- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుస్తకం.. ఓ విజ్ఞాన సర్వస్వం
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు.

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు. పుస్తకానికి ఉండే పవర్ అలాంటిదని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. బడిలో చదివేటప్పుడైనా, ఉద్యోగం చేసేటప్పుడైనా అక్షరాల రూపంలో, పదబంధాల అనుబంధాలతో, వాక్య నిర్మాణాల వరుసలతో పుస్తకాల రూపంలో ఇమిడి ఉంటుంది. సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, రాజకీయమైనా, సామాజికమైనా, రంగమేదైనా, సబ్జెక్టు మరేదైనా పుస్తక రూపం సంతరించుకుంటుంది. అందుకే పుస్తకం.. ఓ విజ్ఞాన సర్వస్వం.
కాలం గిర్రున మారవచ్చు. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక పరిణామాలు జరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయినా.. పుస్తకానికేం ఢోకా లేదు. అది మనకు అనేక రూపాల్లో సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తూనే ఉంది. మారుతున్న కాలంతోపాటు కొత్త రంగులను, హంగులను సంతరించుకుని ఆధునికతలో ఇమిడిపోతోంది తప్ప, పుస్తకం ఆదరణ మాత్రం కోల్పోలేదు. ఇంకెప్పటికీ కోల్పోదు కూడా. ఎందుకంటే ప్రతీ విషయాన్నీ, ప్రతీ అంశాన్నీ అక్షరాల రూపంలో భద్ర పర్చుకునే అన్ లిమిటెడ్ మెమరీ పవర్ కలిగిన విజ్ఞానగని పుస్తకం.
అజ్ఞానపు చీకట్లను చీలుస్తూ..
మానవ వికాసానికీ, సామాజిక విశ్లేషణకూ, సైన్స్ నిరూపణకూ, సాహిత్య ప్రక్రియకూ దేనికైనా పుస్తకమే ఆధారం. అజ్ఞానపు అమావాస్య చీకట్లను చీలుస్తూ.. పున్నమి వెలుగులను ప్రసరిస్తూనే ఉంది పుస్తకం. అపజయాల దారుల్లో కూడా విజయ తీరాలకు చేర్చే మార్గదర్శిగా నిలుస్తోంది పుస్తకం. ప్రతీ సక్సెస్ వెనుక ఒక మంచి పుస్తకం ఉంటుంది. ఒక వ్యక్తి మంచి గుర్తింపు పొందడం వెనుక ప్రేరణగానూ అది నిలుస్తుంది. ఒక వ్యక్తి సైంటిస్టుగా, సైకాలజిస్టుగా, హ్యూమనిస్టుగా, కమ్యూనిస్టుగా, టూరిస్టుగా ఎలా మారడానికైనా పుస్తకం ఒక కారణం అవుతుంది. అంతేకాదు డాక్టర్‌గా, ఇంజినీర్‌గా, మోటివేటర్‌గా, ఫిలాసఫర్‌గా, ఆధ్యాత్మిక వేత్తగా, ఆధునిక మానవుడిగా మనుషులు తమ తమ గుర్తింపులతో ఫోకస్ అవడం వెనుక పుస్తకాల పాత్ర లేదని చెప్పగలిగే దమ్మూ ధైర్యం ఎవరికీ ఉండదు. ((అందుకే పుస్తకానికున్న పవర్ కాంతిశక్తి, విద్యుచ్ఛక్తి, తరంగ శక్తి, ఇలా.. భూమిపై ఉన్న అన్ని రకాల శక్తులకంటే కూడా ప్రభావవంతమైన మహాశక్తిగా చెప్పవచ్చు.))
నడిపించేవి.. మురిపించేవి పుస్తకాలే
కొన్ని పుస్తకాలు మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. కొన్ని మనలో ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంకొన్ని పుస్తకాలు మనల్ని కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తాయి. భావజాలపు బాంధవ్యాన్ని పెంచుతాయి. భౌతికవాద జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి. కొన్ని పుస్తకాలు చారిత్రాత్మక వాస్తవాలను వెల్లడించే వారధులవుతాయి. కొన్ని చరిత్రను వక్రీకరించే చీకటి పుటలు కూడా అవుతాయి. కొన్ని పుస్తకాలు ఉరకలెత్తే ఉత్సాహాన్ని నింపితే. మరికొన్ని ఉద్యమ పాఠాలై విప్లవాగ్ని రగిలిస్తాయి. కొన్ని పుస్తకాలు శరదృతు వర్ణనలై మదిని రంజింపజేస్తాయి. వసంతకాలపు మేఘగర్జనలై మనల్ని తట్టిలేపుతాయి. కృష్ణశాస్త్రి భావుకతలై అలరిస్తాయి. బాపుగీసిన వర్ణచిత్రమై ఆకర్షిస్తాయి.
'వలపు మైదాన’ములై
శ్రీ శ్రీ మహా ప్రస్థానంలోని జగన్నాథ రథచక్రాలై దొర్లుతాయి పుస్తకాలు. చలం రాతల ‘వలపు మైదాన’ములై అలరిస్తాయి పుస్తకాలు. ఎంకిపాటల రాగాలై రంజింపజేస్తాయి పుస్తకాలు. వెన్నెల రాత్రుల్లో విరహ గీతాలై మదిని తడుముతాయి పుస్తకాలు.. పుస్తకాలు చదివితేనే అందులోని అసలైన మాధుర్యం మనకు తెలిసొస్తుంది. పుస్తకం చదివితేనే ఆనందమో, ఆవేదనో, ఆవేశమో, ఆత్రుతో మనల్ని కదిలిస్తుంది. ఇంకెందుకాలస్యం.. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యింది. వెళ్లి తనివి తీరా చూసి, నచ్చిన పుస్తకాన్ని వెంట తెచ్చుకొని పుస్తకం అందించే విజ్ఞానాన్నో, మాధుర్యాన్నో తనివితీరా అనుభవిద్దాం చలో!
- జావిద్ పాషా
94900 99539






