- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల గణనతో దేశంలో పెను విస్ఫోటనం!
దశాబ్దాలుగా మేధావులు, రాజకీయ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సమగ్ర కుల గణనను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్

దశాబ్దాలుగా మేధావులు, రాజకీయ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సమగ్ర కుల గణనను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయ వంతం చేసింది. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యురాలవడం దేశంలోని వెనుకబడిన వర్గాలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు..
బిహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణన చేసినా కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడంతో దేశంలోని మెజారిటీ వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద మైనారిటీ వర్గాలు తీవ్ర నిరాశకు గురయినాయి. రాహుల్ గాంధీ స్వయంగా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ కులగణన విజయవంతం అయ్యేలా చూడటం ఈ వర్గాలను ఆనందంలో ముంచెత్తింది.
జన గణనలో కుల గణన అంటూ..
2022 సెప్టెంబర్ 20న మొదలైన రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా అనేక చోట్ల చేసిన ప్రసంగాల్లో కుల గణన గురించి ప్రస్తావించారు. 90 సంవత్సరాల తర్వాత కుల గణన ద్వారా ఈ కులాల స్థితిగతులను సమగ్రంగా విశ్లేషించి వీరి అభ్యున్నతికి వివిధ ప్రణాళికలు తయారు చేసి దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడపడానికి వీలు పడుతుందని ఆయన పదేపదే పేర్కొంటూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేత, ఇండియా కూటమి ఇచ్చిన వత్తాసుతో వెనుకబడిన వర్గాల నాయకులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచడంలో విజయవంతం కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో బీజేపీ సహా ఎన్డీఏ పార్టీలు సఫలీకృతులయ్యారు. అప్పట్లోనే సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో.. అధికారం చేపట్టిన బీజేపీ, ఎన్డీఏ పార్టీలు కప్పదాట్లు వేస్తూ కుల గణనను దాచి తుంగలో తొక్కాయి. 2014 నుండి వివిధ వర్గాల నుండి వస్తున్న ఒత్తిడికి తలవంచి 2019 ఎన్నికల్లో సులువుగా గెలవడం కోసం జన గణనకు బడ్జెట్లో సుమారు 8700 కోట్లు కేటాయించి వెనుకడిన వర్గాలను జనగణనలో కుల గణన పేరిట బుజ్జగించి అధికారం చేజించుకున్నాయి.
కుల గణనపై ససేమిరా అంటున్న ఎన్డీఏ
2020 జనవరిలో వచ్చిన కరోనా నేపథ్యంలో ఈ అంశాన్ని విజయవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. అలాగే అనేక వంకలు చెప్పుకుంటూ 2024 ఎన్నికల నేపథ్యంలో జన గణన వాయిదా వేశామని, ఎన్నికల అనంతరం మొదలు పెడతామని వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తించింది. అగ్రవర్ణాల నాయకత్వంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ప్రతి 10 ఏళ్లకు తప్పక నిర్వహించవలసిన జన గణనను నిర్విరామంగా వాయిదా వేస్తుండటం శోచనీయం. 2021లో ముగించాల్సిన జన గణనను ఐదు ఏళ్లు గడిచినా చప్పుడు చేయడం లేదు. 146 కోట్ల భారత ప్రజల కోసం జన గణన మొదలుపెట్టక ఐక్యరాజ్యసమితి దృష్టిలో చులకన అవుతున్నాయి. దేశంలోని అన్ని వర్గాలూ ఎన్డీఏ తీరు చూసి నివ్వెరపోతున్నారు.
రాష్ట్రంలో కుల గణన సర్వే సక్సెస్!
ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో నేను స్వయంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టగా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 78 పేజీల తన అఫిడవిట్‌లో భారతదేశంలో జన గణన కుల గణన అసాధ్యమని దాని వల్ల భారత దేశ సమగ్రత దెబ్బతింటుందని చెప్పడం దేశంలోని మెజారిటీ వెనుకబడిన వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వెనుకబడిన వర్గాలను వెంటాడుతున్న కుల పరమైన వెనుకబాటుతనాన్ని తెలుసు కోవడం తద్వారా నివారణ చర్యలు తీసుకునే వీలును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించడం దానిపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం షాక్ కలిగిస్తోంది. 2024 జనవరి నెలలో మళ్లీ రాహుల్ గాంధీ దేశంలోని అభ్యుదయ వర్గాలను ఉత్తేజపరిచిన నేపథ్యంలో, ఇండియా కూటమి గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ప్రభుత్వం ఏర్పాటుకు అతి చేరువకు చేరుకోవడం గొప్ప కీలక పరిణామం. జనవరి 12న ఢిల్లీలో భారత్ అభియాన్ నేతృత్వంలో జోడో న్యాయ యాత్ర సన్నాహక సమావేశంలో తెలంగాణ నుండి సభ్యుడిగా నేను పాల్గొని ఆ సమావేశంలో రాహుల్ గాంధీని కలిసి కులగణన అవసరంపై అభ్యర్థించాను. ఆయన క్షణాల్లో తెలంగాణ ముఖ్యమంత్రిని ఆదేశించడం, 2024 ఫిబ్రవరిలో శాసనసభ తీర్మానం చేయడం.. అన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద జరిగి నేడు తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే విజయవంతం కావడం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
శాశ్వత పరిష్కారమే బెటర్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతామని చెప్పడం అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగించింది. కొన్ని పెట్టుబడిదారీ వర్గాల పత్రికలు రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఉందని హెచ్చరించాయి. కానీ కోటి ఆశలతో గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను పూర్తిగా సంతృప్తి పరుస్తుందని నమ్మకంతో తెలంగాణలోని వెనుకబడిన వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. 42 శాతం రిజర్వేషన్స్‌కి కేంద్ర అనుమతి అవసరం లేదు. రానున్న కొద్ది రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికితే అందరూ ఊపిరి తీసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆళ్ల రామకృష్ణ
విశ్రాంత చీఫ్ ఇంజనీర్
99669 44244






