కామన్ మ్యాన్ డైరీ: సేట్ అందర్ మునీమ్ బాహర్

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: సేట్ అందర్ మునీమ్ బాహర్
X

అది 2002వ సంవత్సరం. హైదరాబాద్​ నగరంలోని ఓ పారిశ్రామికవాడ. మినీ ఇండియాగా పేరున్న ప్రాంతం. అన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలవాళ్లకు కేరాఫ్ అడ్రస్. అక్కడున్నవారంతా వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకొని ఫ్యాక్టరీలలో పనుల కోసం వచ్చినవాళ్లే. అక్కడ బ్రహ్మయ్య కిరాణం షాప్ అంటే బాగా ఫేమస్. నలుగురు వర్కర్లు. ఇప్పటి సూపర్ మార్కెట్‌ను తలపించేలా ఉంటుంది. ప్రతి వస్తువూ ఆయన దగ్గర దొరుకుతుంది.

పండుగ పూట అయితే రాత్రి 12 వరకు దుకాణానికి రికామ్ ఉండదు. మెదక్ జిల్లాకు చెందిన బ్రహ్మయ్య ఊరిలో రెండు, మూడు కిరాణాషాపులు కావడంతో పోటీని తట్టుకోలేక హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తొలుత ఓ ఇంటిని అద్దెకు తీసుకొని షాపు నడిపించాడు. నాలుగేళ్లు గడిచాక ప్లాట్ కొని ఇల్లు, మడిగె కట్టుకున్నాడు. బ్రహ్మయ్యకు ఒక కొడుకు, ఒక కూతురు. బ్రహ్మయ్య భార్య పుష్పలత గృహిణి, షాపు ఇల్లు ఒకే దగ్గర ఉండటంతో భర్త లేని సమయంలో షాపును కూడా చూసుకుంటుంది.

*

వ్యాపారం సాఫీగా సాగుతుండగా ఓ కార్పొరేట్ సంస్థ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్ పేరిట కిలో చక్కెర రూ. 9 కే అంటూ వీధంతా బోర్డులు పెట్టింది. బోర్డును జాగ్రత్తగా గమనిస్తే తప్ప అసలు విషయం తెలియదు. వెయ్యి రూపాయల ఇతర సామగ్రి కొనుగోలు చేసినవారికి మాత్రమే. అది కూడా ఒక కిలోనే ఇస్తారన్నది ఆ బోర్డులోని షరతు. చాలా మంది ఎగబడ్డారు. ప్రతి వస్తువు దొరుకుతుండటంతో జనం క్యూలో నిలుచొని మరీ సామగ్రి కొంటున్నారు. బ్రహ్మయ్య దుకాణానికి క్రమంగా గిరాకీ తగ్గుతున్నది. గతంలో ఖాతాలు పెట్టినవాళ్లు ఇటు వంక రావడం లేదు. లక్షల్లో డబ్బులు రావాల్సి ఉంది. నమ్మకంతో సామగ్రి ఇచ్చాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.

గిరాకీ డౌన్ కావడంతో నలుగురిలో ఇద్దరు వర్కర్లను తీసేశాడు. ఇద్దరితోనే షాపు రన్ అవుతున్నది. కీలక వర్కర్ హన్మంతు తాను మానేస్తున్నట్టు చెప్పాడు. సరేనన్నాడు బ్రహ్మయ్య. ఉద్దెరపై కిరాణా సామాను తీసుకున్నవారు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, అడిగితే రేపు మాపు అంటుండటంతో విసుగు చెందాడు బ్రహ్మయ్య. ఎలాగోలా కూతురు పెళ్లి చేశాడు. ఇంటర్ వరకు చదువుకున్న కొడుకు పై చదువులకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు బ్రహ్మయ్యకు ఎట్టకేలకు షాపు తీసేశాడు. ఉన్న సామగ్రిని సమీప బంధువులకు అయినకాడికి అమ్మేశాడు. మడిగెను కిరాయికి ఇచ్చాడు. తెలిసిన కాంట్రాక్టర్ వద్ద కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్ గా చేరాడు. కొడుకు వికాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు.

*

హన్మంతు వేరే ప్రాంతంలో కిరాణా షాపు తెరిచాడు. అది కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో ఎవరూ అక్కడ షాపు పెట్టేందుకు సాహసించలేదు. దీంతో హన్మంతు షాపు బాగా నడుస్తున్నది. అదే ప్రాంతంలో సొంతిల్లు కట్టుకున్నాడు. తన ఒక్కగానొక్క కొడుకు కిషోర్ బీబీఎం చదివించాడు. కిషోర్ ఉద్యోగ వేటలో ఉన్నాడు.

ఓ కార్పొరేట్ సంస్థలో స్టోర్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. కిషోర్ టాలెంట్‌ను చూసిన కంపెనీ అధికారులు కొలువు ఇచ్చారు. నెలకు 30 వేల జీతం ఇస్తామన్నారు. తర్వాత ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పారు. పెద్ద గ్రూప్ కావడంతో జాయిన్ అయిపోయాడు కిషోర్.

*

బ్రహ్మయ్య కుటుంబం పరిస్థితి రోజురోజుకూ ఆర్థికంగా దిగజారుతున్నది. కూతురు పెళ్లికి చేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. ఇంటిని అమ్మేశారు. అప్పులు కట్టేశారు. మరో ప్రాంతానికి వెళ్లి అద్దె ఇంటిలో ఉండసాగారు. వికాస్‌కు ఏదైనా పనిచేయాలన్న తపన మొదలైంది. రోడ్డుపై నుంచి వెళ్తుంటే మాల్ దగ్గర వాంటెడ్ బోర్డు కనిపించింది. వెళ్లి ఆరా తీశాడు. బయోడేటా ఇచ్చాడు. మరుసటి రోజు కాల్ వచ్చింది. 'జీతం 15 వేలు ఇస్తాం, రేపు జాయిన్ కావచ్చు' అని చెప్పారు.

తండ్రిని తీసుకొని బయల్దేరాడు వికాస్. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. బయటికి వెళ్లే సమయానికి అక్కడికి వచ్చాడు హన్మంతు. తన పాత యజమానిని చూసి నమస్కారం చేశాడు. బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. తన కొడుకు ఈ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు. లోనికి వెళ్లి పరిచయం చేయించాడు. కిషోర్ కూడా బాగా అణకువగా సీట్లోంచి లేచి నిల్చున్నాడు. తన కొడుకును జర చూసుకొమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బ్రహ్మయ్య. కార్పొరేట్ రక్కసి విసిరిన వలకు బ్రహ్మయ్య కుటుంబం అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు గుమస్తాగా పనిచేసిన హన్మంతుకు కాలం కలిసొచ్చింది. బీబీఎం చదువుకున్న ఆయన కొడుకు స్టోర్ మేనేజర్ అయ్యాడు.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580



Next Story

Most Viewed