ఇవ్వడమే అని ఆయన నమ్మకం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చారిత్రక, చట్టబద్ధమైన అంశాలపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వైఖరి చాలా స్పష్టమైనది. విభజన అనంతరం తెలంగాణ ప్రజలకు హక్కులు, న్యాయం లభించాలన్న పట్టుదల ఆయన వ్యాఖ్యాలలో, తీర్పుల్లో, ప్రభుత్వ సంఘాల నివేదికల్లో ప్రతిబింబించాయి. ఈ విధంగా ఆయన తెలంగాణ వాదిగానే కాక, తెలంగాణ హక్కుల పరిరక్షకుడిగా కూడా గుర్తించదగినవారు.

రాజకీయాలకు అతీతంగా..

రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించాల్సిన ఉపరాష్ట్రపతి పాత్రలో న్యాయబద్ధత, తటస్థత, నిగ్రహం, ప్రజాస్వామ్య విశ్వాసం ఎంతో అవసరం. ఇవన్నీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యక్తిత్వంలో లభ్యమవుతాయి. రాజకీయాల పట్ల ఆయన దూరంగా ఉన్నా, ప్రజల హక్కుల విషయంలో ఆయన వ్యవహార శైలి స్పష్టమైనది.

ఆ పదవికి అవసరమైన లక్షణాలు..

భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా పనిచేయాల్సిన బాధ్యత కలిగిన పదవి. ఇది కేవలం ప్రోటోకాల్ పదవిగా కాకుండా, సున్నితమైన శాసన వ్యవస్థను సమర్థంగా నడిపించే బాధ్యత కలిగిన స్థానం. ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు కావల్సిన లక్షణాలు తటస్థత, న్యాయ పరిపక్వత, రాజ్యాంగ నిబద్ధత, నిగ్రహం, ప్రజాస్వామ్యంపై నమ్మకం. ఇవి అన్నీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యక్తిత్వంలో కనిపిస్తాయి. రాజ కీ‌య పక్షపాతానికి దూరంగా ఉండటం, వ్యవస్థల పట్ల గౌరవం, ప్రజల పట్ల దృఢమైన నిబద్ధత ఇవన్నీ అంతరంగంగా అలవాటు చేసుకున్న నేతగా ఆయనను నిలబెడతాయి.

విలువకు ఓటు..

ఈ దేశానికి ఇప్పుడు ఒక నిఖార్సైన ప్రజాస్వామ్యవాది అవసరం. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లోహియా తాత్వికత, తెలంగాణ యోధుడి స్ఫూర్తి, న్యాయ వ్యవస్థలో మానవతావాదం అన్నింటినీ సమతుల్యంగా మిళితం చేసిన నేత. ఉపరాష్ట్రపతి పదవికి ఆయనను ఎంపిక చేయడం అనేది ఒక వ్యక్తికి గౌరవం కాదు. అది భారత ప్రజాస్వామ్యానికి గౌరవం. ఈ ఎన్నిక ఒక వ్యక్తిని గెలిపించడానికి కాదు.. ఒక సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ఈ ఎన్నిక రాజ్యాంగ విలువలు నిలబెట్టే నాయకత్వానికి ఇచ్చే సమ్మతి. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వం విలువల పట్ల నిబద్ధతకు, నియబద్ధతకు, తటస్థతకు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఓ ప్రతినిధిగా నిలుస్తోంది. ఈ సమయంలో దేశానికి నాయకుడు కాదు..మార్గదర్శి అవసరం. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆ మార్గదర్శకత్వానికి అర్హుడు మాత్రమే కాదు.. అవసరం.

- సయ్యద్ రఫీ

EC మెంబర్ - ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్

99660 25325

Next Story