80 కోట్లమంది ఉచితాలపై చూపు... ఇదేం ప్రగతి?

by Disha edit |
80 కోట్లమంది ఉచితాలపై చూపు... ఇదేం ప్రగతి?
X

భారత్ 74వ గణతంత్ర దినోత్సవం ఇటీవలే ఘనంగా జరుపుకున్నాం. ఈ 74 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన జయాపజయాలు సింహావలోకనం చేయడం అవసరం. స్వాతంత్ర్య అనంతరం దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు మన పాలకులు, ప్రజలు కూడా తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ వివిధ రంగాలను అభివృద్ధి పరుస్తూ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచాం. ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. విద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక, వైద్యం అవస్థాపన సౌకర్యాలు కల్పన సేవలు, రక్షణ రంగం ఇలా అన్ని రంగాలలో ఎనలేని అభివృద్ధిని సాధించాము.

74 వసంతాల జయాపజయాలు

నేడు భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ప్రపంచ దేశాల్లో వరి, గోధుమ, చక్కెర, వేరుశనగ, కాటన్, పండ్లు, కూరగాయల ఉత్పత్తులలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నది. పాలు, పప్పు ధాన్యాలు, జూట్ ఉత్పత్తులలో ప్రథమ స్థానంలో ఉన్నది. చక్కెర ఉత్పత్తుల్లో ఒకటవ స్థానంలోనూ, సౌర విద్యుత్ ఉత్పత్తిలో రెండవ స్థానంలోనూ, విద్యుత్ ఉత్పత్తిలో మూడవ స్థానంలోనూ, వస్త్రాల ఉత్పత్తిలో రెండవ స్థానంలోనూ, మొబైల్ పరికరాలు ఉత్పత్తిలో రెండవ స్థానంలోనూ , ఉక్కు ఉత్పత్తిలో రెండవ స్థానంలోనూ ఇలా అనేక రంగాలలో ఉత్పత్తులు గణనీయంగా పెంచుకోగలిగాము. ప్రపంచ దేశాల ఆకలిని తీర్చుతున్న రైతులుగా భారత రైతులు పేరు తెచ్చుకున్నారు. 1950-51 లో 50 మిలియన్ టన్నులు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా నేడు 317 మిలియన్ టన్నులకు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి.

1950లో మన దేశ జనాభా 35 కోట్లు కాగా నేడు 140 కోట్లకు పెరిగింది . ఆనాడు షిప్ టు మౌత్ అంటే ఓడల నుంచి ఆహార ధాన్యాలు వస్తేనే ఇక్కడ మనము వంట చేసుకునే వాళ్ళం. నేడు విదేశాలకు మన ఆహార ధాన్యాలు ఓడల నిండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. అన్నదాతను ఆదుకుంటే దేశ పురోగతి అధికమవుతుంది. జీవన సౌందర్యం ఆహార సంపూర్ణతతోనే ఉంటుంది. అయితే మన రైతు నేడు సంతోషంగా లేడు. అప్పుల బాధలకు తోడు, పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు సమకూర్చే వనరులకు సమానంగా రైతులకు కూడా అందించగలిగితే మన దేశాభివృద్ధి ప్రపంచంలో మకుటాయమానంగా ఉంటుంది.

స్థాపించిన సంస్ధలనే అమ్మేస్తున్నారు.

దేశ స్వాతంత్ర్యం తొలి రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి తద్వారా ఉత్పత్తులను, ఉద్యోగాల కల్పనను పెంచాలనే లక్ష్యంతో మన పాలకులు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. కానీ నేడు అదే సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం అమ్మేయడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్ అయిన విదేశీ కంపెనీలలో 5,068 సంస్థలు వివిధ వ్యాపారాలు చేస్తున్నాయి. అయినప్పటికీ వారి దప్పిక తీరలేదు అన్నట్లుగా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నది. 2017-18 వరకు 3 లక్షల 47 వేల 439 కోట్ల రూపాయలకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన వీలు కాదు. అశేష ప్రజానీకం నిరుద్యోగంతో కనీస సౌకర్యాలు పొందలేకపోతున్నారు. దేశంలో 42.5% సంపద ఒకే ఒక్క శాతం జనాభా దగ్గర ఉన్నది. 1980 నుంచి ఉన్నత ఆదాయ వర్గాలకు చెందిన ఒక్క శాతం జనాభా వాటా మన జాతీయ ఆదాయంలో 150 శాతం పెరిగింది. నూరు మంది సంపన్నుల దగ్గర 54 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ. 50 శాతం జనాభా దగ్గర 2.8 శాతం సంపద మిగిలి ఉంది.

అంబేడ్కర్ ఆనాడే హెచ్చరించారు

సమానత్వం, సోదరభావం లేకుండా ఆర్థిక సామాజిక అసమానతలు దీర్ఘకాలం కొనసాగితే ఆదేశ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని 1949 లోనే భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఆయన సామాజిక అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఆర్థిక అంశాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి సమసమాజాన్ని కాంక్షించినారు. అట్టడుగు వర్గాల వారికి రాజకీయ అధికారం కూడా ఉండాలని భావించారు. ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు రాజ్యం పర్యవేక్షణలో జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వస్తు ఉత్పత్తి ఎలా చేస్తారు, దానిని ఎలా పంచుకుంటారు అనే దానికి అనుగుణంగా సాంఘిక నిర్మాణం, రాజకీయ కార్యాచరణ రూపకల్పన ఉంటే అప్పుడే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించవచ్చునని చెప్పారు. అలాగే రాజకీయంగా సంపూర్ణ స్వరాజ్యం అంటే అందరికీ స్వాతంత్ర ఫలాలు లభించడమేనని జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో తరచూ అనేవారు. భారీ ఉత్పత్తులు కాదు... భారీ సంఖ్యలో ప్రజల చేత ఉత్పత్తులు జరగాలని అనేవారు. అంటే 'మాస్ ప్రొడక్షన్' కాదు 'ప్రొడక్షన్ బై మాసెస్' అనేవారు. ఆర్థిక వ్యవస్థ సైజు ముఖ్యం కాదు షేపు ముఖ్యం అని దీనర్థం. అప్పుడే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుంది. కానీ మన జాతి నిర్మాతలు చేసిన ఈ ప్రబోధం కాలక్రమంలో గాలికెగిరిపోయిందని చెప్పాలి.

బిలియనీర్ల రాజ్యం

భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నేడు మన పాలకులు సంబరాలు చేసుకుంటుంటే ఆర్థిక నిపుణులకు ఆశ్చర్యమేస్తున్నది. స్విస్ బ్యాంక్ ప్రకారం భారత్ పేద దేశం కాదు. ధనికులు ఎక్కువగా ఉన్న పేద దేశం. ప్రపంచ పేదలలో 14 వంతు పేదలు ఉన్నది భారత్‌లోనేనని ప్రపంచ బ్యాంక్ చెబుతున్నది. బ్రిటీష్ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వైపు భారత్ పరుగులు తీస్తున్నదా అని సందేహం లేకపోలేదు. అమెరికా, చైనా తర్వాత ఎక్కువమంది బిలినియర్లు ఉన్న దేశం మనదే. 1990లో ప్రారంభంలో నూతన ఆర్థిక విధానాలు చేపట్టి సరళీకృత ఆర్థిక విధానాలను రూపొందించి ఆదాయ అసమానతలు పెరిగే విధంగా ప్రభుత్వ విధానాలు మారడంతో ఆదాయ సంపదలో వ్యత్యాసాలు మనదేశంలో విపరీతంగా పెరిగాయి. 2020 నాటికి, బ్రిటీష్ వలస పాలన కాలంలో మాదిరి మనదేశంలో ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. 2000 సంవత్సరంలో 9 మంది బిలీనియర్లు మాత్రమే మన దేశంలో ఉండగా 2017 నాటికి 101 పెరిగారు. ప్రస్తుతం వీరి సంఖ్య 166 కి పైగా ఉన్నది.

భారత్ మెరిసిపోతోందా?

74 వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో, దేశ ప్రజలు ఎలా ఉన్నారో, పాలకులు సాధించింది ఏమిటో బేరీజు వేయకుండా అంతా బాగుందని స్వోత్కర్షకు దిగితే, సమసమాజ నిర్మాణాన్ని స్థాపించలేము. పైగా అది మన ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఒకవైపు భారత్ మెరిసిపోతున్నదని చెబుతున్నారు. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు వందల్లో ఉంటే , ప్రధానమంత్రి పేరుతో 20కి పైగా ఉచితాలు (ప్రీ బీస్) అమలవుతున్నాయి. వీటిద్వారా మన దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలు జీవనం సాగిస్తున్నారంటే ఈ దుస్థితి ఎందుకు ఉందో పాలకులకు తెలియాలి. 1947లో దేశ తలసరి ఆదాయం 250 రూపాయలు మాత్రమే కాగా అది నేడు 1 లక్షా 50 వేల రూపాయలుగా ఉన్నది. జాతీయ ఆదాయం పెరిగినందువలన తలసరి ఆదాయం కూడా పెరిగినట్లుగా లెక్కలు ఉంటాయి. కానీ ఆ ఆదాయం పొందని 80 కోట్లకు పైగా పేదలు ఉచితాలవైపు ఎగబడుతున్నారు. దీనికంతా కారణం నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమానతలు, శ్రమసాంద్రతా ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేసుకోకపోవడమే కదా. దీనిని పాలకులు ఇకనైనా గమనించాలి.

డా. ఎనుగొండ నాగరాజనాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి

9866322172

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

జననాడి: ప్రజాధనానికి పూచీకత్తు ఎవరు



Next Story

Most Viewed