- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వాన్ని కావలించుకున్న మహనీయుడు!
నేటికి సరిగ్గా 123 ఏళ్ల క్రితం సాహు మహారాజ్ జారీ చేసిన ఒకానొక ఫర్మానా.. ఆధునిక భారతదేశపు సామాజిక న్యాయ పోరాటానికి దిక్సూచిగా నిలిచి..

నేటికి సరిగ్గా 123 ఏళ్ల క్రితం సాహు మహారాజ్ జారీ చేసిన ఒకానొక ఫర్మానా.. ఆధునిక భారతదేశపు సామాజిక న్యాయ పోరాటానికి దిక్సూచిగా నిలిచి.. చరిత్ర సృష్టించింది. ఆయన ఏలుబడిలో ఉన్న రాజ్యంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో దళితులు, వెనుకబడిన వారికి 50 శాతం రిజర్వేషన్ల హక్కును సదరు రాజ శాసనం దాఖలు పరిచి దేశంలో రిజర్వేష న్లకు అంకురార్పణ చేశారు. తర్వాత మరో 50 ఏళ్లకు.. సాహు సదాశయాన్ని అంబేడ్కర్ రాజ్యాంగ బద్ధం చేశారు. సాహు మహారాజ్ నాడు జారీ చేసిన ఆ ఫర్మానా.. ఆధునిక భారత్ మాగ్నాకార్టాగా నిలిచింది. ఆ జులై 26 'రిజర్వే షన్స్ డే'గా దేశ చరిత్రలో నిలిచిపోయింది.
వేల సంవత్సరాలుగా మనువాద రిజర్వేషన్ల వ్యవస్థ మన దేశంలో పకడ్బందీగా అమలు జరిగింది. కుల దురహంకార శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మత గ్రంధాలను, దేవుడి పేరును సైతం దుర్వినియోగ పరిచారు. ఆ కారణంగా దేశం ఎన్నో విధాలుగా నష్టపోయింది. సాహు, అంబేడ్కర్, వీపీ సింగ్‌లు తీసుకొచ్చిన సామ్యవాద రిజర్వేషన్లు ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నించాయి.
రాజుపై తిరుగుబాటు చేయకుండా..
ఈ దేశంలో పురోహిత వర్గానికి, రాజులకు మధ్యన ఒక పవిత్ర ఒడం బడిక మొదటి నుండీ కొనసాగింది. "నా విష్ణు పృథివీపతి.." అనే శ్లోకం ఆ పవిత్ర ఒడంబడికకు పునాది రాయి. ఈ శ్లోకం రాజు స్థానంలో మనకు కనబడుతున్న వాడు విష్ణు సంభూతుడే! సాక్షాత్తూ దేవుడే!! కాబట్టి.. సదరు రాజు ఎలాంటి పాలన చేసినా.. తిరుగు బాటు చేయరాదు, సాష్టాంగ ప్రమాణాలతో గౌరవించాల్సిందేనని పురోహితులు ఈ శ్లోకాన్ని తయారుచేసి ప్రజల మెదళ్లలోకి చేరేటట్టు ప్రచారం చేశారు. రాజుపై తిరుగుబాటు చేస్తే పాపం చేసినట్టే.. నరకానికి పోతావు.. అంటూ ప్రజలను భయపెట్టి రాజుల పాలనకు ఎలాంటి ఢోకా లేకుండా చక్రం అడ్డు వేసింది పురోహిత వర్గం. పురోహిత వర్గం రుణాన్ని యధాశక్తి తీర్చుకుంటూ రాజులు సైతం.. సమాజంలో బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యానికి ఎల్లవేళలా అండదండగా నిలిచారు. ఈ దేశంలో మూడు వేల ఏళ్ల పాటు సాగిన వర్ణ-కుల వివక్షా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం రాకుండా కాపాడింది ఈ ఒడంబడికయే! ఈ ఒడంబడికను ధిక్కరించి.. బ్రాహ్మణ సర్ప పరిష్వంగం వదిలించుకొని.. మానవత్వం వైపు నిలిచిన రాజులు ఈ దేశ చరిత్రలో ఓ నలుగురైదుగురే కనపడతారు. ఆ వరుసలో మొదటివాడు గౌతమ బుద్ధుడు కాగా.. సామ్రాట్ అశోకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ పరంపరకు చెందినవారే. ఆధునిక చరిత్రలో.. చత్రపతి సాహు మహారాజ్ మానవత్వాన్ని కావలించుకున్న మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
3 శాతం జనాభాకు 97 శాతం ఉద్యోగాలు..
1874 జూన్ 26న కుంబీ అనే శూద్ర కులంలో జన్మించిన సాహు మహారాజ్.. మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన వీర శివాజీ మనుమడు. 1894లో సాహు మహారాజ్ పాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన రాజ్యంలో నెలకొన్న స్థితిగతులను సునిశితంగా పరిశీలించాడు. 500 మంది రాజాస్థాన ఉద్యోగులు ఉంటే.. అందులో కేవలం పది మంది మాత్రమే బ్రాహ్మణేతరులు ఉన్నారు. 3 శాతం జనాభా ఉన్న వర్గం చేతిలో 97 శాతం ఉద్యోగాలు కబ్జా కాగా.. 97 శాతం జనాభా గల వర్గాలకు 3 శాతం మాత్రమే దక్కినవి. ఇది తీవ్ర అన్యాయమని గుర్తించిన సాహు మహారాజ్ ఆ తప్పును సరిదిద్దడానికే ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. మనుస్మృతి ఆదేశానుసారం కొనసాగిన అన్యా యపు వంద శాతం రిజర్వేషన్లను రద్దు చేసి.. సమానత్వపు రిజర్వేషన్లకు శ్రీకా రం చుట్టాడు. సాహు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసిన తర్వాత 1912 నాటికి సుమారు 200 మంది బ్రాహ్మణేతర వర్గాల ప్రజలు కొలువులు సంపాదించగలిగారు. భారతదేశ చరిత్రలో మనువు మొదటి సారిగా బొక్కబోర్లా పడ్డాడు!
రిజర్వేషన్లు భిక్షతో ఇస్తున్నవి కావు!
ఆధునిక రాజ్యంగా ముందుకు సాగాలని కోరుకునే ఏ సమాజమైనా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను దిద్దుకోవడం.. సమ్మిళిత అభివృద్ధిని సాధించడం అత్యంత అవసరం. చరిత్రలో కొందరు స్వార్థపర, కుల దురహంకార శక్తులు.. మత నమ్మకాల అండతో కొనసాగించిన సామాజిక వివక్షను సమూలంగా నిర్మూలించి.. అన్ని పార్శ్వాలలో సామాజిక న్యాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఆయా వర్గాలకు అందిస్తున్న రిజర్వేషన్లు, ఇతర సానుకూల చర్యలేవి కూడా వారి పట్ల దయతో.. భిక్షగా ఇస్తున్నవి కావు. భరతమాత బిడ్డలందరికీ సమన్యాయం, సమాన అవకాశాలు అందించడమనేది నవ భారత నిర్మాణ ప్రక్రియలో ఒక భాగంగా సాగాలి.
(నేడు 'రిజర్వేషన్స్ డే' సందర్భంగా..)
-ఆర్. రాజేశమ్,
కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక
94404 43183






